2024, ఆగస్టు 28 నాటికి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకానికి పదేండ్లు పూర్తయ్యాయి. 2014 మే నెలలో తొలిసారి ప్రధానిగా పీఠమెక్కిన నరేంద్ర మోదీ తన ప్రతి నిర్ణయం ఒక సంచలనం కావాలనే జోరు మీదున్నారు. ఆ క్రమంలో 2014, ఆగస్టు 15 నాడు ‘పీఎం జన్‌ధన్ యోజన’ పథకాన్ని ప్రకటించారు. పైసా డిపాజిట్ లేకుండా దేశంలో ఉన్నవారందరికీ పొదుపు ఖాతాలు తెరవాలని బ్యాంకులను ఆదేశించారు. నిజానికిది 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘జీరో బ్యాలెన్స్’ ఖాతాకు నకలు మాత్రమే. అవి కొనసాగుతూ 2014 వరకు లక్షలాది జీరో బ్యాలెన్స్ ఖాతాలు బ్యాంకు రికార్డుల్లోకి ఎక్కాయి. దానికి బీమా,ఓవర్‌డ్రాఫ్ట్ వంటివి జోడించి ప్రధాని మోదీ కొత్త పేరును పెట్టారు. ఉత్తర భారతంలో దీన్ని ‘మోదీ ఖాతా’గా పిలుస్తుంటారు.
Jan Dhan Yojana | ప్రధాని మోదీ ఆదేశాల మేరకు 2014, ఆగస్టు 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు బ్యాంకులు ఆ ఖాతాల పనిలో పడ్డాయి. జనాలతో బ్యాంకులు కిక్కిరిసిపోవటంతో ప్రజల వద్దకే బ్యాంకు ఉద్యోగులు వెళ్లారు. తత్ఫలితంగా జనాలు ఊళ్లలోని కూడళ్లలోకి వచ్చి మరీ ఖాతాలు తెరిచారు. ఖాతాల్లేవని వెళ్లగొట్టే బ్యాంకువాళ్లు ‘రండి! రండి!’ అని రోడ్లపైకి రావడం అందరికీ వింతగా అనిపించింది. ఏదో ఒక గుర్తింపు కార్డు చూపిస్తే చాలు ఖాతా చేతికి వచ్చినట్టే. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో వేస్తామని అప్పటికే మోదీ ప్రకటించినందు వల్ల ఆ ఆశతో కోట్లాది మంది ఖాతాలను తెరిచారు. అప్పటికే అకౌంట్ ఉన్నవాళ్లు కూడా ప్రభుత్వ పథకాలకు విడిగా ఓ ఖాతా ఉండాలేమో అనుకొని ‘జన్‌ధన్’ ఖాతా కూడా తెరిచారు. 2014 ఆగస్టు చివరి వారంలో తెరిచిన జన్‌ధన్ ఖాతాల సంఖ్య కోటి 81 లక్షలు. అది ఓ గిన్నీస్ రికార్డు. ఈ దశాబ్ద కాలంలో ఆ యోజన ఫలితంగా 53 కోట్ల బ్యాంకు ఖాతాల్లో రూ.2.31 లక్షల కోట్లు జమయ్యాయని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది.
ఈ ఖాతాదారులకు రూ.30 వేల జీవిత బీమా, రూ.2 లక్షల ప్రమాద బీమాతో పాటు రూ.10 వేలు ఓవర్‌డ్రాఫ్ట్ అప్పుగా లభించడం ఈ పథకంలోని ప్రత్యేకత. 6 నెలల కాలంలో ఖాతాలో కనీస నాలుగు లావాదేవీలుంటేనే ఓవర్‌డ్రాఫ్ట్‌కు అర్హత ఉంటుంది. అయితే, బ్యాంకులు ఇంటికి దూరంగా ఉండటంతో పని వదిలేసుకొని ఈ లావాదేవీలు నడిపినవారు తక్కువ. మామూలు సెల్‌ఫోన్‌కు సమాచారం అందించే వ్యవస్థ ఉన్నా అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేనందువల్ల ఏ విషయం వారికి చేరకపోవడం మరో అడ్డంకి. దేశంలోని గ్రామాల్లో చిన్న నగదు లావాదేవీలు నడపడానికి వీలుగా ఆర్బీఐ బిజినెస్ కరస్పాండెంట్ వ్యవస్థకు అనుమతినిచ్చింది. దీని ఆధారంగా బ్రాంచీలకు దూరంగా ఉన్న గ్రామాల్లో ఆయా సర్వీస్ బ్యాంకుల ద్వారా ‘బ్యాంకు మిత్ర’ల నియామకం జరిగింది. అయితే వారికి తక్కువ జీతంతో పాటు ఎలాంటి సర్వీస్ రూల్స్, క్రమశిక్షణ చర్యల విధానం లేకపోవడం వల్ల ఎవరూ నిలకడగా ఉండటం లేదు. పైగా, అక్షరజ్ఞానం లేని గ్రామీణులను కొందరు మోసం కూడా చేస్తున్నారు.
2017లో అవినీతికి పాల్పడ్డ బ్యాంకుమిత్రలు 20 శాతం ఉండగా ఏటా వారి సంఖ్య పెరుగుతున్నదని పలు నివేదికలు చెప్తున్నాయి. బ్రాంచీల విస్తరణ లేదా బ్యాంకు సిబ్బందే వారానికి ఒక రోజు గ్రామాల్లోకి వెళ్లడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. హంగామాగా ఆరంభించిన జన్‌ధన్ యోజన ప్రయోజనాల గురించి ప్రజల్లోకి సరిగా వెళ్లలేదనే చెప్పాలి. ప్రభుత్వం దీని నిర్వహణకు ఒక పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటుచేయలేదు. డబ్బు అవసరం ఉన్నవారికి, సామాన్యులకు బ్యాంకు ఓవర్‌డ్రాఫ్ట్ ఎంతో ఉపయోగకరం. అయితే దీనిగురించి ఖాతాదారులకు తెలిపే ప్రయత్నం ప్రభుత్వం కాని, బ్యాంకులు కాని చేయడం లేదు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా సామాన్యుడికి పది రూపాయలు ఇవ్వడానికి కూడా బ్యాంకులు ముందుకురావు. ఓవర్‌డ్రాఫ్ట్ ఇస్తే ఆ సొమ్ము తిరిగిరాదని బ్యాంకర్ల విశ్వాసం, అనుభవం. 2016, డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం 30 కోట్ల ఖాతాల్లో 45 లక్షల మందికి ఓవర్‌డ్రాఫ్ట్ అందింది. అంటే, అది 2 శాతం కూడా కాదు. ఖాతాలో లావాదేవీలు నడిపించి ఓవర్‌డ్రాఫ్ట్ అందేలా ప్రజలకు సాయపడే బాధ్యతను ప్రభుత్వం ఏదైనా గ్రామీణ శాఖకు కట్టబెట్టాలి. ఊర్లలో రికవరీ బృందాలను ఏర్పాటుచేసి మళ్లీ తిరిగి కట్టేలా చర్యలు తీసుకోవాలి. ఓవర్‌డ్రాఫ్ట్ రికవరీ సంతృప్తిగా ఉంటే ఆ సొమ్మును పెంచడానికి కూడా బ్యాంకులు ముందుకు రావచ్చు. ప్రైవేటు లోన్‌యాప్‌ల ద్వారా చిన్న మొత్తాలు తీసుకొని అధిక వడ్డీ, పెనాల్టీలు కట్టలేక ప్రాణం మీదికి తెచ్చుకొన్న వార్తలు ఎన్నో ఉన్నాయి.
2022లో జన్‌ధన్ యోజన ఖాతాల పరిస్థితిపై రాజస్థాన్ గ్రామాల్లో ఇన్‌స్పైరా జర్నల్స్ సేకరించిన వివరాల ప్రకారం ఒక శాతం మాత్రమే ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకున్నారు. ఖాతా తెరిచిన నాటినుంచి 47 శాతం మంది ఒక్క లావాదేవీ కూడా జరపలేదు. 37 శాతం మందికే రూపే కార్డులు అందాయి. వారిలో రూపే కార్డులను రెన్యూవల్ చేసుకున్నవారు తక్కువే. 59 శాతం మంది తగిన ఆదాయం లేక ఖాతాను నడపడం లేదు. 33 శాతం మందికి ఇదివరకే బ్యాంకు ఖాతాలున్నాయి. ప్రభుత్వం డబ్బులు వేస్తుందని ఈ ఖాతాను కూడా తెరిచామని వారంటున్నారు. కేవలం ఖాతాల సంఖ్య, అందులో జమైన సొమ్మును ప్రచారం చేసుకొని ఈ పథకం గొప్ప ఫలితాలను సాధించిందని ప్రభుత్వం చెప్పుకోవడం తగదని, జన్‌ధన్ యోజన లక్ష్యాలు, ప్రయోజనాలు ఖాతాదారులకు అందినప్పుడే అది నిజమైన విజయమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పడం గమనార్హం.
గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఖాతాల్లో రూ.10,300 కోట్లు వేయగా, అందులోంచి రూ.4 వేల కోట్లు మాత్రమే విత్‌డ్రా అయ్యాయని తెలుస్తున్నది. అంటే, తమ ఖాతాల్లో డబ్బు పడిన సమాచారం చేరవేసే వ్యవస్థ కూడా లేదన్నమాట. ఈ మధ్య బయటపడిన మరో విషయమేమంటే ఈ ఖాతాలు సైబర్ మోసగాళ్లకు ఉపయోగపడుతున్నాయట. ఈ ఖాతాలు తెరిచేప్పుడు ఎలాంటి కేవైసీ నిబంధనలు పాటించలేదు కాబట్టి, ఆయా వ్యక్తులను పట్టుకోవడం ఇప్పుడు కష్టమే. కోట్లలో జన్‌ధన్ ఖాతాలున్నందువల్ల కోరుకున్నన్ని ఖాతాలు సైబర్ నేరాలకు వాడుకోవచ్చు. ఖాతాదారు రూపే కార్డును తీసుకుంటే ఎక్కడినుంచైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇంత వైఫల్యం, దుర్వినియోగం అవుతున్న జనధన్ యోజన పథకాన్ని కేంద్రం లక్ష్యసాధన దిశగా, ప్రజలకు ఆర్థిక సహాయకారిగా మలచాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
బి.నర్సన్
94401 28169