ప్రాజెక్టు పునరుద్ధరణే తక్షణ కర్తవ్యం
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి పాత మార్గం లో నీటిని తరలించినా అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ కానే కాదు. ప్రాణహిత- చేవెళ్లను మూర్ఖుడు మాత్రమే గ్రావిటీ పథకమని అనగలడు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం లేకుండానే ప్రారంభించింది. ఏ ప్రభుత్వమైనా మొదట హెడ్ వర్క్స్‌ను పూర్తి చేసి, కాలువలను తవ్వుతుంది.
- కాళేశ్వరంపై విష ప్రచారం.. అసలు వాస్తవాలు-2
2.ప్రాణహిత- చేవెళ్ల గ్రావిటీ ప్రాజెక్టా?
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి పాత మార్గం లో నీటిని తరలించినా అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ కానే కాదు. ప్రాణహిత- చేవెళ్లను మూర్ఖుడు మాత్రమే గ్రావిటీ పథకమని అనగలడు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం లేకుండానే ప్రారంభించింది. ఏ ప్రభుత్వమైనా మొదట హెడ్ వర్క్స్‌ను పూర్తి చేసి, కాలువలను తవ్వుతుంది. ఇక్కడ మాత్రం తలను వదిలేసి తోక నుంచి పనులు మొదలు పెట్టారు. తుమ్మిడిహట్టి నుంచి 75 కిలోమీటర్ల కాలువను తవ్వి, సింగరేణి భూములు అడ్డురావడంతో వదిలేశారు. ఈ లోపు తెలంగాణ ఏర్పాటైంది. పైన వివరించిన పరిణామాల నేపథ్యంలో రీ ఇంజినీరింగ్ చేయవలసి వచ్చింది. కాబట్టి, తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని ఎల్లంపల్లికి తీసుకురావచ్చన్నది అబద్ధపు ప్రచారమే. ఎల్లంపల్లి నుంచి రీ ఇంజినీరింగ్ తర్వాత కూడా జలాశయాల నిల్వ సామర్థ్యం పెంచడం తప్ప ఏ మార్పు లేదు.
వార్ధా బ్యారేజీ ఎందుకు?: గత ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి, ఆ బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు 20 టీఎంసీల సాగునీరు ఇవ్వాలని భావించింది. తుమ్మిడిహట్టి వద్ద నది ప్రవాహం 40 డిగ్రీల కోణంలో ఉండటంతో నిర్మాణం క్లిష్టమైనది. ఖర్చు కూడా భారీగా ఉండటంతో ప్రభుత్వం 20 టీఎంసీల నీటిని తరలించడానికి వార్ధా నదిపై వీర్దండి గ్రామం వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దీంతో బ్యారేజీ నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా, ఖర్చు భారీగా తగ్గింది. రూ.4,550 కోట్లకు డీపీఆర్ తయారైంది. అయితే ప్రభుత్వం మారడంతో ఇది కనుమరుగైంది.
3.డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారా?
ఇది కూడా అబద్ధపు ప్రచారమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని కీలకమైన తేదీలను పరిశీలిస్తే వారు చేసిన ఆరోపణ అబద్ధమని తేలిపోతుంది. 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరిగింది. 2019 జూన్ 21న ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు పనులకు, శంకుస్థాపనకు ముందు జరిగిన సంఘటనలు ఇలా ఉన్నాయి. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్ చేయాలని నిర్ణయించిన వెంటనే 2015 ఏప్రిల్ 22న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్కు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి వర్క్ ఆర్డర్ జారీ చేసింది. వారు 2016 జనవరి 17 నాటికి మూడు బ్యారేజీలకు సంబంధించిన డిజైన్, డ్రాయింగ్, అంచనాలను అందించారు. వాటి ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులకు ప్రభుత్వం 2016 మార్చి 1న పరిపాలనా అనుమతులను జారీచేసింది. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ 2016 ఏప్రిల్ 11న టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు. అనంతరం బ్యారేజీల నిర్మాణానికి 2016 మే 3న టెండర్లు పిలిచారు. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ అంతిమ నిర్ణయం మేరకు మూడు బ్యారేజీల పనులను వేర్వేరు కంపెనీలకు 2016 ఆగస్టు 26న అప్పగించారు. భూభౌతిక పరీక్షలు, ఇతర అధ్యయనాలు జరిగిన తర్వాతనే, వాటి ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వ డిజైన్స్ విభాగం బ్యారేజీలకు డిజైన్లను అందించింది. భూభౌతిక పరీక్షలు జరపకుండా బ్యారేజీలే కాదు, ఏ నిర్మాణం చేపట్టరు. Design of Barrages on Permeable Foundations పై కేంద్ర జల సంఘం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు జారీ చేసిన మార్గదర్శకాలు, సర్క్యూలర్లు, కోడ్లను తు.చ తప్పక పాటించి బ్యారేజీల డిజైన్లను రూపొందించారు. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లలో లోపాలు ఉన్నాయని అనడం అంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, సర్క్యూలర్లు, కోడ్లను తప్పుబట్టడమే. ఈ నివేదికను ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి 2017 ఫిబ్రవరి 22న, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు 2017 మార్చి 27న సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2017 మార్చి 31న జారీ అయిన మొదటి దశ పర్యావరణ అనుమతితో ప్రారంభమైన కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ చివరగా 2018 జూన్ 6న జారీ అయిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదంతో ముగిసింది. కాబట్టి డీపీఆర్ లేకుండా, ఎటువంటి అధ్యయనాలు, భూభౌతిక పరీక్షలు జరపకుండా ప్రాజెక్టు పనులను ప్రారంభించారన్న ఈ ఇద్దరు మేధావుల ఆరోపణలకు ఏ విలువ లేదు.
4.నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికలో నిజమెంత?
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ 2023 అక్టోబర్ చివరలో హడావుడిగా వండివార్చిన రాజకీయ నివేదికపై నాడే విమర్శలు వెల్లువెత్తాయి. ఎటువంటి పరిశీలన జరపకుండానే, ఎటువంటి భూభౌతిక పరీక్షల ఫలితాలు లేకుండానే, తెలంగాణ ఇంజినీర్లతో చర్చించకుండానే ఇటువంటి నిర్ధారణలకు రావడం కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఒక సాంకేతిక సంస్థ చేయవలసిన పని కాదు. ఊహాగానాలతో కేంద్రంలోని పాలక పక్షానికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి నివేదికను వండివార్చినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నదీగర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని డ్యాం సేఫ్టీ అథారిటీ వారే ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. అది దురదృష్టకరమైనదే. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారు ఏవైనా పునరుద్ధరణ చర్యలు సూచిస్తారని ఆశించిన ప్రాజెక్టు ఇంజినీర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. చివరికి తాత్కాలిక రక్షణ చర్యలను సూచిస్తూ పంపిన నివేదికలో తమకు తెలియని కొత్త పరిష్కార మార్గాలు ఏమీ లేవని, దీని కోసం నాలుగు నెలల విలువైన కాలాన్ని హరించి వేశారని ఇంజినీర్లు వాపోయారు. ఇదీ ఘనమైన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారి నిర్వాకం. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారు చెప్పినవే పరిష్కారాలు అని ప్రభుత్వం కూడా భావించి రాష్ట్ర ఇంజినీర్లను ముందుకు సాగనివ్వలేదు. తెలంగాణ బిడ్డగా శ్రీరాం ఈ విషం చిమ్మే కార్యక్రమాన్ని చేపట్టే బదులు తన పరపతిని ఉపయోగించి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారితో రక్షణ చర్యలకు సంబంధించి నివేదికను త్వరగా రూపొందించి ఉంటే రాష్ర్టానికి మేలు జరిగేది.
ఇసుక పునాదులపై కట్టిన నిర్మాణాల్లో లీకేజీలు సహజమే: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. మూడు బ్యారేజీలను ఒకే విధమైన సాంకేతికతతో నిర్మించారు కాబట్టి మేడిగడ్డకు ఏర్పడిన సమస్యలన్నీ అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా తప్పవని శ్రీరాం అభిప్రాయం. మేడిగడ్డ లాగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా కుంగిపోయి, కూలిపోవాలన్నది కేంద్ర, రాష్ట్ర పాలకుల దుర్మార్గపు ఆలోచన. కానీ, అది ఎన్నటికీ నెరవేరదు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎటువంటి నిర్మాణపరమైన సంక్షోభం (Structural Distress) లేదనేది ప్రాజెక్టు ఇంజినీర్లకు తెలుసు. ఆ రెండు బ్యారేజీల్లో ఏర్పడిన నీటి లీకేజీలను ఎప్పటికప్పుడు కెమికల్ గ్రౌటింగ్ ద్వారా అరికడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు బ్యారేజీల్లో ఏ లీకేజీలు లేవు. అవి పత్రికల్లో, మీడియాలో ప్రచారం అయినట్టు బుంగలు కావు, చిన్నపాటి నీటి లీకేజీలు. ఇసుక పునాదిలో (Permeable Foundations) ఇటువంటి నీటి లీకేజీలు ఏర్పడడం సహజమే. ప్రాజెక్టు ఇంజినీర్లు ఏటా తనిఖీలు చేసి లీకేజీలు ఉంటే అరికట్టే చర్యలు తీసుకుంటారు. అందుకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సురక్షితంగా ఉన్నాయి.
ఇకపోతే మేడిగడ్డ బ్యారేజీ పై రెండింటితో పోలిస్తే భిన్నమైనది. మార్చి వరకు నదిలో ప్రవాహాలు ఉంటాయి. 2020, 2021లో కరోనా మహమ్మారి కారణంగా ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీ ఇంజినీర్లు ఎవరూ మేడిగడ్డ పోవడానికి వీలులేని ఒక భయంకరమైన పరిస్థితి. ఈ స్థితిలో రెండు వానకాలాలు లీకేజీలను బుంగలుగా మార్చాయి.
2022లో సంభవించిన వరద గోదావరి చరిత్రలోనే అతి పెద్దది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 28 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద ప్రవాహం నమోదైంది. బ్యారేజీ కింద సిమెంట్ బ్లాకులు అక్కడక్కడ లేచిపోయి ఉన్నందున చిన్న లీకేజీలు బుంగలుగా మారి, రాఫ్ట్ కింద సొరంగం ఏర్పడడానికి దోహదం చేసింది. బ్లాక్ 7లో రాఫ్ట్ కింద ఏర్పడిన ఈ సొరంగం 2023లో సంభవించిన భారీ వరదల అనంతరం అక్టోబర్ చివరి వారంలో మూడు పిల్లర్ల కుంగుబాటుకు కారణమయ్యిందని తెలుస్తూనే ఉన్నది.
అక్టోబర్ నెలలో గోదావరిలో ప్రవాహాలు అధికంగా ఉన్నందు వల్ల ఈ బుంగలను అన్నారం, సుందిళ్లలోగమనించినట్టు ఇక్కడ సాధ్యం కాలేదు. 20 వేలకు పైగా ఇసుక సంచులను అది మింగేయడమే సొరంగం ఏర్పడిందన్న దానికి రుజువు. భూభౌతిక పరీక్షల ద్వారా నిర్ధారణ కాకుండానే లోపాలు ఉన్నాయని ఆపాదించడం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి, వారికి వత్తాసు పలికే శ్రీరాం లాంటి వారికి సమంజసం కాదు.
తెలంగాణ పౌర సమాజంపై కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ బాధ్యత: ఏదేమైనా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు ఒక దురదృష్టకరమైన సంఘటన. రాజకీయాలను పక్కనపెట్టి బ్యారేజీని పునరుద్ధరించి, మళ్లీ వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాదు, తెలంగాణ పౌర సమాజంపై కూడా ఉన్నది. వెదిరె, రఘు లాంటి మేధావులు విషం చిమ్మడం మాని ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే సమాజానికి మేలు చేసిన వారవుతారు.
(వ్యాసకర్త: తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్)
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

