రాజకీయ పార్టీలు కూడా కార్పొరేట్ అవతారం ఎత్తేశాయి. ఓటర్ల నమోదు మొదలుకొని అభ్యర్థుల ఎంపిక, ప్రచారం దాకా అన్ని బాధ్యతలను కొన్ని పార్టీలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. ఈ సేవలను కొన్ని పార్టీలు మంచికోసం ఉపయోగించుకుంటుంటే, కొన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందు కు ఉపయోగించుకుంటున్నా యి. కర్ణాటకలో బీజేపీకి ఓట్లు వేయని ఓటర్లను జాబితా నుంచి గల్లంతు చేసే కుట్ర తాజాగా రట్టయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను జేడీయూ(ఎస్) ఒక ఔట్సోర్సింగ్ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, స్క్రూట్నీ చేసింది. 125 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. అభ్యర్థుల ఆర్థికస్థితి, సామాజికబలం, నియోజకవర్గంపై వారికున్న పట్టు, ప్రజలతో మమేకమయ్యే విధానం, ఉపన్యాస నైపుణ్యం తదితర అంశాలలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుందని సదరు సంస్థ వెల్లడించింది. ఇదం తా చూస్తుంటే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉన్నట్లుగా ఎన్నిక ల్లో టికెట్ ఆశించే అభ్యర్థుల కోసం భవిష్యత్తులో కోచింగ్ సెంటర్లు వెలిసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీరు చూస్తే ‘మంది పెళ్లిలో మంగళ హారతి పట్టినట్టు’ ఉందని తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన కామెంట్‌పై షర్మిల స్పందిస్తూ, తెలంగాణకు ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. షర్మిల సొంతూరు తెలంగాణ కాదని తెలిసిన జనం ఆమెను, ఆమె పార్టీని పట్టించుకోవడం లేదు. అలాంటిది ఆమె చంద్రబాబు పార్టీని స్వాగతించడమేమిటని తెలంగాణవాదులు ముక్కున వేలేసుకుంటున్నారు.
– వెల్జాల