Rajasthan : రాజస్థాన్‌లో జూన్ 1 నుంచి వాహనదారులకు షాక్ ఇవ్వబోతున్నారు పెట్రోల్ బంక్ వ్యాపారులు. వచ్చే నెల 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు పెట్రోల్ డీలర్లు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు బంకులు మూసి ఉంచుతామని హెచ్చరించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులతోపాటు పెట్రోల్ పంపుల యజమానులకు షాక్ ఇస్తున్నాయి. ఒక పక్క అనేక ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క తాము కూడా నిర్వహణ ఖర్చులు భరించలేక, చమురు సంస్థల అసంబద్ధ విధానాల వల్ల నష్టపోతున్నామని పెట్రోల్ డీలర్లు అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని పెట్రోల్ బంకులు డీలర్లు, నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అన్ని బంకుల్ని మూసివేసి నిరవధిక నిరసనలకు దిగుతామని వెల్లడించారు. తమ డిమాండ్లను అటు ప్రభుత్వాలు, ఇటు చమురు కంపెనీలు పట్టించుకోవడం లేదన్నారు. చమురు ధరల పెరుగుదల వల్ల తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆయిల్ ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికం కావడం, ఆయిల్ కంపెనీలు అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలు, ప్రభుత్వ వైఖరి కారణంగా తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని పెట్రోల్ డీలర్లు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు, చమురు సంస్థలు సరిగ్గా స్పందించడం లేదన్నారు.
పెట్రోల్ బంకుల యజమానుల ప్రకారం.. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్‌లోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ. దీనివల్ల ఇతర రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ప్రజలు.. పక్క రాష్ట్రాలకు వెళ్లి తక్కువ ధరలో పెట్రోల్, డీజిల్ పోయించుకుని వస్తున్నారు. దీంతో రాజస్థాన్‌లో సేల్స్ పడిపోతున్నాయి. ఫలితంగా చాలా బంకులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందులోనూ గ్రామీణ, చిన్న పట్టణాల్లో పెట్రోల్ వినియోగం చాలా తక్కువ. అలాంటి చోట నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగి, బంకుల నిర్వహణ ఆర్థికంగా భారమవుతోంది.
చమురు సంస్థలు కూడా తగినంతగా ఆయిల్ సరఫరా చేయడం లేదు. డిమాండ్‌కు తగ్గట్లు ఆయిల్ అందించలేకపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువగా ఆయిల్ సరఫరా చేస్తున్నాయి. ఈ కారణంగా బంకులు కూడా వాహనదారులకు సరిపడా పెట్రోల్, డీజిల్ అందించలేకపోతున్నాయి. వాహనదారుల నుంచి సిబ్బందికి వేధింపులు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ దొరకని కారణంగా చాలా మంది వాహనదారులు కోపంతో తమ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవలి కాలంలో నిర్వహణ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఎలక్ట్రిసిటీ బిల్లులు, సిబ్బంది వేతనాలు, సెక్యూరిటీకి, ఎక్విప్మెంట్ నిర్వహణకు భారీగా ఖర్చవుతోంది.
దీంతో తాము నష్టాల పాలవుతున్నట్లు బంకుల యజమానులు చెబుతున్నారు. చమురు సంస్తలు మాత్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయన్నారు. తమ ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు వ్యాట్ తగ్గించాలని డీలర్లు కోరుతున్నారు. దీనివల్ల చమురు ధరలు తగ్గి, వినియోగం పెరుగుతుందని వారి ఉద్దేశం. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం కూడా సరిగ్గా స్పందించడం లేదు. అందుకే ప్రభుత్వానికి నాలుగు రోజుల సమయం ఇచ్చామని, ఈ లోగా సమస్యలు పరిష్కరించకుంటే తాము జూన్ 1 నుంచి పెట్రోల్ బంకులు మూసివేస్తామని డీలర్లు తెలిపారు.
ఇదే జరిగితే రాజస్థాన్ వ్యాప్తంగా రవాణాకు ఇబ్బందులు తప్పవు. ప్రజా రవాణాతోపాటు, సరుకుల రవాణా కూడా నిలిచిపోతుంది. నిత్యావసర ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.