గాంధర్వలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన పాటల పూదోట. ఆ తోటలో విరబూసిన పసిడి పంట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన గొంతు విప్పితే అమ్మ జోల పాడినట్టుగా పసిపాప కూడా హాయిగా నిద్రలోకి జారుకోవాల్సిందే. అంత అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులకు పసందైన వీనుల విందునందించారాయన. ఆయన స్వరం అద్భుతం, అనన్య సామాన్యం. ఆయన పాట వింటే గాయపడిన హృదయాలు సైతం ప్రశాంతంగా తన్మయత్వంలో మునిగిపోవాల్సిందేననడంలో అతిశయోక్తి లేదు. విభిన్న స్వరాలతో పాటలు పాడుతూ తన గాత్ర ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు బాలు. ఆయన గొంతులో పలుకని పదం లేదు. పాడని రాగం లేదు. తన గానంతో లక్షలాది మనసులను అలరింపజేసిన ఘనుడు గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.
బాలు పాట తరగని మాధుర్యం. ఆహ్లాదకరమైన శ్రావ్యత ఆ స్వరం ప్రత్యేకం. నిజానికి బాలు స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సన్నివేశానికి అనుగుణంగా ఎమోషనల్‌గా, సహజంగా పాటకు ప్రాణం పోయడంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని మించిన వారు లేరనే చెప్పాలి. దైవభక్తి, దేశభక్తి గేయాలు, బృందగీతాలు, ప్రణయ, విరహ, శృంగార, కరుణామయ, జానపద గీతాలు అనేకం సందర్భానుసారంగా రాగయుక్తంగా, భావయుక్తంగా, వైవిధ్యభరితమైన వేల పాట లు పాడి తెలుగు వారి మదిలో శాశ్వత స్థానాన్ని పొందిన అమరగాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.
ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆయన గాన ప్రస్థానంలో తెలుగు పాటలే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మొత్తం 16 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన ఘనత బాలసుబ్రహ్మణ్యానిదే. తిరుగులేని గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, అత్యధిక సంఖ్యలో గీతాలు ఆలపించిన గాయకుడుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు బాలు.
ఆయన ఆలపించిన గీతాలు, చేసిన కృషికిగాను ఆరు జాతీ య చలనచిత్ర అవార్డులు, తెలుగు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 25 నంది అవార్డులు, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా ఆరు ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకోవడం తెలుగు రాష్ర్టాల ప్రజలు గర్వించదగిన విషయం. 1981 ఫిబ్రవరి 8న కన్నడలో 24 గంటలపాటు ఏకధాటిగా, ఎలాంటి విరామం లేకుండా 27 పాటలు ఆలపించి సరికొత్త రికార్డు సృష్టించారు. అదేవిధంగా తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు విరామం లేకుండా పాడి రికార్డు సృష్టించారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హరికథా కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు 1946 జూన్ 4న జన్మించారు. ఆయన తండ్రి హరికథా కళాకారుడు అవడంవల్ల బాలసుబ్రహ్మణ్యానికి సంగీతంపై ఆసక్తి కలిగింది. తండ్రికి కూడా బాలు సంగీత కళాకారుడు కావాలనే కోరిక బలంగా ఉండేది. బాలసుబ్రహ్మణ్యం చిన్నతనంలోనే సంగీత సంజ్ఞామానాలను అభ్యసించి, తన స్వయంకృషితో సంగీతం నేర్చుకున్నారు. చిన్నతనం నుంచే పాటల పోటీలో పాల్గొని ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో అనంతపురం జేఎన్టీయులో చేరారు. బాలుకు మొద ట సంగీత కళాకారుడిగా కాకుండా తన తండ్రి ఆశయం మేర కు ఇంజినీరింగ్ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. కానీ ఆ సమయంలో అనారోగ్యం కారణంగా మధ్యలోనే చదువు మానేశారు. ఆ తర్వాత గాయకుడిగా రాణించడానికి నిర్విరామ కృషి చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన గాయకుడిగానే స్థిరపడ్డారు. అనేక వేదికల మీద వందలాది పాటలు పాడారు.
ఎస్పీ కోదండపాణి స్వరపరిచిన తెలుగు సినిమా శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నలోని ‘ఏమి ఈ వింత మోహం’ పాటతో బాలు ప్లేబ్యాక్ సింగర్‌గా 1966 డిసెంబర్ 15న సినీ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 19 68లో సుఖదుఃఖాలు చిత్రంలో ‘మేడంటే మేడా కాదు’ పాట తెలుగు చిత్రసీమలో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించే కె.విశ్వనాథ్ దర్శకునిగా 1980 లో విడుదలైన సంగీత ప్రాధాన్యం గల చిత్రం ‘శంకరాభరణం’తో బాలసుబ్రహ్మణ్యంకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతేకాకుండా ఆయన కృషికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు తో సత్కరించింది. ఆ తర్వాత సంవత్సరమే ‘ఏక్ దూజే కే లియే’ హిందీ చిత్రానికి మరో జాతీయ అవా ర్డు లభించింది. ఆయన గాత్రం అందించిన ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’, ‘రుద్రవీణ’, ‘మాతృదేవోభవ’లతో పాటు కె.విశ్వనాథ్ నిర్మించిన చిత్రాలన్నిటిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వినిపిస్తాయి. అగ్ర హీరోలందరికీ బాలు పాటలు పాడారు.
1989లో సల్మాన్ ఖాన్ నటించిన హిందీ చిత్రం ‘మైనే ప్యార్ కియా’లో ‘దిల్ దీవానా’ పాటకు బాలు ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన చాలా చిత్రాలకు ప్లేబాక్ సింగర్‌గా పనిచేశారు. బాలు, లతా మంగేష్కర్ కలిసి పాడిన హిందీ చిత్రం ‘ఆప్కే హై కౌన్’ లోని ‘దీదీ తేరా దేవర్ దీవానా’ పాట అత్యంత ప్రజాదరణ పొందడమే కాక హిందీ చలన చిత్రంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
కమల్ హాసన్, రజినీకాంత్, విష్ణువర్ధన్, సల్మాన్ ఖాన్, కె. భాగ్యరాజ్, మోహన్, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమినీ గణేశన్, అర్జున్ సర్జా, నగేష్ , కార్తీక్ సహా పలువురు కళాకారులకు బాలసుబ్రహ్మణ్యం తన గొంతును అందించారు. 2001లో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నతపురస్కారం ‘పద్మశ్రీ’ అందుకున్నారు.
2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీ య అవార్డు, 2015లో కేరళ ప్రభుత్వం నుంచి హరివరాసనం అవార్డును అందుకున్నారు. 2016లో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించబడ్డారు. అత్యం త బాధాకరమైన విషయం ఏమంటే 2020 సెప్టెంబర్ 25న బాలు అందుకోవాల్సిన ‘పద్మ విభూషణ్ కొవిడ్ కారణంగా ఆలస్యమవడం, కొవిడ్ కారణంగానే ఆయన మరణించడం కాకతాళియమే. బాలు మరణానంతరం 2021లో ఆయన కుటుంబానికి పద్మ విభూషణ్ అవార్డు ప్రదానం చేశారు.
ఎందరో నటీనటులకు వారి హావభావాలకు, అభినయ రీతులకు అనుగుణంగా పాటలకు ప్రాణం పోశారు బాలసుబ్రహ్మణ్యం. అందుకే అమర గాయకుడు ఘంటసాల తర్వాత తెలుగు సినిమా పాటకు అసలైన వారసుడయ్యారు. పదాల సరళిని జాగ్రత్తగా గమనిస్తూ పాడే బాలు పాటను పండితులకు దగ్గర చేశారు. ఆయన పాటలు శ్రోతలను మంత్రముగ్ధ్దులను చేశా యి. మనిషికి మరణం కానీ, పాటకు మరణం లేదనడంలో అతిశయోక్తి లేదు. బాలు భౌతికంగా మాత్ర మే మనమధ్య లేరు. ఆయన రాసిన , పాడిన పాట ల్లో సజీవంగా నిలిచే ఉంటారు. చరిత్రలో నిలిచిపోతారు. బాలు పాట చిరస్మరణీయం.
-కోట దామోదర్
93914 80475