బడిబాట పట్టాలనే సంకల్పంతో ఎస్ఆర్ శంకరన్, మాజీ మంత్రి, స్వర్గీయ మహేంద్రనాథ్ లాంటి మహనీయుల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే గురుకులాలు. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక నాటి కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అనేక గురుకులాలను ఏర్పాటుచేసింది. దాంతో గామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింది. అయితే ఎంతోమందికి చేయూతనిచ్చిన గురుకులాలు నేడు నిర్వీర్యమవుతుండటం ఆందోళనకరం.
గురుకులాల్లో చదువుతున్న అణగారినవర్గాల పిల్లలు ఉన్నతస్థాయికి చేరుకోవడం కొందరికి నచ్చడం లేదు. అందుకే వారిని విద్యకు దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. పాలకులే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నడుపుతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు. తద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థను సమూలంగా నాశనం చేస్తున్నారు.
గురుకుల విదార్థులు అన్నిరకాల ప్రవేశ పరీక్షల్లో ముందంజలో నిలుస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీపడి ఇంజినీరింగ్, మెడికల్, లా తదితర కోర్సుల్లో చాలామంది సీట్లు సంపాదిస్తున్నారు. గురుకులాల ద్వారానే దళిత, బహుజన కుటుంబాలు అభ్యున్నతి చెందుతున్నాయన్నది నగ్న సత్యం. ఇది రుచించుకోని అగ్రకులాలు గురుకులా లపై కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే ‘మనమంతా ఒక్కటే’ అనే కపట నాటకానికి తెరతీశారు. వాస్తవానికి అందరమొక్కటే అయినప్పు డు ఇంటర్నేషనల్, నేషనల్, ఒలింపియాడ్, కార్పొరేట్ పాఠశాలలు ఎందుకున్నట్టు? నేటికీ బిజినెస్ స్కూళ్లల్లో రిజర్వేషన్లు ఎందుకు లేవు? అందరం ఒక్కటే అయినప్పుడు ఎలాంటి వివక్ష ఎదుర్కోని అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఎందుకు? బడుగు, బలహీనవర్గాల కంటే అతి తక్కువ మార్కులు వచ్చినవారికి సీట్లు, ఉద్యోగాలు ఎందుకొస్తున్నాయి? అనేక కులాలను బీసీల జాబితాలో చేరుస్తూ బీసీలను మరింత బలహీనంగా ఎందుకు మారుస్తున్నారు? ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ పాలకుల వద్ద సమాధానాల్లేవు. ఎంతటి దుర్గార్మమైన అణచివేత ఇది.
‘అన్ని కులాలకు కలిపి ఒకే గురుకులాలు’ అని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ ప్రకటనలోనే పాలకుల కుట్ర దాగి ఉన్నది. కామన్ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రావాల్సిన 75 శాతం సీట్లు నష్టపోవడం ఖాయం. గురుకులాల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. ఉన్నతాధికారుల పెత్తనం కారణంగా గురుకులాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఈ సమస్యలపై గతంలో గురుకులాల సెక్రెటరీకి మాల మహానాడు విన్నవించినా పట్టించుకోలేదు.
గురుకుల పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతోనే రాష్ట్రంలోని అన్ని గురుకులా లు నడుస్తున్నాయి. ఇలా గురుకులాలను వెంటాడుతున్న వివిధ సమస్యలు తమ ప్రతిభకు అడ్డంకి గా మారాయని విద్యార్థులు భావించడం లేదు. సమస్యలతో సహవాసం చేస్తూనే నీట్, జేఈఈ లాంటి జాతీయ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపుతున్నారు. గురుకులాల పేరు నిలబెడుతున్నారు. అయినప్పటికీ నాణ్యమైన విద్యను అందించాల్సిన పాలకులు వారిని మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యం లో గురుకులాల్లో తిష్టవేసిన సమస్యలను వెంటనే పరిష్కరించి, బంగారు భవితకు బాటలు వేయాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు)
-పబ్బతి శ్రీకృష్ణ
95334 11328