రైతుల ఆందోళనకు తలొగ్గి గతంలో వెనక్కి తీసుకున్న మూడు సాగు చట్టాల్లోని అంశాలకు వేరే ముసుగులు తగిలించి తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎత్తులు వేస్తున్నదా? అప్పట్లో వాటి రద్దు సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం ఇప్పుడు పోరాడుతున్న రైతులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కోసం పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద రైతులు పది నెలలుగా ఆందోళన చేస్తుంటే వారితో చర్చలకు ముందుకు రాకపోగా, ఇప్పుడు రద్దు చేసిన సాగు చట్టాలకు మించిన భయంకరమైన యంత్రాంగాన్ని మరో రూపంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నది.
‘కాలగర్భంలో కలిసిపోయాయను కున్న మూడు నల్ల చట్టాలు మళ్లీ నెత్తిన పడతాయన్న భయం రైతులను వెంటా డుతున్నది. అందుకు తగ్గట్టుగానే ‘అగ్రికల్చర్ మార్కెటింగ్’ (ఎన్పీఎఫ్ఏఎం)పై కేంద్రం జాతీయ విధాన ముసాయిదా రూపొందించడం రైతుల ఆందోళనకు గురిచేస్తున్నది. 2021లో రద్దుచేసిన మూడు సాగు చట్టాలను దొడ్డి దారిన తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నమని, వాటి తో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘కిసాన్ ఆందోళన్-2.0’ పేరుతో 9 నెలలుగా కొనసాగుతున్న పోరాటంలో కిసాన్ యూనియన్ సిద్దూపూర్ రాష్ట్ర అధ్యక్షుడైన జగ్జీత్సింగ్ డల్లేవాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. హర్యానా-పంజాబ్ సరిహద్దులోని ఖనౌరీలో నవంబర్ 26న ఆయన ఆమరణ దీక్ష చేపట్టి రైతు ఉద్యమాన్ని మలుపుతిప్పారు. దీని తర్వాత రైతు ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. డల్లేవాల్ దీక్షను భగ్నం చేయడం, రైతుల ఒత్తిడితో తిరిగి విడుదల చేయడం వివాదాస్పదమైంది. సుప్రీం ఆదేశాలతోనే డల్లేవాల్ దీక్షను భగ్నం చేశామని పోలీసులు అంటుంటే.. తామెన్నడూ అలా ఆదేశించలేదని సర్వోన్నత న్యాయస్థానం చెప్తున్నది.
ఇక, పంట ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) మార్కెట్లను రద్దు చేయడంతోపాటు కాంట్రాక్ట్ సాగును ప్రోత్సహిస్తూ నిరుడు నవంబర్ 25న ముసాయిదా విధానాన్ని కేంద్రం విడుదల చేసింది. గతంలో తీసుకొచ్చిన మూడు సాగుచట్టాల్లో ఇది కూడా ఒకటి కావడంతోనే అప్పట్లో రైతులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇప్పుడు మళ్లీ దీనిని దొడ్డిదారిన తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుండటంపై మరోమారు పిడికిలెత్తారు. గత హామీల అమలు కోసం పోరాడుతుంటే అది పట్టని కేంద్రం ఇప్పుడు సాగు మొత్తాన్ని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే
ఆలోచన చేస్తుండటం రైతులను విస్మయానికి గురిచేస్తున్నది.
దీనికితోడు పంజాబ్లో ఏంపీఎంసీ మార్కెట్ల విధానాన్ని సమూలంగా మార్చాలని చూస్తుండటంతో రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అంతేకాదు, ముసాయిదా పాలసీపై స్పందించేందుకు రాష్ర్టాలకు కేం ద్రం రెండువారాల సమయం మాత్రమే ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదేనని అంటున్నారు. కాబట్టి పంజాబ్ వెంటనే దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, అన్ని రాష్ర్టాలు ఇదే వైఖరి అవలంబించాలని రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వం విడుదల చేసిన అగ్రికల్చర్ మార్కెటింగ్ ముసాయిదా పాలసీలో ప్రైవేటు హోల్సేల్ మార్కెట్లను ఏర్పాటు చేయడం, ప్రాసెసర్లు, ఎగుమతిదారు లు, వ్యవస్థీకృత రిటేలర్లు, బల్క్ బయ్యర్లను నేరుగా హోల్సేల్ కొనుగోలుకు అనుమతించడం వంటివి రైతుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ సాగుపై ప్రభుత్వం పట్టుబట్టడం విమర్శలకు గురవుతున్నది. ఇది అమల్లోకి వస్తే తమ పొలంలో తామే కూలీలుగా మారిపోతామన్న భయం వారిలో వ్యక్తమవుతున్నది. మరోవైపు, దీనిపై రైతుల ఆందోళన అవసరం లేద ని, వారి మేలుకోసమే దీన్ని తీసుకొస్తున్నట్టు కేంద్రం చెప్తున్నది. ప్రైవేటు మార్కెట్ల మధ్య పోటీ పెరిగితే రైతుల మేలుకే దోహదం చేస్తుందని, వారి నికర ఆదాయాన్ని పెంచాలన్నదే తమ యోచన అని కేంద్రం వాదిస్తున్నది.
ఎన్పీఎఫ్ఏఎం నిస్సందేహంగా రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు ‘బ్యాక్ డోర్ ఎంట్రీ’ ఇస్తుందని ఎస్కేఎం నేత రాజేవా ల్ చెప్తున్నారు. కొత్త ముసాయిదా విధానంతో ప్రైవేటు వ్యాపారులకు గిడ్డంగులు నిర్మించుకునేందుకు అనుమతి లభిస్తుందని, కాబట్టి ఇది ఆమోదయోగ్యం కాదం టున్నారు. ఏది ఏమైనా ఈ పాలసీని వ్యతిరేకించి తీరుతామని రైతులు భీష్మించుక్కూర్చున్నారు. రైతు సంఘాలను మరోమారు ఏక తాటిపైకి తెచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని, ఇందుకోసం ఎంతవరకైనా కొట్లాడతామని ఆ సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు.
– ఎడిటోరియల్ డెస్క్