ప్రతిష్ఠాత్మక జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మన సింగరేణి సీఎండీ, మన తెలంగాణ బిడ్డ శ్రీధర్ ఐఏఎస్ ఎంపికయ్యారు. ఇది ఆయన సమర్థతకే కాదు సింగరేణి నాయకత్వ పటిమకు నిదర్శనం. గతంలోనూ సింగరేణి సంస్థ సీఎండీ లుగా, డైరెక్టర్లుగా వివిధ హోదాల్లో పని చేసిన ఎంతోమంది అధికారులు జాతీయ సంస్థలకు బాసులుగా ఎంపికై జాతీయ స్థాయిలో సింగరేణి సత్తాను చాటారు. సింగరేణిలో జీఎంగా, డీజీఎంగా, డైరెక్టర్లుగా వివిధ హోదాల్లో పని చేసి ప్రస్తుతం వివిధ జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అటు సింగరేణి సంస్థకు ఇటు తెలంగాణ ప్రాంతానికి వన్నెతెస్తున్న అధికారులు మరికొందరున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో సైతం సింగరేణి ఉద్యోగులు ముందున్నారు. రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, సింగరేణి సంస్థకు వెన్నుదన్నుగా నిలిచే చర్యల ఫలితంగా సంస్థ లాభాల బాటలో పయనిస్తున్నది.
తెలంగాణకే మణిహారం సింగరేణి సంస్థ. 134 ఏండ్ల సింగరేణి చరిత్రలో ఎంతోమంది సంస్థకు సీఎండీలుగా పనిచేశారు. ఉత్తర తెలంగాణలోని వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రధాన ఉపాధినిస్తున్నది సింగరేణి సంస్థ. ఒకప్పుడు నష్టాలపాలై బీఎఫ్ఆర్ఎం వరకు వెళ్లిన సంస్థ పటిష్ఠమైన నాయకత్వ ప్రతిభతో లాభాల బాటపట్టి అభివృద్ధి దిశగా కొనసాగుతున్నది. సంస్థ అభివృద్ధి లో తమదైన ముద్ర వేసిన అధికారులెందరో ఆ తర్వాత జాతీయ సంస్థలకు ఎంపికవ్వడం హర్షించదగ్గ విషయం.
ఇప్పటి వరకు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్లిన శ్రీధర్ ఇటీవలే జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. మార్చి 18న జరిగిన ఆ సంస్థ సీఎండీ ఎంపిక ప్రక్రియకు దేశవ్యాప్తంగా వివిధ జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు ఉన్నతాధికారులు పోటీపడ్డారు. వారిలో జాతీయ సంస్థ అయిన ఎంఓఐఎల్ నుంచి ఇద్దరు డైరెక్టర్లు, ఎన్ఎండీసీ నుంచి ఒక డైరెక్టర్, బీఎస్ఎన్ఎల్ నుంచి సీజీఎం, రైల్వేస్ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు.
సింగరేణి నుంచి జగిత్యాల బిడ్డ శ్రీధర్ ఐఏఎస్ పాల్గొన్నారు. అందరిలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఎన్ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. శ్రీధర్ బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, లాభా ల్లో సింగరేణి సంస్థను రాష్ర్టానికి తలమానికంగా నిలిపారు. తద్వారా జాతీయ సంస్థలకు సైతం ఆదర్శంగా నిలపడంలో వారి కృషి ఎనలేనిది. అధునాతన సాంకేతిక వినియోగం, కొత్త ప్రాజెక్టులు, ఒడిశాలో అత్యంత పెద్దదైన నైనీ బ్లాక్ సాధన, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ ఎనర్జీ తయారీ దిశగా అడుగులు ఇలా అనేక విజయాలతో సింగరేణికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు శ్రీధర్. ముఖ్యంగా ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా కష్టకాలంలోనూ అటు ఉద్యోగులకు, వారి కుటుంబాలకు భరోసా నిస్తూనే ఉత్పత్తి సాధించడంలో విశేష కృషి చేశారు. ఆ సంక్షోభ కాలంలో సైతం లాభాలు సాధించి ఉద్యోగులకు బోనస్ పంపిణీ చేయడంలో కీలక భూమిక పోషించారు.
ప్రస్తుత తెలంగాణ సీఎంవో ముఖ్య అధికారి, సీనియర్ ఐఏఎస్ నర్సింగరావు సైతం గతంలో సింగరేణి సీఎండీగా పని చేసినవారే. సింగరేణిలో తనదైన ముద్ర వేసిన ఆయన ఆ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కోల్ ఇండియా చైర్మన్గా వ్యవహరించారు. కోల్ ఇండియా జాతీయ మహారత్న కంపెనీ. కోల్ ఇండియా చైర్మన్ పదవి కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదాకు సమానం. నర్సింగరావు సైతం సింగరేణి సంస్థలో అనేక విప్లవాత్మక మార్పులతో సంస్థ ఉన్నతికి కృషి చేశారు. ముఖ్యంగా విద్యు త్ ఉత్పత్తి సంస్థలకు, ఇతర పరిశ్రమలకు బొగ్గు రవాణా చేయటానికే పరిమితమైన సింగరేణికి సొంతంగా ఒక విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఉండాలని ఆలోచన చేసింది ఆయనే.
ప్రభుత్వాన్ని ఒప్పించి జైపూర్లో మొదటి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేశారు. దాని ఫలితంగా ఇప్పుడు సింగరేణి అత్యంత చవకగా విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతున్నది. జాతీయ స్థా యిలో దశాబ్దాలుగా విద్యుత్ ఉ త్పత్తి సంస్థలుగా గుర్తింపు పొం దిన వాటిని సైతం తలదన్ని ఎన్నో నేషనల్ అవార్డులను గెల్చుకున్నది. ఆ విజయం ఇప్పుడు మరి న్ని విద్యుత్ సంస్థల ఏర్పాటుకు సింగరేణి ప్రణాళికలు వేసేలా బాటలు వేసింది. కోల్ ఇండియా చైర్మన్గా కూడా నర్సింగరావు రాణించారు. గతంలో సింగరేణి సీఎండీగా రాణించిన సు తీర్థ భట్టాచార్య సైతం కోల్ ఇండియా చైర్మన్ గా ఎంపికై జాతీయస్థాయిలో సింగరేణి నాయకత్వ సత్తా చాటారు.
గతంలో సింగరేణిలో సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్ (ఎస్ఓఎం)గా పనిచేసిన పల్లెర్ల శరత్ కుమార్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ (ఎంఓఈఎఫ్) సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో సింగరేణిలో డీజీఎం (మార్కెటింగ్) విధులు నిర్వహించిన మారపెల్లి వెంకటేశ్వర్ డైరెక్టర్ కోల్ బ్లాక్స్గా వ్యవహరిస్తున్నారు.
సింగరేణిలో డీజీఎంగా పనిచేసిన మోహన్ రెడ్డి కలసాని మరొక జాతీయ సంస్థ అయిన నేవీవేలి లిగ్నైట్ కార్పొరేషన్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు కొద్ది రోజులు యాక్టింగ్ సీఎండీగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. సింగరేణి జీఎంగా పని చేసిన వీరారెడ్డి ప్రస్తుతం కోల్ ఇండియాలో డైరెక్టర్ (టెక్నికల్)గా ఉన్నారు. కొడాలి రవికుమార్ సైతం సింగరేణిలోఎస్ఈగా పనిచేసి మిని స్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డైరెక్టర్గా విధు లు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో సైతం సింగరేణి ఉద్యోగులు ముందున్నారు. రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, సింగరేణి సంస్థకు వెన్నుదన్నుగా నిలి చే చర్యల ఫలితంగా సంస్థ లాభాల బాటలో పయనిస్తున్నది. ఈ చర్యలు సంస్థకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెస్తున్నాయి. సింగరేణిలో అనేక సంస్కరణలు చేపట్టి అభివృద్ధిలో భాగస్వాములైన ఉన్నతాధికారులకు జాతీయ స్థాయిలో రాణించే అవకాశం లభించడం హర్షణీయం.
ప్రదీప్ రావు ఎరబెల్లి
99660 89696