జరభద్రం
రాష్ట్రంలో రైస్‌మిల్లుల యజమానుల నిర్వాకం వల్ల ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయల బియ్యాన్ని చీకటి బజారుకు పంపిన వైనం తెలిసి జనం నివ్వెరపోతున్నారు. ‘భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు’ ప్రభుత్వం, చట్టాల పట్ల ఏమాత్రం అదురూ బెదురు లేకుండా మిల్లర్లు రాష్ట్ర ఖజానాకు భారీగా తూట్లు పొడిచారు. ఈ వ్యవహారమంతా చూస్తే తప్పు రెండు వైపులా ఉందనిపిస్తున్నది. పంట దిగుబడి తర్వాత ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడించి, వచ్చిన బియ్యాన్ని నెలవారీగా పేదలకు పంపిణీ చేస్తుంది. కస్టమ్ మిల్డ్ రైస్ విధానం ప్రకారం ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులు బియ్యంగా మార్చి ఇస్తాయి. అందుకుగాను వారికి క్వింటాలు లెక్కన మిల్లింగ్, రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ధాన్యం అందిన 15 రోజుల్లో పౌరసరఫరాల శాఖకు బియ్యాన్ని అప్పగించవలసి బాధ్యత మిల్లులపై ఉంటుంది.
ఈ ఆగస్టులో సివిల్ సప్లయిస్ అధికారులు రైస్‌మిల్లుల తనిఖీలు చేపట్టగా దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. గత మూడేండ్లుగా ప్రభుత్వం అప్పగించిన ధాన్యంలో 2.7 లక్షల మెట్రిక్ టన్నుల దాకా లెక్కకు అందడం లేదని అధికారులు తేల్చారు. రైస్‌మిల్లుల్లో స్టాకుగా ఉండవలసిన సుమారు రూ.3,905 కోట్ల విలువైన బియ్యం గాయబ్ అయ్యాయి. ప్రభుత్వానికి అప్పగించవలసి బియ్యాన్ని మిల్లుల యజమానులు రాష్ర్టాన్ని దాటించి అధిక ధరలకు అమ్ముకున్నట్లు తెలుస్తున్నది. ఆ సొమ్ముతో వారు రియల్ ఎస్టేట్‌లో, సినిమా నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టినట్టు, కొత్త రైస్‌మిల్లులు స్థాపించుకున్నట్లు విచారణలో తేలింది. పంపిణీకి సరిపడే బియ్యం మాత్రమే ఉన్నాయి, ఇప్పుడే మిల్లింగ్ చేయవద్దని చెప్పిన ఒకే మాటను సాకుగా తీసుకుని, అక్రమంగా ఆ సరుకును సరిహద్దులు దాటించారు.
రాష్ట్రంలోని రైస్‌మిల్లులు చాలావరకు ఈ నేరంలో భాగమయ్యాయి. తప్పు చేసిన చిన్నమిల్లుల యజమానులు తాము అమ్ముకున్న బియ్యం విలువను ప్రభుత్వానికి చెల్లించారు. మొత్తం రూ.3,905 కోట్లలో ఇంకా రూ.2,200 కోట్లు వసూలు కావలసి ఉన్నది. సివిల్ సప్లయిస్ చట్టాల ప్రకారం ఇలాంటి నేరాలకు పాల్పడితే వాస్తవ విలువకు తోడుగా 25 % జరిమానా విధిస్తారు. ఆ సొమ్ము చెల్లించకుంటే మిల్లును, దాని యజమాని ఆస్తులను జప్తు చేస్తారు. ఆ మిల్లును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి భవిష్యత్తులో ధాన్యం కేటాయింపు చేయరు. ఈ క్రమంలో సివిల్ సప్లయిస్ అధికారులు పలు జిల్లాల్లోని రైస్‌మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. సుమారు 360 మిల్లుల యజమానులు ప్రభుత్వ చర్యల నుంచి తమను రక్షించాలని కోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వ ఆకస్మిక తనిఖీలకు నిరసనగా తెలంగాణ రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలో గత నెల 12న మిల్లులు మూతపడ్డాయి. గత పదేండ్లుగా మిల్లింగ్ చార్జీలు చెల్లించని ప్రభుత్వం తమను దొంగల్లా చిత్రిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. రైతుల పంటకు, ప్రజలకందే బియ్యానికి మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తున్న రైస్‌మిల్లులను కాపాడవలసిన అవసరం, బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
అందుకోసం తాము బకాయిపడిన సొమ్ముపై 12 % వడ్డీని, 25 % జరిమానాలు విధించవద్దని మిల్లర్లు కోరుతున్నారు. సీఎంఆర్ ఒప్పందం ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్షంగా ఉన్నదని, దానికి సవరణలు అవసరమని వారు అంటున్నారు. ఒప్పందంలో పేర్కొన్నట్లు క్వింటాలు వడ్ల నుంచి 67 కిలోల బియ్యం రావడం లేదని, తడి వల్ల కొంత బియ్యం ముక్కిపోతున్నాయని, బరువు తగ్గుతున్నాయని, ఆ నష్టాన్ని తాము భరిస్తున్నామని చెప్తున్నారు. ఈ నష్టాలతో వేగలేక చాలా మిల్లులు అమ్ముకునే పరిస్థితి ఉన్నదని వారి వాదన.
మూడేండ్లుగా సరియైన నిఘా కొరవడి, ప్రజా పంపిణీ వ్యవస్థపై పట్టు లేకుండా కాలం గడిపిన పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ, అధికారులు ఇప్పుడే కండ్లు తెరిచినట్లు మిల్లుల మీద పడడానికి కారణమెవరు? దీని వెనుక స్వలాభాపేక్ష రాజకీయ కోణం ఉన్నదా? లేదా అధికారుల అవినీతి బాగోతమున్నదా? అనేది ముందు తేలాలి. బెదిరిపోయిన చిన్నచేపలు బకాయిలు చెల్లించగా ఇక మిగిలినవన్నీ పెద్ద చేపలే. రూ.90 కోట్ల బకాయి ఉన్న పెద్దమిల్లులు ఇప్పుడు సర్కార్‌తో బేరసారాలకు దిగాయి. ఈ మధ్య ఓ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ-డిఫాల్ట్ మిల్లులపై విధించిన వడ్డీ, జరిమానా తొలగింపు గురించి ప్రభుత్వంతో చర్చిస్తానని అన్నారు. గత మూడేండ్లుగా సాగుతున్న ఈ తతంగంపై ముందే పరిస్థితులు చేయి దాటిపోకుండా ప్రభుత్వం చూసుకోవాలి. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించి ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా మొత్తం సొమ్ము ముక్కు పిండి వసూలు చేయాలి. అవన్నీ వదిలేసి మిల్లర్లకు అనుకూలంగా ప్రభుత్వం మొగ్గుచూపితే కోల్పోయిన కోట్లాది రూపాయల ప్రజాధనానికి బాధ్యత ఎవరు వహిస్తారు?
బద్రి నర్సన్