రాఖిట్ల పండక్కి శెల్లత్తందని మత్లబ్ రాంగనే చేను కాడున్న మేమిద్దరం అద్ద గంటల ఇంట్ల వడ్డం
మా ఇద్దరన్నదమ్ముల తోడబుట్టిన ఒక్కగానొక్కతి మా శెల్లే
శెల్లంటే ఆకిటి నిండా ముగ్గులేసే మా గల్మల లచ్చిమి
మా ఇంటి కురాడు కుండను పుదిచ్చే ఆడ బిడ్డ మా గారాల శెల్లే
వాన పడ్తాంటే శిలుక్కొయ్యకున్న ఛత్రి చేతికిచ్చి పొలం కాడికి సాగదోలేది
నా అరికాలికి ముల్లు దిగితే పిన్నీసు పట్కొని ఉర్కొచ్చేది
చిన్నప్పుడు రాఖీ పండగ పూట ఊల్లే దుక్నంకి ఉర్కి పోవ్
ఏరేరి ఎడల్పున్న రెండు నెమలీకల రాఖీలు కొనుక్కత్తే
అమ్మ రెండు పీటలేసి దేవునల్రున్న తప్కు మాణిక్యాలు పట్కొత్తే
శెల్లెమో పళ్లెంల రాకీట్లు, రవ్వ లడ్డూలతో నవ్వుకుంటచ్చేది
ఆ నవ్వులో మా ఇద్దరన్నదమ్ముల ఒక్కగానొక్క శెల్లననే గర్వముండేది
నొసలుకు బొట్టు పెడ్తాంటే రక్త బంధం ఎన్రి కుంకుమై మెరిసిపోతుండే
మణికట్టుకు రాఖీలు కట్టి నోట్ల శెర్కర పోసి అల్ముకుని పామురపడేది
కాళ్ళు మొక్కుడు తప్ప కట్నమంటే తెల్వనితనం
కాలం జప్ప జప్ప కరిగితే శెల్లికి లగ్గంజేశి గడప దాటిచ్చినం!
బతుకులు మార్తాంటే గుణం గునపం లెక్క మార్తదేమో
ఈ యేడు రాఖీ ఇంకో లెక్కన అగుపడింది…రెండెకరాల చేను రాసియ్యమని
ఎండి రాఖీలు కట్టి, కిలో స్వీట్ డబ్బా ముందల వెట్టింది మా శెల్లమ్మ
అయినా శెల్లె సూడని బతుకుల మాయి
శెల్లే నువ్వత్తన్నవంటే చేను కాన్నుండి నడ్సి వచ్చినయి
మా కాళ్ళు కాదే మా కండ్లు
ఇయ్యాల చేను రాసియ్యమన్నవట్టే
లోకం మా శెల్లికి సుత మందు వెట్టింది
అన్నా శెల్లెల్ల బంధాలెప్పుడు శెర్కర తీరుండయని ఈ యేడు రాఖీ పండుగ సెప్పింది
ఈ కాలంల అన్నల కన్నీళ్ళ బరువు కంటే, పెట్టె కట్నాల బరువే సూడవట్టిరి
బంధాలన్నీ దూరమైతాంటే బజార్ల బంగారు, ఎండి రాఖిట్లు తేలి ఏం లాభం సెపుండ్రి.
తుమ్మల కల్పన రెడ్డి
96404 62142