New Parliament House | భారతదేశ పాత పార్లమెంటు భవనంలో రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకొన్న కొన్ని చట్టాలు ప్రజల ఆశల్ని కొంతమేర తీర్చగలిగాయి. ఇవాళ నూతన పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. ఈ భవనంలో జరిగే చర్చలు, చట్టాలు ప్రజల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంతరాలను తొలగించాలని ఆశిద్దాం. కేంద్ర పాలకులు అభివృద్ధే లక్ష్యంగా, సమాఖ్య స్ఫూర్తితో పని చేస్తారని ఆకాంక్షిద్దాం.
సుమారు 75 సంవత్సరాలుగా పాత పార్లమెంటులో రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు కొన్ని ఉపయోగకరమైన చట్టాలు రూపుదిద్దుకుని వారి ఆశలు కొన్ని నెరవేరినాయి.బ్యాంకులు జాతీయం చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థిక పరిస్థితి ఈరోజు కొంతమేరకు అభివృద్ధి వైపు సాగుతోంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆహార భద్రత చట్టం, గృహహింస నిరోధక చట్టం, నిర్భయ చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అనేక చట్టాలు తయారు చేసి, భారత ప్రజలకు భరోసా కల్పించింది పాత భవనంలోనే. 370 ఆర్టికల్ రద్దు చేసి కొంతమంది హక్కులు అణచివేసే చట్టం చేసింది ఈ భవనంలోనే. నల్ల వ్యవసాయ చట్టాలు తయారు చేసి, తరువాత అభాసు పాలయ్యారు. జీఎస్టీ వంటి కొన్ని చట్టాల్లో ధనికులు, పేదలను ఒకే గాటిన కట్టిన ఉదంతాలు ఈ భవనంలోనే జరిగాయి.
ఇక నూతన పార్లమెంటులో సమావేశాలు ప్రారంభమైన వేళ, దేశంలో నేటికీ ఉన్న అనేక ఆర్థిక, సామాజిక అంతరాలు తొలగించే చట్టాలు తయారు కావాలని ఆశిద్దాం. అయితే, కేంద్రం ఎంపీలు, మంత్రులందరికీ పూర్తి ఎజెండా తెలియపరచకుండా కొత్త భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభించటం దేనికి సంకేతం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సబబా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మన పాలకులు చెప్తున్న తరుణంలో ఆచరణలో మాత్రం నిరంకుశ పద్ధతిలో పాలన సాగిస్తున్నారు. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం తయారు చేసిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడం శుభపరిణామం అయినా ఆచరణలో వచ్చే వరకూ ఏమీ చెప్పలేం. పేర్ల్ల మార్పు ద్వారా అభివృద్ధి సాధ్యం కాదని గ్రహించాలి.
ప్రస్తుతం కావాల్సింది భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే చట్టాలు. దేశంలో అట్టడుగు వర్గాల పజలకు, మైనారిటీలు, గిరిజనులు, మహిళలు, బాలికలకు రక్షణ, భద్రత కల్పించే చట్టాలు తయారు కావాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేసే చట్టాలు, రైతులు, వివిధ రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికుల భద్రతకు సంబంధించిన చట్టాలను తయారు చేయాలి. అంతేకాని గతంలో ఉన్న లేబర్ చట్టాలను కుదించి, లేబర్ కోడ్స్ తయారు చేసి, కార్మికుల గొంతు నొక్కే చట్టాలు తయారు కాకూడదు. ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, దేశంలోని వివిధ వార్తా పతికలు, సామాజిక మాధ్యమాలకు భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, భావప్రకటనా స్వేచ్ఛలను హరించే చట్టాలు చేయకూడదని ఆశిద్దాం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో, పత్రికాస్వేచ్ఛ, ఇంటర్నెట్ షట్డౌన్ వంటి సూచికల్లో భారత్ అధోగతిలో ఉందని ప్రపంచ సూచికలు తెలుపుతున్నాయి.
నేటి కేంద్ర పాలకులు రకరకాల కుయుక్తులు పన్ని అనేక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలను పడగొట్టిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యానికి ఇది చేటు కలిగిస్తుంది. అధికారమే లక్ష్యంగా పనిచేయకుండా, అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి. అన్ని రాష్ర్టాలను సమభావంతో చూడాలి. అసలు మనదేశం మౌలిక స్వరూపం ఫెడరలిజం. ఈ విషయాన్ని కేంద్ర పాలకులు మరువరాదు. అదేవిధంగా రాజ్యాంగ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈ.సీ, కొలీజియం, ఈడీ, ఇన్కంటాక్స్, సీబీఐ వంటి కేంద్ర సంస్థలను తమ ఆధీనంలో ఉంచుకునే చట్టాలు ఈ నూతన పార్లమెంటులో ప్రవేశపెట్టరని ఆశిద్దాం. అంకెల ఆధారంగా దేశం అభివృద్ధి చెందుతున్నదని సంతృప్తి చెందకుండా, నేటికీ 40 కోట్ల మందికి మూడు పూటలా తిండి లేదు అనే వాస్తవాన్ని గ్రహించి పేదరిక నిర్మూలనకు చట్టాలు చేయాలి. దానికి అవసరమైన ఆదాయం ధనికులు, బడా పారిశ్రామికవేత్తల నుంచి వసూలు చేయాలి. నల్లధనాన్ని వెలికితీసే చట్టాలు తయారు చేయాలి. అంతేకాని, బడా పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ అని, మాఫీలు అని, సబ్సిడీలు, రాయితీలు, ప్రోత్సాహకాలు పేరుతో సామాన్య ప్రజల ధనాన్ని అనుచితంగా కట్టబెట్టే చట్టాలు తయారు కాకుండా ఈ నూతన పార్లమెంటు ఉండాలని కోరుకుందాం.
ఈ నూతన పార్లమెంటులో భవిష్యత్తులో అనేకమంది నూతన యువ ప్రజాపతినిధులు రావాలని, వారి ద్వారా దేశ ప్రజల కనీస అవసరాలు తీరే చట్టాలు వస్తాయని ఆశిద్దాం. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం, యువత ఉపాధి అవకాశాలు కోసం చట్టాలు రావాలని ఆశిద్దాం. తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది అని భావిద్ధాం. విద్యా, వైద్య రంగాలకు పాధాన్యత ఇచ్చే చట్టాలు తయారు కావాలి. విద్వేష ప్రసంగాలకు, మతతత్వ ప్రసంగాలకు ఈ నూతన పార్లమెంటు చెక్ పెట్టాలని భావిద్దాం. ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకుని అధికార పక్షం మంచి చట్టాలు తయారు చేయాలి. సర్వేజనా స్సుఖినోభవంతు అనే ఆర్యోక్తి చెప్పడమే కాకుండా, ఈ నూతన పార్లమెంటు సాక్షిగా అమలు చేయాలని కోరుకుందాం.
-ఐ.ప్రసాదరావు
63056 82733