Delimitation | దేశంలో ఒకవైపు మతం, ప్రాంతం, కులాలపేరుతో విచ్ఛిన్నకర ధోరణులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఆర్థిక అసమానతలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలక పక్షాలు కొందరి వ్యాపార సామ్రాజ్యాల విస్తరణకు ఊతమిస్తూ వారిని ప్రపంచ సంపన్నుల జాబితాలోఅగ్రభాగాన చేరడానికి సహకరిస్తున్నాయి. తెర వెనుక నుంచి కొన్ని వ్యవస్థలను కొందరు శాసించే స్థాయిలో ఉన్నప్పటికీ పార్లమెంటు చర్చలు, చట్టాల ద్వారా కొంతమేర వారి శక్తికి అడ్డుకట్ట వేయగలమన్న ఆశ ఇప్పుడు కొడిగట్టే స్థితికి చేరుకున్నది. పునర్వి భజన పేరుతో ఒక వ్యక్తి -ఒక ఓటు-ఒక విలువ అన్న ప్రజాస్వామిక, రాజ్యాంగ మౌలిక సూత్రంతో లోకసభ నియోజకవర్గాల పునఃకేటాయింపు, పునర్విభజన జరిగితే తద్వారా జరిగే పార్లమెంట్ స్థానాల పెంపుదల దక్షిణ, ఉత్తర భారత దేశాల మధ్య వివక్ష విద్వేషంగా మారుతుందా? అనే సందేహం కలుగుతున్నది.
1976లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నెలల ఎమర్జెన్సీ కాలంలో 2001 వరకు లోక్‌సభ స్థానాల సంఖ్యలోఎటువంటి మార్పు చేర్పులు లేకుండాచేశారు. దీనికి ప్రధాన కారణం దేశంలో జనాభా నియంత్రణ ప్రణాళిక అమలు చేస్తున్న రాష్ర్టాలు నష్టపోకూడదనే. తదుపరి 2002లో అటల్ బిహారి వాజపేయి నాయకత్వంలోఎన్డీఏ ప్రభుత్వం 84వ రాజ్యంగ సవరణ తీసుకువచ్చి 2026 తరువాత జరిగే జనాభా లెక్కల ప్రకారం స్థానాల సంఖ్య పెంపుదల చేయాలని, అలాగే 87వ సవరణ ద్వారా 2003లో వివిధ రాష్ర్టాల్లో పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాల సంఖ్య మారకుండా జిల్లాల్లో పెరిగిన, తగ్గిన జనాభాకు అనుగుణంగా పునర్విభజన చేయాలని నిర్దేశించింది. దాని ఫలితంగా జస్టిస్ కుల్దీప్సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ పార్లమెంట్, అసెంబీ ్లస్థానాల పరిధిలో జనాభా సమానంగా ఉండేటట్టు పునర్విభజన చేసి 2008లో ఇచ్చిన ఉత్తర్వులు నేడు అమల్లో ఉన్నాయి.
దక్షిణాది రాష్ర్టాలు తాము ఆదాయ వనరుల పెంపుదల్లో దేశానికి కీలకం కాగా, పంపిణీలో తాము వివక్షకు లోనవుతున్నామని, 4 దశాబ్దాలుగా జనాభా నియంత్రణ గణనీయంగా అమలు చేయటం ద్వారా సగటు వ్యక్తి వ్యయాన్ని దక్షిణాదిలో భారీగా తగ్గించి దేశానికి ఆ మేర కూడా లబ్ధి చేకూర్చుతున్నామన్న భావనలో ఉన్నారు. భారీ పెట్టుబడుల్లో ప్రధానమైన బుల్లెట్ రైళ్లు, ఓడరేవులు, రక్షణ రంగ ఇతర కర్మాగారాలు, రహదారులు, పారిశ్రామికవాడల ఏర్పాటులో కేంద్రప్రభుత్వం ఉత్తరాదికి అగ్రతాంబూలం ఇస్తున్నదన్న ఆందోళనలో ఉన్నారు.
రాజ్యాధికారంలో తీవ్ర వివక్ష నెలకొనటానికి దక్షిణాది రాష్ర్టాల్లో పార్లమెంటు స్థానాల సంఖ్య తక్కువగా ఉండటం ఒక కారణంగా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన తదుపరి అధికారంలో ఉన్న బీజేపీ డీలిమిటేషన్ దిశగా ఆలోచన చేస్తుందనే ప్రచారం ఊపందుకున్నది.
ప్రతి పదేండ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ర్టాలలో తగ్గిన లేదా పెరిగిన జనాభా నిష్పత్తికి అనుగుణంగా సదరు రాష్ర్టాల్లో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను సవరించాలని రాజ్యాంగం నిర్దేశించింది. దేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1951లో 400 లోక్‌సభ స్థానాలు ఉండేవి. 1957లో 403 స్థానాలకు పెరగగా, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుచేసిన స్థానాలు కాకుండా 91 స్థానాల్లో జనరల్ కేటగిరితోపాటు మరో రిజర్వు (ఎస్సీ, ఎస్టీ) పార్లమెంటు సభ్యుడిని ఎన్నుకునే (ద్విసభ్య) నియోజకవర్గాలు ఏర్పాటుచేశారు. దీనివల్ల స్థానాల సంఖ్య 403లో మార్పులేకున్నా ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 494కు పెరిగింది. ఇది ఎస్సీ, ఎస్టీలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెంచి వారి గళాన్ని వినిపించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. దరిమిలా 1962లో జరిగిన ఎన్నికలు 494 స్థానాలు ఏకసభ్య నియోజగవర్గాలకే జరిగాయి. 1961లో 45 కోట ్లజనాభా ప్రకారం జరిగిన పునర్వి భజన వలన 1967 ఎన్నికల నాటికి లోక్‌సభలో 520 స్థానాలు, 1971 జనాభా లెక్కలప్రకారం 1977 నాటికి 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1976లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నెలల ఎమర్జెన్సీ కాలంలో 2001 వరకు లోక్‌సభ స్థానాల సంఖ్యలోఎటువంటి మార్పు చేర్పులు లేకుండాచేశారు. దీనికి ప్రధాన కారణం దేశంలో జనాభా నియంత్రణ ప్రణాళిక అమలు చేస్తున్న రాష్ర్టాలు నష్టపోకూడదనే. తదుపరి 2002లో అటల్ బిహారి వాజపేయి నాయకత్వంలోఎన్డీఏ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి 2026 తరువాత జరిగే జనాభా లెక్కల ప్రకారం స్థానాల సంఖ్య పెంపుదల చేయాలని, అలాగే 87వ సవరణ ద్వారా 2003లో వివిధ రాష్ర్టాల్లో పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాల సంఖ్య మారకుండా జిల్లాల్లో పెరిగిన, తగ్గిన జనాభాకు అనుగుణంగా పునర్విభజన చేయాలని నిర్దేశించింది. దాని ఫలితంగా జస్టిస్ కుల్దీప్సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ పార్లమెంట్, అసెంబీ ్లస్థానాల పరిధిలో జనాభా సమానంగా ఉండేటట్టు పునర్విభజన చేసి 2008లో ఇచ్చిన ఉత్తర్వులు నేడు అమల్లో ఉన్నాయి.
దేశంలో నేడు దాదాపు 141 కోట్లకు చేరుకున్న జనాభా, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల దృష్ట్యా 1971లో జనాభా ప్రాతిపదికన ఏర్పడిన లోక్‌సభ 543 స్థానాల సంఖ్యను తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉన్నది. అయితే ఆనాడు ఇందిరాగాంధీ ఆలోచనలు నిజం చేస్తూ ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాలలో 5 దశాబ్దాల్లో జనాభా పెరుగుదల నిష్పత్తిలో భారీ వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి.
ఒకవ్యక్తి, ఒక ఓటు, ఒక విలువగా నిర్ధారించి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల కేటాయింపు ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు. పోనీ అదే సూత్రం అన్ని రాష్ర్టాలకు ఇప్పుడు కూడావర్తించటంలేదు. కారణం ఈశాన్య, చిన్నరాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లోక్‌సభ స్థానాల జనాభా నిష్పత్తి వేర్వేరుగా ఉన్నది. 2023 జనాభా అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 23 లక్షల మంది ఒక పార్లమెంట్ స్థానం పరిధిలోఉండగా, బీహార్‌లో 31లక్షలు, పశ్చిమబెంగాల్ 23 లక్షలు, రాజస్థాన్ 32లక్షలు (అత్యధికంగా) ఉన్నారు. ఏపీలో 21 లక్షలు, తెలంగాణలో 22 లక్షలు, మేఘాలయ 16 లక్షలు, చండీగఢ్ 12 లక్షలు, హిమాచల్‌ప్రదేశ్ 18 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్టుగా లోక్‌సభ స్థానాలను 888 కు పెంచితే రాష్ర్టాలకు స్థానాల కేటాయింపులు జరుగుతాయి. మొత్తం దేశ జనాభాను 888తో భాగించితే వచ్చేది దేశ పార్లమెంట్ స్థానం సగటు జనాభా. దీన్ని ఆయా రాష్ర్టాల జనాభాతో భాగించినపుడు వచ్చేది ఆరాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల సంఖ్య. 888 సంఖ్య వచ్చేందుకు దశాంశాలను సవరిస్తే తుది కేటాయింపులో ఒకస్థానం తగ్గవచ్చు లేదా పెరగవచ్చు. అలా చేసినపుడు 2023 జనాభా ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు 147, బీహార్‌కు 79, పశ్చిమబెంగాల్ 62, మహారాష్ట్ర-79, ఏపీ-33, తెలంగాణ-24, తమిళనాడు -48, రాజస్థాన్-50, గుజరాత్-44 దక్కుతాయి.
దక్షిణాదికి లోక్‌సభలో ఇప్పుడున్న ప్రాతినిధ్యం 23.19 శాతం నుండి 19 శాతానికి పడిపోతుంది. ఇది చాలా ఆందోళనకరంగా పరిణమించే అంశం. అలా కాకుండా ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్య 543 మార్చకుండా ఆయా రాష్ర్టాల జనాభాకు అనుగుణంగా పునర్విభజన చేసి సీట్లు కేటాయిస్తే దక్షిణాది రాష్ర్టాలు 25 స్థానాలు కోల్పోతాయి. తెలంగాణ-2, ఏపీ-5, తమిళనాడు 10, కేరళ 6, కర్నాటక 2 స్థానాలు నష్టపోతాయి. వీటితోపాటు బెంగాల్-4, ఒరిస్సా -3, చిన్నరాష్ర్టాలైన పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్ 1 సీటు నష్టపోతాయి.
ఇక సీట్లు పెరిగేవన్ని హిందీ భాషా రాషాల్లోనే. ఉత్తరప్రదేశ్ 10, బీహార్ 9 రాజస్థాన్ 6, మధ్యప్రదేశ్ 4, గుజరాత్ 1 సీట్లు అదనంగా పెరుగుతాయి. పై ప్రతిపాదన ఏది అమలు చేసినా బీజేపీ లేదా ఉత్తరాది పార్టీలు, హిందీ రాష్ర్టాల ఆధిపత్యం దేశంలో శాశ్వతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దేశంలో రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు. ఈ పునర్విభజన వల్ల వచ్చే దుష్పరిణామాల నివారణకు రాజ్యాంగ సవరణలు చేయడం సముచితం.
ప్రతిపాదన 1: దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఇప్పుడున్న పార్లమెంట్ స్థానాలను అదనంగా 33 శాతం పెంచడం అంటే ఉత్తరప్రదేశ్‌లో 27 స్థానాలు పెరుగుతుండగా, తమిళనాడులో 13 పెరుగుతాయి.ఈ ఫార్ములా వల్ల లోక్‌సభ స్థానాల సంఖ్య పెరగడంతోపాటు ఇప్పుడున్న జనాభా ఆయా రాష్ర్టాల పరిధిలోని పార్లమెంట్ స్థానాల్లో సమానంగా ఉంటుంది. ఈశాన్య రాష్ర్టాల్లో, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో అస్సాం మినహా 1 నుంచి 2 స్థానాలు పెంచవచ్చు. ఈ ప్రతిపాదన వల్ల ప్రాంతాల మధ్య సమతుల్యత లోపించకుండా పరిపాలనా పరంగా వెసులుబాటు ఉంటుంది.
మహిళలకు పార్లమెంటులో 33శాతం రిజర్వేషన్ బిల్లు దశాబ్దాల నుంచి ముందడుగు వేయడంలేదు. 1952లో 4 శాతంతో ప్రారంభమైన మహిళల ప్రాతినిధ్యం నేటికి 15 శాతానికి మాత్రమే చేరింది. అతివలు అన్నింటా సమానం అని చెప్పే ప్రధాని మోదీ దగ్గర నుంచి గతంలో దేశాన్ని ఏలిన కాంగ్రెస్, ఇతరపార్టీలు 33 శాతం రిజర్వేషన్లకు అంతర్గతంగా సుముఖంగా లేకపోవడమే కారణం. పై ప్రతిపాదన ప్రకారం 33 శాతం మొత్తం సీట్లు లోక్‌సభలో పెంచినపుడు 25 శాతం మహిళలకు కేటాయించడం పెద్ద సమస్య కాదు.
ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణలో 34, ఏపీలో 50 అసెంబ్లీ స్థానాలు పెంచి పునర్విభజన చేయాలని నిర్దేశించినప్పటికీ రాజ్యాంగ సవరణ చేయనిదే పెంపుదల కుదరదని అటార్నీ జనరల్ చెప్పినట్టు పార్లమెంటులో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేసిన తర్వాత దేశంలోని అన్నిరాష్ర్టాలతో కశ్మీర్ రాజ్యాంగపరంగా సమానమైంది. బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టంలో 7 అసెం బ్లీ స్థానాలు పెంచుతూ తదనుగుణంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. బీజేపీ, ఒకటి రెండు చిన్న పార్టీలు మినహా దాదాపు అన్ని రాజకీయపక్షాలూ అక్కడ వ్యతిరేకించినా పునర్విభజన ప్రక్రియను పూర్తిచేశారు.
తెలంగాణ, ఆంధ్రాలో విభజన చట్టం ప్రకారం సీట్లు పెంచాలని రాజ్యాంగ సవరణ అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అగ్రనేత బోయినపల్లి వినోద్‌కుమార్‌లు ప్రధాని, కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తిచేసినా కేంద్రం నుంచి ఏ మాత్రం స్పందనలేదు.ప్రతిపాదన 2: 33 శాతం అన్ని రాష్ర్టాలకు సమానంగా పెంచే తరుణంలో అన్ని రాష్ర్టాల అసెంబ్లీ స్థానాలను వారి జనాభాకు అనుగుణంగా పెంచుకునే వెసులుబాటు కలిగించాలి. దీనివల్ల ప్రజలకు సేవ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మరింత వెసులుబాటు కలుగుతుంది. జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ పార్లమెంటు స్థానాలు తగ్గించారన్న భావన లేకుండా4 పెద్ద రాష్ర్టాల్లో రాజ్యసభ స్థానాలు పెంచవచ్చు.
కొత్తగా పార్లమెంట్ భవనం నిర్మించాం, రానున్న 4, 5 దశాబ్దాలు ఈదేశాన్ని మాపార్టీనే పాలించాలి అన్న ఆలోచనతో లోక్‌సభ స్థానాల సంఖ్యను జనాభా ప్రాతిపదికన ఏకపక్షంగా పెంచితే సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించే చర్యగా మిగిలిపోతుంది. అన్నిపార్టీలూ రాజకీయాలకు అతీతంగా దేశసమైక్యత, సమాఖ్యవ్యవస్థ, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పార్లమెంట్ ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా పరిణతితో వ్యవహరించాలి. వాస్తవానికి 2026 తర్వాత జరిగే తొలి జనగణన అంటే 2031లో జరిగితే 2034 నాటికి వాటి ప్రచురణ జరుగుతుంది. అప్పుడు డీలిమిటేషన్ కమిషన్‌ను నియమిస్తే, ఆ కమిటీ కనీసం 2 ఏండ్ల కాలవ్యవధి తీసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో 2039 సాధారణ ఎన్నికల వరకు పునర్విభజన చేయడం ఎట్టిపరిస్థితుల్లో సాధ్యపడదు.
ఈ తరుణంలోఅందుతున్న సమాచారం ప్రకారం జనాభాలెక్కలను లోక్‌సభ ఎన్నికల పేరుతో 2024 వరకు వాయిదా వేసే అవకాశం ఉన్నది. అలాగే 2024 లో కేంద్రంలోఅధికారంలోకి రాగానే జనగణన చేసి ఆ జనాభా ప్రాతిపదికనే పునర్విభజన చేసేవిధంగా రాజ్యాంగ సవరణ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 2039లో కాకుండా 2029 ఎన్నికలకే లోక్‌సభ సీట్లను పెంచి ఉత్తరభారతంలో ప్రత్యేకించి హిందీ బెల్టులో పెరిగే సీట్లవల్ల లబ్ధి పొంది అధికారాన్ని ఎప్పటికీ తమచేతిలో ఉంచుకోవాలన్న ఆలోచన ధోరణి బీజేపీకి ఉన్నట్టు తెలుస్తున్నది.ఈ చర్య భవిష్యత్తులో దక్షిణాది రాష్ర్టాలు తమకు ఉత్తరాది వారు ద్రోహం చేస్తున్నారని భావించడమే కాక ఉత్తరాది, దక్షిణాది విభజనకు దోహదం చేసే ఆలోచనలను రాజేసే అవకాశం ఉన్నది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-ఇనగంటి రవికుమార్
94400 53047