తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత ఈ 11 సంవత్సరాల్లో అనేక ఎన్నికలు జరిగాయి. కానీ, ఈ నెల 11న జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కనిపించిన దృశ్యాల వంటివి ఇంతకుమునుపెన్నడూ లేవు. కేవలం ఒక ఉప ఎన్నికలో గెలవడం కోసం అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరించడం అసాధారణమైన విషయం. అట్లా జరిగిందంటే అందుకు బలమైన కారణాలు ఉండే ఉండాలి. అదట్లా ఉంచితే, కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, ఆ పార్టీ అభ్యర్థి ధనబలం, కండబలం, మజ్లిస్ ప్రత్యక్ష మద్దతు, బీజేపీ పరోక్ష మద్దతు అనే నాలుగు కలిసి పని చేసినప్పుడు ఫలితం మరొక విధంగా ఉండటం దాదాపు అసాధ్యం.
కాంగ్రెస్ ప్రవర్తించిన తీరుకు కనిపించే తక్షణ కారణం ఎన్నికలో గెలవాలనుకోవడం. ఆ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం. అట్లా తీసుకున్నందువల్ల, అందుకు తగిన అభ్యర్థిగా ఒక రౌడీషీటర్ కుమారుడు, తనపై కూడా కేసులున్న వ్యక్తిని ఎంపిక చేయడం. గెలవడం కోసం ఒకవైపు సదరు అభ్యర్థి, అతని తండ్రి యథేచ్ఛగా ప్రవర్తించేందుకు వీలు కల్పించడం. కాంగ్రెస్ కార్యకర్తలు అందుకు మద్దతుగా రెచ్చిపోవడం. సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, నాయకులు ఎన్నికల నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘించడం. ఓటర్లకు డబ్బు పంపిణీలు, కానుకల మాట సరేసరి కాగా, బాహాటంగా బెదిరింపులు, దాడులు. ప్రత్యర్థులపై దాడుల గురించి చెప్పనక్కరలేదు.
ఎన్నికలో గెలవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఇవన్నీ చేయడాన్ని చూశాం. అయితే, ఇంతటితో విషయం అయిపోవడం లేదు. మరికొంత విచారిస్తే రెండు ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. మొదట చెప్పుకొన్నట్టు గత 11 సంవత్సరాలుగా జరిగిన అనేక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత ప్రతిష్ఠ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏమిటి ముడిపడి ఉంది? ఆ విషయమై ఎందుకింత పట్టుదల? ఇక్కడ గెలుపోటములతో ప్రభుత్వం ఉండ టం, పోవడం వంటివేమీ ముడిపడి లేవే? అట్లా ముడిపడి ఉండిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విధంగా వ్యవహరించలేదు. అటువంటప్పుడు, గతంలో ఎన్నడూ లేనట్లు, ఇంత అసాధారణమైన రీతిలో, ఈసారి ఎందుకట్లా ప్రవర్తించినట్లు? ఇంకా చెప్పాలంటే, ప్రవర్తించవలసి వచ్చినట్లు? అటువంటి అగత్యం ఏమి ఏర్పడింది?
ఇది ఒక ప్రశ్న. ఇది తెలంగాణకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఆయన మంత్రులు, పార్టీ నాయకులకు పరిమితమైనది. రెండవ ప్రశ్న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీకి, ఆ పార్టీకి సంబంధించినది. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది.
రెండింటిని కలిపి అర్థం చేసుకుంటే తప్ప, గత 11 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రేవంత్‌రెడ్డి మొదలుకొని వీరంతా ఎందుకిట్లా ప్రవర్తించారనేది బోధపడదు. అన్నింటికి తార్కికమైన సంబంధం ఉంది. ఒకదాని నుంచి ఒకటి పుట్టుకువచ్చాయి. అది అనివార్యమైన పరిణామక్రమం.
అంతటికీ మూలం తల్లివేరు వద్ద ఉంది గనుక, మొదట జాతీయ కాంగ్రెస్‌ను, దాని నాయకుడైన రాహుల్‌గాంధీని చూద్దాం. ఆ పార్టీ క్షీణదశ చాలాకాలం క్రితమే మొదలుకావడం తెలిసిందే. అట్లా క్షీణిస్తున్న మొక్కకు రాహుల్‌గాంధీ ఒక కుక్కమూతి పిందె వలె పుట్టుకువచ్చారు. అది ఆయన తప్పు కాదు. క్షీణించే మొక్కకు అది ప్రకృతి సహజమైన స్థితి. కాంగ్రెస్ పార్టీ తన ఒకప్పటి సిద్ధాంతాలను, లక్ష్యాలను, విధానాలను, నీతినియమాలను కోల్పోవడం రాహుల్ కంటే చాలా కాలం క్రితమే మొదలైంది. అట్లా కోల్పోయిన కొద్దీ ప్రజలతో సంబంధాలు, వారి ఆదరణ తగ్గడం జరుగుతూ వచ్చింది. అట్లా తగ్గినప్పుడు, ఎన్నికలతో నిమిత్తం లేకుండా కూడా పలు విధాలుగా, అన్ని విధాలుగా ఆ పార్టీ వ్యవహరణ మారసాగింది. అది తార్కికమైన, సహజమైన మార్పు.
ఒకసారి అది జరుగుతున్నప్పుడు ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తుంది. అయితే, ఎన్నికల్లో గెలుపు కోసం జూబ్లీహిల్స్ వలె జాతీయస్థాయిలో ప్రవర్తించేందుకు శక్తిప్రపత్తులు చాలవు. దాంతోపాటు, రాహుల్‌గాంధీ అసమర్థుడే అయినా తనకు ఒక వంశ నేపథ్యం, దాని నుంచి అబ్బి వచ్చిన సంస్కారం ఉన్నాయి. కనుక, ఎన్నికల్లో గెలుపు కోసం, ఏ నేపథ్యమూ, సంస్కారమూ లేని రేవంత్‌రెడ్డి వలె వ్యవహరించలేరు. తను చేయగలిగింది, చేస్తున్నది ఇతర పార్టీలను ఆశ్రయించి ఎన్నో కొన్ని సీట్లు గెలవడం, ఫలితాలు కలిసివస్తే వారికి జూనియర్ భాగస్వామిగా ప్రభుత్వంలో చేరడం వరకే. ఇంకా వీలైనచోట, అధికార తపనతో, ప్రజలకు ఉద్దేశపూర్వకంగా అసాధ్యమైన హామీలనిచ్చి సొంతంగా గెలవజూడటం. దీనిని కపటబుద్ధి, కపటవ్యూహం అంటాం. కానీ, కపటబుద్ధిలో అధర్మం ఉంటుంది గాని, జూబ్లీహిల్స్‌లో వలె దుర్మార్గం ఉండదు. దుర్మార్గమన్నది మరింత పతన స్థితి. జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకోనిది హత్యలు ఒక్కటే.
రాహుల్ గురించి, కాంగ్రెస్ ప్రస్తుత స్థితి గురించి ఒక సూక్ష్మాన్ని గమనించాలి. ప్రాణిని నువ్వు స్వయంగా వధించకు, కానీ, ఇతరులు వధిస్తే ఆ మాంసం మాత్రం తినవచ్చును అనే చతురమైన సూత్రం ఒకటి కొన్ని ధర్మాల్లో ఉంది. ఆ విధంగా, జూబ్లీహిల్స్‌లో రాహుల్ స్వయంగా ఏమీ చేయకపోవచ్చు. తన కుటుంబ సంస్కారంతోపాటు వ్యక్తిగత అసమర్థత కారణంగా. కానీ, ఆ సంస్కారం కూడా మార్పులకు గురవుతున్నది. పైన చెప్పిన మాంసం ఉదాహరణ వలె జూబ్లీహిల్స్‌ను నువ్వు స్వయంగా చేయకు కానీ, నీ ఓవరాల్ అధికార పరిరక్షణ కోసం రేవంత్‌రెడ్డి వంటి వారు చేస్తే ఆమోదించు. దుర్యోధనుని దుర్మార్గాలను ధృతరాష్ర్టుడు భౌతికమైన అంధత్వానికి తోడు, వివేకచక్షువుల అంధత్వాన్ని జోడించి ఆమోదించినట్లు. ఆ విధంగా రాహుల్‌గాంధీ అధికార మోహంలో జూబ్లీహిల్స్ వంటి దృశ్యాలు వచ్చేసరికి కళ్లను ఒక పరిశుభ్రమైన శ్వేత వస్త్రంతో బంధించుకుంటారన్న మాట. దోషం అంటుకునేది కళ్లారా చూస్తే మాత్రమే. కళ్లు తెరిచినా, మూసినా, మరెవరో వధించే జంతువు మాంసం మాత్రం లభిస్తుంది గనుక, లక్ష్యం నెరవేరుతుంది.
ఘనమైన గాంధీ-నెహ్రూ వంశం ఇటువంటి కుక్కమూతి పిందెల దశలోకి ప్రవేశించి, ఆ ఘనమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతటి క్షీణ స్థితికి చేరినప్పుడు, అధికార లక్ష్యం కోసం రేవంత్‌రెడ్డి వంటి వారినే ముఖ్యమంత్రులను చేస్తారు. కనీసం అందుకు సందేహించరు. ఒకసారి ముఖ్యమంత్రిని చేసిన తర్వాత, తాము కూడా నిస్సహాయంగా ఆ స్థితికి బందీ అవుతారు.
అట్లా బందీ కాలేదేమోననే సంశయం ఉన్నంతవరకు రేవంత్‌రెడ్డి తరహా వ్యక్తులు కొద్దిగా జాగ్రత్త పడతారు. ఆ సంశయం పోయినప్పుడు ఇక పూర్తి స్వరూప స్వభావాలతో విజృంభిస్తారు. ఇదంతా, రాజకీయాలతో నిమిత్తం లేకుండా కూడా ఇతరత్రా వ్యక్తులు వ్యవహరించే తీరే. ఆ తీరు అధికార రాజకీయంలో జరిగినప్పుడు చెప్పనక్కరలేదు.
ఇదంతా చెప్పుకొన్న తర్వాత, దానిని భూమికగా చేసుకుంటూ ఇప్పుడు జూబ్లీహిల్స్ విషయం చూద్దాం. రేవంత్‌రెడ్డికి ఈ ఉప ఎన్నిక ఎందుకింత ప్రతిష్ఠాత్మకం అయింది? హామీల అమలు వైఫల్యం, ప్రజల ఆగ్రహం, తన ప్రతిష్ఠ తగ్గుదల, పార్టీ ముఖ్యుల వ్యతిరేకతలు, అసమర్థ పాలన, అవినీతి పెరుగుదల, రాహుల్ నిరాదరణల వల్ల తన పదవి పోవచ్చుననే భయం కలగడం, రానున్న పంచాయతీ ఎన్నికల వల్ల ఇది ఉప ఎన్నిక మాత్రమే అయినా సవాలుగా మారింది. అక్కడ ఒక రౌడీషీటర్ కుమారుడిని ఎంపిక చేయడం ఎందుకు? సాధారణ అభ్యర్థులైతే గెలవడం అనుమానం గనుక, అటువంటి వారైతేనే చతురోపాయాలతో నెగ్గుకురాగల అవకాశం ఉంటుందని. అయినా స్వయంగా తనతోపాటు చతురంగ బలాలను రంగంలోకి దింపడమే గాక, లోకం చూస్తుందనే వెరపు అయినా లేకుండా ఓటర్లకు ప్రలోభాలు, బెదిరింపులు, దాడులతోపాటు, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగపరచడం, ఎన్నికల యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం ఎందువల్ల? తెలంగాణలో ఇంతకాలం కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పాటించిన నియమాలను యథేచ్ఛగా భంగపరిచి అయినా సరే గెలవాలని. గెలిచి తన పదవిని భద్రపరుచుకోవాలని. కేవలం అందుకే ఇంతటి తెగింపు. తన నిజస్వరూప స్వభావాలను, సంస్కారహీనతను బయటకుతెచ్చి, తెలంగాణలో ఒక కొత్త సంస్కృతిని ఆవిష్కరించేందుకు సందేహించకపోవడం.
-టంకశాల అశోక్