స్మార్ట్ఫోన్ వచ్చాక ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయింది. వింతలు, విశేషాలన్నీ అందులో చూడగలుగుతున్నాం. అపారమైన విజ్ఞానాన్ని పొందగలుగుతున్నాం. అయితే, సామాజిక మాధ్యమాల తీరుతెన్నులను చూస్తుంటే ఆందోళన కలుగుతున్నది.
మన చేతిలోని స్మార్ట్ఫోన్ను తెరిస్తే చాలు వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి ఎన్నో యాప్స్ దర్శనమిస్తాయి. ఎవరికి వాళ్లు ఇష్టానుసారం వీటిని ఉపయోగిస్తున్నారు. కొంతమంది లోకహితం కోసం, విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి సద్వినియోగం చేసుకుంటుండగా, మరి కొంతమంది అజ్ఞానులు వీటిని దుర్వినియోగపరుస్తున్నారు. అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం, అసత్య ప్రచారం సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నది.
వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లో చక్కర్లు కొట్టే వాటిలో ఎక్కువగా సామాజిక జీవితానికి సంబంధించినవే ఉంటాయి. వాటిలో చాలా వరకు సమాజంలో నైతిక విలువలపై ప్రభావం చూపుతున్నాయి. కొంతమంది సోషల్మీడియాలో లేనిపోని కథనాలను ప్రచారం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు, వావి వరుసలు లేని అక్రమ సంబంధాల కథనాలు ప్రసారం చేస్తుంటారు. అసలు వాటి వల్ల ఏమైనా సామాజిక ప్రయోజనం చేకూరుతుందా? పైగా వీక్షకులను ఆకట్టుకునేందుకు చిత్రవిచిత్రమైన శీర్షికలు పెడతారు. అత్యంత జుగుప్సాకరమైన పదజాలాలను కూడా వాడుతుంటారు.
ముఖ్యంగా యువతరం అలాంటివి చూసి తప్పుదోవ పడుతున్నారు. ఇప్పటికే చాలామంది యువత పెడదారి పట్టారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న ఈ విషయాలను చూసీచూడనట్టు వదిలేయడం సరికాదు. ఇంకా మన వరకు రాలేదని అనుకోవడం పొరపాటు. పక్కింటికి అంటుకున్న నిప్పు మన ఇంటిదాకా రాకుండా ఉంటుందా? మనం అప్రమత్తంగా లేకపోతే మన ఇంటిని కూడా దహించివేస్తుంది.
సమాజ పతన హేతువులైన ఇలాంటి ధోరణులకు చెక్ పెట్టలేమా? అని అడిగితే అందరూ చెప్పే సమాధానం ఒక్కటే.. ఈ దేశంలో వాక్ స్వాతంత్య్రం ఉంది. ‘భావప్రకటనా స్వేచ్ఛ’ అనేది రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కు. కాబట్టి, ఎవ్వరూ, ఎవ్వరినీ ఏమీ అనకూడదు. సంస్కారహీనమైన ధోరణులు సమాజంలోకి చొచ్చుకొస్తుంటే చేతులు కట్టుకొని కూర్చోవడం తప్ప, ఏమీ చేయలేమా? అలాంటి దురవస్థలో మనం ఉన్నామంటే, అది నిజంగా దురదృష్టమే.
మీడియాలో అనుచిత పోకడలను అదుపు చేసేందుకు చట్టాలున్నాయి. బహిరంగ సభల్లో అదుపుతప్పే నేతలపైనా చర్యలు తీసుకోవడాన్ని మనం చూస్తున్నాం. మరి చట్టాలను కఠినతరం చేసి సోషల్ మీడియాను నియంత్రించలేమా? భావోద్వేగాలను రెచ్చగొట్టి, యువత పెడదారి పట్టేటట్లు చేసి సమాజం, మన సంస్కృతి పతనమయ్యేందుకు కారణమయ్యే సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వైపు నుంచి ఆ ప్రయత్నం జరగకపోతే, సమాజహితాన్ని కోరే ప్రజలే అందుకు నడుం బిగించాలి. అవసరమైతే ఉవ్వెత్తున ఉద్యమించాలి. ప్రపంచానికే ఆదర్శప్రాయమైన మన భారతీయ సమాజాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది.
-చేగొండి వీరవెంకట సత్యనారాయణ మూర్తి
98492 08308