భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకొనే ఉత్సవాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలకు మూలపట్టయిన ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే స్ఫూర్తి చక్కగా ప్రతిబింబిస్తుంది. ఉత్సవాల్లో ఇది కనిపిస్తున్నా నిజ జీవితంలో ఈ స్ఫూర్తి కనుమరుగవుతున్నదా అన్న అనుమానం ఈ మధ్యకాలంలో చాలామంది మదిలో మెదులుతున్నది.
ఏమిటీ భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రం వెనుక ఉన్న అర్థం? దీన్ని విశ్లేషించుకోటానికి ఒక మంచి సందర్భం. భారతీయులు ఒక జాతిగా మనుగడకు, భారతీయత అనే భావోద్వేగానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతం. ఇది అందరికీ తెలిసిందే. కానీ దీనిలోని అంతరార్థం లోతుగా అర్థం చేసుకోవటం, విపులంగా విశ్లేషించుకోవటం ఒక జాతిగా మన బాధ్యత. అందుకే అసలు మూలాల్లోకి వెళ్దాం. ఈ సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకుందాం. వందల ఏండ్ల నుంచి అనేక భాషలు, భావాలు, ఆహారం, ఆహార్యం, ఆచార వ్యవహారాలు కలబోసిన బలమైన ఉపసంస్కృతుల కలయిక భారతీయత. భారతీయ సంస్కృతి అనే దానికన్నా ప్రాంతీయ సంస్కృతులు ప్రజల మనోఫలకం మీద బాగా ముద్రపడ్డాయి. తెలుగు సంస్కృతి, తమిళ సంస్కృతి, బెంగాలీ సంస్కృతి అంటే భారతీయులకు బాగా అర్థమవుతుంది. ఇలా ఉప సంస్కృతులు బలీయంగా ఉండటం భారతీయతకు బలం చేకూర్చుతుంది.
మన సంస్కృతుల వైవిధ్యమంతా మన జాతీయగీతం ‘జనగణ మన అధినాయక జయహే… పంజాబ, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ ఉత్కళవంగా, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగా’ అని ఈ గడ్డమీద ఉన్న సంస్కృతులు, భాషలు, నదులు, పర్వతాలు అన్నిటిని మేళవించినదే భారతీయత అని ఒక్క గీతంలో విశ్వకవి రవీంద్రుడు చక్కగా వర్ణించాడు, హృద్యంగా ఆలపించాడు. ఇదీ భారతీయ సాంస్కృతిక సంపద అంటే. ఈ జాతీయగీతం ప్రతి భారతీయుడి రోమంచాలు నిక్కపొడుచుకునేలా చేయగల ఉద్వేగం. దీన్ని ప్రపంచం గుర్తించింది. మరి మనమూ గుర్తించాలి కదా! రవీంద్రనాథుని స్వరూపాన్ని అనుకరించటం కాకుండా స్వభావాన్ని అనుకరిస్తేనే దేశానికి మేలు జరుగుతుందన్న విషయాన్ని మనం గుర్తించాలి.
కానీ, ఈ మధ్యకాలంలో దేశంలో భిన్నత్వాన్ని అసహనంతో ఒక అవరోధంగా చూసే భావజాలం ప్రబలుతున్నది. అదే ఏకీకరణ భావజాలం. ఏకత్వం వీరికి నచ్చదు. భిన్నత్వాన్ని అసలు సహించరు. భారతీయులందరు హిందువులేనని, అందరూ ఒకే భాష మాట్లాడాలని, ఒకేవిధంగా వస్ర్తాలు ధరించాలి, ఒకేవిధంగా జీవించాలనేది వీరి ఉద్దేశం. దీనికి ‘హిందుత్వ’ అని నామకరణం చేశారు. ఈ పదం ఇంతకుమునుపు ఎక్కడా వాడుకలో లేదు. వైవిధ్యభరితమైన భారతదేశం వీరికి ఎన్నటికీ అర్థం కాదు. సాంస్కృతిక జాతీయవాదం వారికి ముఖ్యమంటారు. ఇక్కడ ఎవరి సంస్కృతి ఆధారంగా జాతీయతా భావం పెంపొందాలి? విభిన్న సంస్కృతులు విరాజిల్లుతున్న ఈ భరత భూమి మీద ఏ ఒక్క సంస్కృతో ఏ విధంగా జాతీయతకు ఆధారమవుతుంది? ఒకరి సంస్కృతి ఎక్కువ, మరొకరిది తక్కువని ఎలా చెప్పగలం? అన్ని సంస్కృతులు ఎంతో ఘనచరిత్ర గలవి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, ఒరియా, బెంగాలీ, బీహారీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, మణిపురి, అస్సామీ, హిమాచలి, కశ్మీరీ మొదలైన ఉపసంస్కృతుల సమ్మేళనమే భారతీయత అన్న రవీంద్రుని జాతీయగీతంలోని సత్యం ఈ ఏకీకరణవాదులకు ఎప్పటికీ అర్థం కాదు.
ఏకీకరణ దేశానికి చేటు చేసేదే కానీ మేలుచేసేది ఏ మాత్రం కాదు. ఎందుకు చేటు చేసిదంటే భిన్నత్వం ద్వారా మనకు అలవోకగా అబ్బిన సంస్కారం, సహనం, శాంతి, ఓర్పు, సహజీవనం అనే ఉన్నతమైన విలువలు, లక్షణాలు సన్నగిల్లే ప్రమాదం ఉన్నది. మనకు మన భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు ఎంత ప్రీతో, ఇతరులకు వారి భాష, సంస్కృతి, ఆచారాలు గూడా అంతే ప్రీతి. ప్రేమించేవారికే ప్రేమ విలువ తెలుస్తుంది. విభిన్న సంస్కృతుల కలయికే భారతీయత. అంటే విభిన్న సంస్కృతులతో కలిసి బతుకుతున్నాం కాబట్టి, మనకన్నా భిన్నమైన జీవనశైలితో సామరస్య పూర్వక సహజీవనం మనకు సహజంగా అబ్బిన సంస్కృతి. ఈ భిన్నత్వ సంప్రదాయాన్ని జీర్ణించుకోలేని వారికి సామరస్య సహజీవనం కష్టమైన విషయం. ఈ మధ్యకాలంలో చాలామంది మేధావులు అసహనం ప్రబలటాన్ని నిరసిస్తూ ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాశారు. అలా చేయటాన్ని కూడా చాలా అసహనంగా చూశారు ఈ ఏకత్వవాదులు. ఈ ఏకత్వ ధోరణే నేడు దేశానికి పెను సవాలు. ఆరు నెలలైతే వారు వీరవుతారనే సామెత ఊరికే పుట్టలేదు. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టిందనే సామెతను కూడా మర్చిపోగూడదు. మనిషికి చెడును, సంకుచిత స్వభావాన్ని త్వరగా గ్రహించే లక్షణం ఉన్నది. దాన్నుంచి మనల్ని మనం కాపాడుకోవటం చాలా అవసరం. అప్పుడే అందరం బాగుం టాం, దేశం బాగుంటుంది, అభివృద్ధి బాటలో పయనిస్తుంది.
విభజన, విధ్వంసం ఈ ఏకీకరణ భావజాలంలో అంతర్లీనంగా ఉన్న లక్షణాలు. ఏకత్వం వద్దు, భిన్నత్వం అసలే వద్దు, ఏకీకరణే ముద్దు అంటారు ఈ హిందుత్వవాదులు. చాన్నాళ్లు వీరివాదన భారతీయులకు అంగీకారం కాలే దు. అందుకే చాన్నాళ్లు రాజకీయ, సామాజిక చిత్రానికి అంచున ఉండిపోయారు గాని ఆ చట్రంలోకి రాలేకపోయారు. ప్రజల అంగీకారం లేదు వీరు జాతీయ ప్రధాన స్రవంతిలోకి రావడానికి. కానీ నేడు వారు గెలిచారు. దేశం ఓడింది! అబ్బాయిలు అమ్మాయిలూ కలవకూడదు; పార్కుల్లో అసలు ఉండకూడదు, ముఖ్యంగా వాలెంటైన్ డే నాడు! ఎందుకంటే అది పాశ్చాత్య నాగరికతంట! మనం వాడే సెల్‌ఫోన్ ఏ నాగరికత నుంచి వచ్చింది? కంప్యూటర్ ఏ నాగరికత నుంచి వచ్చింది? ఇంటర్నెట్ ఏ నాగరికత నుంచి వచ్చింది? ప్యాంట్, షర్ట్, సూటు, బూటు ఏ నాగరికత నుంచి వచ్చాయి? కాఫీ, టీ ఏ నాగరికత నుంచి వచ్చాయి? ఈ ప్రశ్నలు ఎవరైనా లేవదీస్తే వారికి హింస ద్వారా సమాధానం చెప్తారు ఈ శ్రీరామ్ ముథాలికులు! వైవిధ్యభరితమైన భారతదేశం వీరికి ఎన్నటికీ అర్థం కాదు. ప్రశ్నిస్తే అస్సలు సహించలేరు వీరు.
ఏకీకరణాన్ని ఊపిరిగా భావించే ఒక ఉన్మాదసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్). సాంస్కృతిక సంస్థ అనే ముసుగు కప్పుకొన్న అసాంఘిక శక్తి ఇది. సామాజిక సంస్థ అనే ముసుగు వేసుకున్న ఉష్ణగుండం. వీరికి భిన్నత్వం గిట్టదు. హిందీ, హిందూ అనే రెండు అంశాలే భారతదేశానికి పునాది కావాలనేది వీరి గుడ్డి నమ్మకం. అంటే దేశమంతటా ఒకే భాష మాట్లాడాలి, ఒకే మతం ఉండాలి, ఒకే విధంగా ఆలోచించాలనేది వీరి వితండవాదం. అంటే భరతజాతి మనుగడకు ఊపిరైన భిన్నత్వాన్ని అణగదొక్కటమే ఏకీకరణ అన్నమాట. ఈ భావజాలానికి ఆకర్షితులైనవారు ఏకరూప దుస్తులు (యూనిఫామ్) ధరిస్తారు. మిలిటరీ తరహాలో కవాతులు చేస్తారు. కర్రలు, కటార్లు పట్టుకుంటారు. హిందీలోనే మాట్లాడుతారు. ఈ సంకుచిత భావజాల వాదానికి, భిన్నత్వం బలీయంగా ఉన్న భారత్‌లో మనుగడ సాగించడం కష్టంగా ఉండేది. అయినా నివురుగప్పిన నిప్పులా వారి కార్యకలాపాలు సాగించుతూ వచ్చారు చాలాకాలం. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సే ఈ భావజాల వారసుడే. అతడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తే! వీరి కార్యకలాపాలు, భావజాలం దేశానికి ప్రమాదకరమని ఈ సంస్థను అనేకసార్లు నిషేధించింది భారత ప్రభుత్వం. అయినా ఈ దరిద్రపు భావజాలానికి ఆకర్షితులైనవారు ఇరుకు మతతత్వాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. ఇందులో చదువుకున్న వారూ ఉండటం విస్మయం కలిగించే విషయం. మనిషి చెడును త్వరగా గ్రహించుతాడనటానికి ఇంతకుమించిన నిదర్శనం ఏం కావాలి?
కానీ, సమాజంలో పట్టు సాధించాలంటే ప్రచారం సరిపోదు, విష ప్రచారం చేయాలనుకున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎక్కడ ఉంటే అక్కడ హిందువులకు ఇతర మతాలవారికి మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఉంటుంది. ఈ విష ప్రచారంలో భాగంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం తీవ్రంగా చేశారు. అయినా దేశం వారి ఉచ్చులో పడలేదు. కానీ..
2004 నుంచి 2014 మధ్యకాలంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సారథ్యంలోని యూపీయే సంకీర్ణ ప్రభుత్వంలో జరిగిన అడ్డూ అదుపులేని అవినీతితో దేశ ప్రజలు విసిగి వేసారిపోయారు. నిరాశ, నిస్పృహలో ఉన్న బలహీన సమయాన్ని ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి పుట్టుకొచ్చిన బీజేపీ బాగా వాడుకొని అధికారం చేజిక్కించుకున్నది. అది మొదలు అసహనం ప్రబలింది. భిన్నత్వం మీద దాడి మొదలైంది. దాని పర్యవసానమే ఒక దేశం-ఒక పన్ను, ఒక దేశం-ఒక ఎన్నిక లాంటి ఏకీకరణ ధోరణులు. రేపో మాపో ఒక దేశం-ఒకే వాతావరణం అనే నినాదాన్ని తెరమీదికి తెచ్చి నా ఆశ్చర్యం లేదు!
సంఘ్ పరివార్‌గా చలామణి అయ్యే ఒక విష వలయం గుప్పిట్లో దేశం చిక్కుకున్నదీ రోజు. గాంధీని చంపిన గాడ్సేను చట్టసభలో గొప్పవాడుగా పొగడటం, గాంధీ వర్ధంతి రోజు ఆయన సమాధి వద్దకు వెళ్లి పూలమాలలు వేయడం, మౌనం పాటించడం ఈ విష సంస్కృతి రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. కానీ, ఈ రోజు మన మౌనమే రేపు మనిషికి శాపంగా మారే ప్రమాదం ఉన్నదని చరిత్ర చెప్తున్నది. జర్మనీ, ఇటలీలలో ఇదే జరిగింది. మనం మాట్లాడవలసిన సమయంలో మౌనం వహించితే చరిత్ర మనల్ని క్షమించకపోవచ్చు. మేధావులు, విజ్ఞతగల ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి.
(వ్యాసకర్త: అభేరి, చరిత్ర విద్యార్థిని)