‘మన కులాలను కూడా కులతత్వం పట్టిపీడిస్తున్నది. అంటరాన్ని తనాన్ని తొలగించాలని ఇతరులను మనం డిమాండ్ చేస్తున్నప్పుడు, మనలో ఉన్న అంతర్గత విభజనలను తొలగించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఎక్కువగా ఉంటుంది’ అని 1944 జనవరి 29న కాన్పూర్లో జరిగిన ఓ సమావేశంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. అందుకనుగుణంగా ఆయన రాసిన రాజ్యాంగంలోనూ లక్ష్యాలను నిర్దేశించారు.
Sub Classification | 2024, ఆగస్టు 1న ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు షెడ్యూల్డ్ కులాల చరిత్రలోనే ఒక మైలురాయి వంటిది. ఎస్సీ కులాలన్నీ, ఏకశిలా సదృశ్యమైనవి కావని అసమానతలతో కూడిన, భిన్నతలతో కూడిన కులాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సామాజిక వాస్తవికతకు ఈ తీర్పు అద్దం పడుతుంది. ఆ తీర్పును ప్రతీ బహుజనుడు స్వాగతించాలి.
గత మూడు దశాబ్దాలుగా అనేక మలుపులు తిరుగుతూ కొనసాగుతున్న ఈ వివాదం దళితుల మధ్య ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నది. ఫలితంగా దళిత ఉద్యమానికి, దానితో ముడిపడి ఉన్న బహుజనోద్యమానికి, బహుజన రాజకీయ పోరాటానికి ఎనలేని హాని జరుగుతుంది. ఈ హానికరమైన సంక్షోభానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా చరమగీతం పాడాలి. మాల, మాదిగ నాయకత్వాలు, పెద్దలు కూర్చొని చర్చించుకొని వాస్తవికమైన, హేతుబద్ధమైన, న్యాయబద్ధమైన పరిష్కారాన్ని రూపొందించాలి.
భారత రాజ్యాంగ లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను సాధించాలంటే కుల, తెగ, ప్రాతిపదికలపై రిజర్వేషన్ల వర్గీకరణే మరో ముందడుగు. భవిష్యత్తులో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చగలిగే దిశగా ఈ వర్గీకరణ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్లిష్లమైన నిచ్చెనమెట్ల వర్ణ, కుల, వర్గ సమాజంలో వేల ఏండ్లుగా ప్రజలు వేల కులాలుగా విడగొట్టి ఘనీభవించిపోయాయి. సమాజమంతా ఒకే భారతజాతిగా నిజమైన అర్థంలో రూపొందాలంటే ఈ కులాల మధ్య అసమానతలను తొలగించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నట్టు సామాజిక న్యాయం ఇరుసుగా సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించాలంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే పునాది.
విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రతి కులం, తెగ, పాల్గొనే స్వేచ్ఛ, సమానత్వాలు నెలకొన్నప్పుడే కులాల మధ్య సోదరభావం నెలకొంటుంది. అలాంటి మహత్త ర లక్ష్యాలను సాధించాలంటే ఏ కులానికి ఆ కులం, ఏ తెగకు, ఆ తెగ సమస్త రంగాలలో ‘మేమెంతమందిమో మాకంత వాటా’ అన్న నినాదం చైతన్యం కావాలి. ఈ దృష్టి కోణం నుంచి ఆలోచించినప్పుడే 1994లో ఉమ్మడి ఏపీలోని ప్రకాశం జిల్లా ఈదునూరు గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఏర్పడిన ఎమ్మార్పీఎస్ మాదిగ హక్కుల దండోరా రూపంలో మానవ హక్కుల దండోరాను మోగించిందనే విష యం అర్థమవుతుంది. ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ఈ చారిత్రాత్మక పాత్ర భవిష్యత్తులో, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందనేది అక్షరాల సత్యం.
భారతదేశ జనాభాను బ్రిటిష్ కాలం అంటే, 1931లో కులాలవారీగా లెక్కలు తీశారు. సుమారు వందేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు కులాలవారీగా లెక్కలు తీయకపోవడం గమనార్హం. ఇప్పటికైనా విద్య, ఉద్యోగ, సాంఘిక, ఆర్థిక, స్థితిగతులతో కూడిన కులాలవారీ జనాభా గణనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. శాస్త్రీయమైన జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను వర్గీకరించాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాలి.
(నేడు బహుజన మహాసభ ఆధ్వర్యంలో ‘ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ, భారత రాజ్యాంగ లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల సాధనకు, భారతజాతి నిజమైన సమైక్యతకు ముందడుగు’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు)
(వ్యాసకర్త: మాజీ రాష్ట్ర కార్యదర్శి, దళిత బహుజన శ్రామిక ముక్తి)
– సాదు మాల్యాద్రి 91004 34216