ప్రపంచీకరణ నేపథ్యంలో విద్య వ్యాపార వస్తువుగా మారిపోయి అతిపెద్ద వ్యాపార పరిశ్రమగా రూపాంతరం చెందింది. మొదట్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల పేరుతో కొందరు వ్యాపారస్తులు విద్యా సంబంధమైన సేవలను తమ దుకాణాల ద్వారా నేరుగా అమ్మకానికి పెట్టారు. మరి కొందరు వీటి అనుబంధ సంస్థగా గుర్తింపు పొంది పరోక్ష వ్యాపారానికి తెరతీశారు. విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడి విద్యార్థులను దోచుకోవడానికి సిద్ధమయ్యాయి. విద్యార్థిని ఒక వినియోగదారుడిగా గుర్తించిన ఈ నయా విశ్వవిద్యాలయాలు తమ వినియోగదారుడిని అన్ని విధాల సంతృప్తి పరచడానికి అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాయి.
విద్య అనేది వాణిజ్య వస్తువు కాదని, దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టడం నేరమని సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చినప్పటికీ విద్యా వ్యాపారవేత్తల తీరు మారడం లేదు. సామాజిక అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం విద్య ఎంతో ఉపయోగపడుతుందని మన ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా పరోక్షంగా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. విద్యా వ్యాపారులు తమ ధన దాహాన్ని తీర్చుకోవడానికి తమ విద్యాసంస్థలు చాలా గొప్పవని చూపిస్తూ, ఫీజులు పెంచడానికి, తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లడానికి అనేక ఎత్తుగడలతో పర్యవేక్షణ అధికారులను బురిడీ కొట్టించడం పరిపాటిగా మారింది.
ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీల స్థాపనకు ప్రభుత్వాలే నిబంధనలను సడలించి రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతుండటంతో యూనివర్సిటీల స్థాపన సులువైంది. కానీ వాటికి అకడమిక్‌గా గుర్తింపు రావడానికి న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్)ను లోబరుచుకునేందుకు ప్రైవేట్ సంస్థలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇందుకు కావలసిన రంగాన్ని సిద్ధం చేయడంలో కేంద్ర ప్రభుత్వం తలమునకలైంది.
అందులో భాగంగానే కేంద్రీకృత వ్యవస్థను స్థాపించడం, 1956లో పార్లమెంటు చట్టం ద్వా రా ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నిక ల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్ టీ), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) లాంటి సంస్థలను రద్దు చేసి, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపన లాంటి ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నది. ఏక కేంద్ర నియంత్రణ వ్యవస్థలోని అధికారుల నియామకాల్లో అక్రమ మార్గాన చొరబడటానికి కావలసిన రంగాన్ని నూతన జాతీయ విద్యా విధానం సిఫార్సుల రూపంలో కావలసిన ఏర్పాటు చేస్తున్నది.
అందుకే ‘యూనివర్సిటీలు, కాలేజీలలో టీచర్లు, అకడమిక్ సిబ్బంది నియామకం, ప్రమోషన్ ఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణకు కనీస అర్హతలు’ పేరిట కొత్త నిబంధనల ముసాయిదా పేరుతో అధ్యాపకులు, వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో యూజీసీ సడలింపులను తీసుకొస్తున్నది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ అనుకూల రాజకీయ అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు విశ్వవిద్యాలయ బోధన పోస్టుల్లో చొరబడవచ్చు. ఎటువంటి అధ్యాపక బోధనా అనుభవం లేకుండా వీసీలుగా అవతారం ఎత్తవచ్చు. ఈ నేపథ్యంతో అక్రెడిటేషన్ కౌన్సిల్ వంటి వాటిల్లో చొరబడవచ్చు. తద్వారా ప్రైవే టు విద్యా సంస్థలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు మేలు జరిగే నిర్ణయాలు, సూచనలు చేయ డం, సందులో సడేమియా లాగా కొంత సొంత లాభం చూసుకోవచ్చు. అదే కేఎల్ యూనివర్సిటీ కుంభకోణం!
జాతీయ అంచనా, మదింపు మండలి (న్యాక్) గుర్తింపు, గ్రేడింగ్ పెంచుకునేందుకు రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలలు, యూనివర్సిటీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. కమిటీ సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బు ఎరవేసి ఉత్తమ గ్రేడింగ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ఇంకాస్త ముందుకెళ్లి తప్పుడు పత్రాలు సృష్టించడం, అధ్యాపకులు, ఆచార్యులు లేకున్నా ఉన్నట్టుగా చూపడం వంటి అవకతవకలకు పాల్పడుతున్నాయి. విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది సరిపడా ఉన్నారా? వారి విద్యార్హతలు విద్యాసంస్థలు ఆన్లైన్లో పంపిన సమాచారం ప్రకారం ఉన్నాయా? తదితర అంశాలను క్షేత్రస్థాయి తనిఖీలకు వచ్చే న్యాక్ కమిటీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం 30 శాతం వెయిటేజీ పాయింట్లు ఇచ్చే వెసులుబాటు కూడా ఈ కమిటీ చేతుల్లో ఉంటుంది. ప్రముఖ పరిశ్రమ సంస్థలతో ఒప్పందాలు ఉన్నట్టు కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీల యాజమాన్యాలు ఫోర్జరీ పత్రాలు సమర్పించి న్యాక్ గుర్తింపును మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గ్రేడ్ల కోసం తద్వారా వచ్చే ఆర్థిక లాభాల కోసం ప్రైవేటు యాజమాన్యాలు ఎంతకైనా తెగిస్తాయనేది వాస్తవం. నాసిరకం విద్యాసంస్థలకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్లు దక్కడమే ఇందుకు నిదర్శనమని నిపుణులు చెప్తున్నారు. న్యాక్ కమిటీ సభ్యులకు లక్షల రూపాయలు ముట్టజెప్పినట్టు సీబీఐ గుర్తించి కేసులు నమోదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. న్యాక్ గుర్తింపు ఉంటే ఆ కళాశాలలో ప్రమాణాలు బాగున్నట్టు లెక్క ! న్యాక్ గుర్తింపు ఉంటే యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా వస్తుంది.
అటానమస్ హోదా దక్కితే సొంతంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఆ సదుపాయం ఉంటే విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డొనేషన్లు, ఫీజులు వసూలు చేసుకునే అవకాశం యాజమాన్యాలకు లభిస్తుంది. విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ప్రామాణికంగా కళాశాల న్యాక్ సర్టిఫికెట్‌ను అడుగుతున్నారు. కొన్ని కంపెనీలు ప్రాంగణ నియామకాలకు, వేతన ప్యాకేజీలకు కూడా దీనిని పరిగణనలోనికి తీసుకుంటున్నాయి. ‘జాతీయ విద్యా విధానం-2020’ అమలు మాటున ప్రపంచ బ్యాంకు షరతులు అమలు చేసేందుకు ప్రభుత్వాలు యత్నిస్తున్నాయి. భారతదేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా సంస్థలు అనుకూలమైన అక్రెడిటేషన్, రేటింగ్లను కొనుగోలు చేయగలిగితే, విద్యార్థు లు మోసపోతారు. విద్యా ప్రమాణాలు తారుమా రు అవుతాయి. కాబట్టి ఈ మార్పులకు అవకా శం కల్పించే ప్రభుత్వాల విధానాలను ప్రశ్నించే చైతన్యాన్ని విద్యాభిమానులు, అధ్యాపకులు, పౌర సమాజం ప్రజల్లో పెంపొందించాలి.
– (వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్)
కె. వేణుగోపాల్ 98665 14577