అన్ని అర్హతలున్న సిరిసిల్లకు మెగా టెక్స్టైల్ పవర్ క్లస్టర్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కేంద్ర టెక్స్‌టైల్స్‌శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు ఘాటుగా లేఖ రాశారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటులో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నదని విమర్శించారు. లేఖ సారాంశం..
గౌరవ కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ గారికి, సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు డిమాండ్ ఇప్పటిది కాదు.. మేం పన్నేండేండ్లుగా నిరంతరం పోరాడుతున్నాం. గతంలో మంత్రిగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేంద్రానికి డజన్లకొద్దీ లేఖలు రాశాను. అనేకసార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించాను. పలుసార్లు అధికారిక సమావేశాల్లో సంబంధిత అధికారులు, మంత్రి, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేశాను. అరుణ్‌జైట్లీ, స్మృతి ఇరానీ మొదలుకొని ప్రస్తుత మంత్రి గిరిరాజ్‌సింగ్ వరకు ప్రతి ఒక్కరినీ కోరాను. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదు.
తెలంగాణ వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల గుండెకాయలాంటిది. సీపీసీడీఎస్ నిబంధనల మేరకు మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు విషయంలో ఈ ప్రాంతానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ 30 వేలకు పైగా పవర్‌లూమ్స్ ఉన్నాయి. వీటిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. క్లస్టర్ ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర అధికారిక బృందాలే ధ్రువీకరించాయి. అయినప్పటికీ ఫైళ్లను పక్కనబెట్టడం ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ అంటే బీజేపీ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? ఇది కేవలం నిర్లక్ష్యం కాదు.. తెలంగాణ అభివృద్ధిని, ముఖ్యంగా ఇక్కడి నేతన్నలపై కేంద్రం చూపుతున్న వివక్షే.
సిరిసిల్ల కంటే తక్కువ సామర్థ్యం, తక్కువ కార్మికశక్తి ఉన్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతాలకు మెగా క్లస్టర్లను మంజూరు చేసిన మోదీ ప్రభుత్వం, అన్ని అర్హతలు కలిగిన సిరిసిల్లను పక్కనబెట్టడం ప్రాంతీయ వివక్షకు పరాకాష్ట. సిరిసిల్లకు మెగా క్లస్టర్ రాకపోవడానికి కారణం మెరిట్ లేకపోవడం కాదు. ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై ఉన్న కక్షే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన భూమి కేటాయించింది. నిరంతర విద్యుత్తు సరఫరా, నీరు, సింగిల్‌విండో విధానంలో అనుమతులు సమకూర్చాం. రాష్ట్రస్థాయి ప్రోత్సాహకాలు అంది ంచాం. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి.
కానీ ఎలాంటి సాంకేతిక, ఆర్థిక కారణాలు చూపకుండా కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ మెగా టెక్స్టైల్ క్లస్టర్ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్ట డం సరికాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నినాదాలకే పరిమితమైంది. విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఒక వైపు ’మేక్ ఇన్ ఇండియా’, ఆత్మనిర్భర్ భారత్’ అంటూ గొప్పలు చెప్పుకుంటూ దేశంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన సిరిసిల్ల లాంటి వస్త్రపరిశ్రమకు మద్దతు ఇవ్వకపోవడం శోచనీయం. ఈ వైఖరి బీజేపీ ప్రభుత్వం ద్వంద్వనీతికి, చిత్తశుద్ధిలేమికి అద్దం పడుతున్నది. మోదీ సర్కార్ చేస్తున్న జాప్యంతో సిరిసిల్ల నేతన్నలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కేసీఆర్ పాలనలో కళకళలాడిన చేనేత రంగం కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సంక్షోభంలో కూరుకుపోయింది. పట్టించుకొనే నాథులు లేక మరమగ్గాలు పడకేశాయి. పదేండ్లుగా ఆగిపోయిన నేతన్నల ఆత్మహత్యలు మళ్లీ మొదలవడం కలిచివేస్తున్నది. నేత కార్మికుల బలవన్మరణాల వార్తలు విని గుండె తరుక్కుపోతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు నేతన్న బీమా, నేతన్న భరోసా లాంటి అనేక సంక్షేమ ఫలాలు అందించి అండగా నిలిచింది. కానీ రెండేండ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి కీలక తరుణంలో మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా, మెగా క్లస్టర్‌ను మంజూరు చేయకుండా జాప్యం చేస్తున్నది. నేతన్నల పొట్టకొట్టేలా కేంద్రం తీరు ఉన్నది. సమాఖ్య వ్యవస్థలో అభివృద్ధి విషయంలో రాజకీయ ప్రయోజనాలు చూడటం, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అభివృద్ధి పరిమితం చేయడం బాధాకరం.
తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదనే నెపంతో మెగా క్లస్టర్ మంజూరు, ఇతర పథకాల అమలులో నిర్లక్ష్యం చేయడం శోచనీయం. బీజేపీ తెలంగాణను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నదనే భావన ఇక్కడి ప్రజల్లో బలంగా ఉన్నది. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా సిరిసిల్ల నేతన్నల గోడును మోదీ ప్రభుత్వానికి వినిపించడంలో విఫలమయ్యారు.. ఇక్కడి ప్రజల మద్దతుతో గెలిచి ఢిల్లీలో ఉత్సవ విగ్రహాల్లా మారారు. బీజేపీ నేతలు ఓట్ల కోసమే తెలంగాణను వాడుకుంటున్నరు.
నిధుల సాధనలో చేతులెత్తేశారు. కేంద్రం రానున్న బడ్జెట్లోనే సిరిసిల్ల మెగా వపర్లూమ్ క్లస్టర్‌ను ప్రకటించాలి. పదేండ్లపాటు చేసిన అన్యాయానికి ముగింపు పలకాలి. రాజకీయాలకు అతీతంగా సహకార సమాఖ్య స్ఫూర్తితో తెలంగాణ నేత కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్రమంత్రి సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యమవుతున్నకొద్దీ నేతన్నలలో ఆవేదన ఆగ్రహంగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రి తక్షణమే జోక్యం చేసుకొని మెగా టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలుపాలి.
ఇట్లు
కే తారకరామారావు
మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు