ప్రజాస్వామ్యానికి దేవాలయాలుగా, కోట్లాది మంది ప్రజల ఆశాజ్యోతులుగా వెలుగొందే చట్టసభల ప్రాంగణం నేడు అధికారమదంతో కూడిన పోలీసు దౌర్జన్యాలకు వేదికగా మారడం సమకాలీన రాజకీయ చరిత్రలో అత్యంత అసహ్యకరమైన, లజ్జాకరమైన అధ్యాయం. శాసనసభ ముంగిట ప్రతిపక్ష బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన అనాగరిక, దురహంకారపూరిత తీరు రాజ్యాంగ స్ఫూర్తిని నిలువునా దహించివేసింది. ప్రజల గొంతుకగా అసెంబ్లీకి వస్తున్న మహిళా ప్రజాప్రతినిధుల జుట్టు పట్టుకుని లాగడం, గొంతు నులమడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చీరలు లాగుతూ వ్యవహరించడం ఏ రకమైన పాలనకు సంకేతం? ఇది కేవలం కొందరు నేతలకు జరిగిన పరాభవం కాదు; ఇది దేశంలోని మొత్తం మహిళా సమాజానికి, రాజ్యాంగ వ్యవస్థలకు జరిగిన పూడ్చలేని గాయం.
ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలుపడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై నిలదీయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ప్రభుత్వ వైఫల్యాలు, పనితీరుపై ప్రజాప్రతినిధులు శాసనసభకు వచ్చి నిరసనను వ్యక్తం చేయడం అనాదిగా వస్తున్న ప్రజాస్వామ్య సంప్రదాయం. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు శాసనసభకు చేరుకున్న మాజీ మంత్రులు, సీనియర్ శాసనసభ్యులమైన నాపై (పి. సబితా ఇంద్రారెడ్డి), సునీతా లక్ష్మారెడ్డితోపాటు ఇతర మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రదర్శించిన నిర్బంధ వైఖరి శాంతిభద్రతల పరిరక్షణ కాదు; అది కేవలం అధికారపక్ష అణచివేత ధోరణి. శాసనసభ ముంగిట నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, భౌతిక దాడులకు పూనుకోవడం రాజ్యాంగబద్ధమైన పాలన స్థానే పోలీసు రాజ్యాన్ని ప్రతిష్ఠించే కుట్రలా కనిపిస్తున్నది. ‘ప్రజాపాలన’ అనే పదబంధాన్ని ఊతపదంగా వాడుకొనే ప్రస్తుత పాలకుల అసలు రంగు ఈ ఘటనతో పూర్తిగా బయటపడింది. ఈ ఘోర కలికి కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయ స్థాయిలో మాట్లాడే నీతులకు, రాష్ట్ర స్థాయిలో వారు అనుసరిస్తున్న అణచివేత చర్యలకు ఉన్న తీవ్ర వ్యత్యాసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో నల్లచొక్కాలు ధరించి, పోస్టర్లు పట్టుకొని నిరసన తెలిపినప్పుడు అది ప్రజాస్వామ్య పరిరక్షణగా, రాజ్యాంగ హక్కుగా ఊదరగొట్టిన ఆ పార్టీ నాయకత్వం, నేడు తెలంగాణ అసెంబ్లీ వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్ట్లతో అసెంబ్లీకి వస్తే పోలీసులతో దాడి చేయించడంలో ఉన్న ఔచిత్యం ఏంది? జాతీయ స్థాయిలో ఒక రాజ్యాంగ సూత్రం, స్వయంగా అధికారంలో ఉన్న రాష్ట్రంలో మరొక అణచివేత సూత్రం చెల్లుబాటు అవుతుందా? రాహుల్ నిరసన తెలిపితే అది పోరాటం, తెలంగాణలో మహిళా ప్రజాప్రతినిధులు నిరసన తెలిపితే నేరమా? ఈ దగాకోరు ద్వంద్వవిధానాన్ని ప్రజాస్వామ్యవాదులు ఏవిధంగా సమర్థిస్తారు?
భారత రాజకీయ చరిత్రను తిరగేస్తే, చట్టసభల లోపల లేదా వెలుపల మహిళా నేతలపై భౌతికదాడులకు దిగిన ప్రతి సందర్భంలోనూ పాలకులు ప్రజల గ్రహపాటుకు గురయ్యారనేది స్పష్టమవుతున్నది.
తమిళనాడు శాసనసభలో నాటి ప్రతిపక్ష నేత జయలలితపై అసెంబ్లీ ప్రాంగణంలో దాడి చేసి, ఆమె చీరను లాగి అవమానించినప్పుడు, కన్నీళ్లతో బయటకువచ్చిన ఆమె మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడుతానని శపథం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ రాష్ట్ర రాజకీయ చిత్రాన్నే మార్చేశాయి. 1995లో ఉత్తరప్రదేశ్లో మాయావతిపై జరిగిన భౌతికదాడి నాటి ప్రభుత్వ పతనానికి నాంది పలికింది. కేరళ శాసనసభలో 2015 బడ్జెట్ సమావేశాల సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన అణచివేత చర్యలు తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. సింగూర్ ఉద్యమ సమయంలో టీఎంసీ అగ్ర నేత మమతా బెనర్జీని పోలీసులు ఈడ్చిపారేసిన దృశ్యాలు వామపక్ష ప్రభుత్వ శాశ్వత పతనానికి బాటలు వేశాయి. చరిత్ర నేర్పిన ఈ గుణపాఠాలను కాంగ్రెస్ పాలకులకు గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నది.
అధికారమదంతో మహిళా నేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ఏ ప్రభుత్వం పూనుకున్నా, కాలక్రమంలో వారు తీవ్ర రాజకీయ పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఒకవైపు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాలు తెస్తున్నామని గొప్పలు చెప్పుకొనే రాజకీయ వ్యవస్థ, మరోవైపు ఎన్నుకైన మహిళా ప్రజాప్రతినిధుల మీదనే ఈ రకమైన తీవ్ర భౌతికదాడులకు దిగడం హేయమైన చర్య. మాజీ మంత్రులుగా, శాసనసభ్యులుగా సమాజంలో ఎంతో గౌరవం ఉన్న నాకు (సబితా ఇంద్రారెడ్డి), సునీతాలక్ష్మారెడ్డి వంటి సీనియర్ నాయకులకే రక్షణ లేకపోతే, రేపు రాజకీయాల్లోకి రావాలనుకునే సాధారణ మహిళలకు ఈ వ్యవస్థ ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది?.
ద్రౌపది వస్ర్తాపహరణం సభామధ్యలో జరిగినప్పుడు మౌనంగా ఉన్న రాజ్యాంగ వ్యవస్థలు ఏ విధంగా కూలిపోయాయో మహాభారతం చెప్పింది. నేడు శాసనసభ గుమ్మం వద్ద జరిగిన ఈ ఘోరం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన మహమ్మారే.
ప్రస్తుత ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. పోలీసు బలగాలను ఉపయోగించి ప్రతిపక్షాలను, ప్రత్యేకించి మహిళా నేతలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడం ద్వారా పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు. మహిళా శాసనసభ్యుల చీరలు లాగిన, గొంతు నొక్కిన, జుట్టు పట్టుకుని లాగిన పోలీసు అధికారులను తక్షణమే గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించి, వారిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా? లేదా, ఈ వికృతచేష్టలకు తామే స్వయంగా ఆదేశాలిచ్చామని, పోలీసుల ‘అతి’ వెనుక ప్రభుత్వ హస్తం ఉన్నదని బహిరంగంగా ఒప్పుకొంటారా? తాత్కాలికంగా పోలీసు బలగాల వెనుక దాక్కొని, భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్షం నోళ్లు మూయించి పాలకులకు పైశాచిక ఆనందం కలుగవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదనే సత్యాన్ని విస్మరించవద్దు. నేడు అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలోకి రాక తప్పదు. చట్టసభల గౌరవాన్ని, నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును, మహిళా ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని కాలరాస్తే, రేపు ప్రజ ల ఆధ్వర్యంలో ఎదురయ్యే నిరసన మంటలకు ప్రభుత్వం బలికావడం ఖాయం! ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, తన ప్రజాస్వామ్య వ్యతిరేక తీరును మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం.