ఉమ్మడి ఏపీ చివరి రోజు వరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ రూ.1.61 లక్షల కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు అప్పుడు ఇచ్చిన పింఛన్ రూ.200. పారిశుధ్య కార్మికులు మొదలు ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరికీ చాలీచాలని జీతాలే. వ్యవసాయరంగం కునారిల్లింది. రైతులు అప్పుల ఊబిలోకి నెట్టబడ్డారు. ఆ భారం మోయలేక నిత్యం అన్నదాతల ఆత్మహత్యల ఘోష వినిపించేది. దేశంలోనే అత్యధిక రైతుల ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. ఉచిత విద్యుత్తు అమలుచేసినా.. అర్ధరాత్రి కరెంటుతో రైతుల ప్రాణాలు పోయేవి. ఇక రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కనీసం కలలో కూడా ఊహించలేనివి.
సరిగ్గా పదేండ్ల తర్వాత.. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం కోసం ఇస్తున్న హామీలను ఒకసారి పరిశీలిద్దాం. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ తెలంగాణకు వచ్చి తుక్కుగూడలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఓసారి పరికించి చూద్దాం. కాంగ్రెస్ ఇప్పటికే రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, పింఛన్ల పెంపు ప్రకటించింది. వీటికితోడు తుక్కుగూడ సభలో ఆరు గ్యారెంటీలంటూ హడావుడి చేసింది. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ యూత్ డిక్లరేషన్‌లో పేర్కొన్నది. దీని అమలుకు కనీసం ఏటా రూ.6 వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా.
ఇక.. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతుబంధును రైతు భరోసాగా పేరుమార్చి ఎకరాకు ఏటా రూ.15 వేలు, కౌలు రైతులకూ వర్తింపజేయడం, మద్దతు ధరలు పెంచడం.. ఇలా అనేక హామీలిచ్చింది. ఇందుకోసం కనీసం రూ.70 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మరో రూ.28 వేల కోట్లు, పింఛన్లను పెంచితే రూ.40 వేల కోట్ల దాకా వ్యయం అవుతుందని, ఇక తుక్కుగూడ సభలో ఇచ్చిన హామీలు కూడా కలిపితే.. కాంగ్రెస్ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఏటా రూ.2.90 లక్షల కోట్ల వరకు బడ్జెట్ కావాలన్నది నిపుణుల మాట. రాష్ట్ర బడ్జెట్టే రూ.2.70 లక్షల కోట్లు అయినప్పుడు.. అదనంగా రూ.20 వేల కోట్ల హామీలు ఎలా ఇచ్చింది. పోనీ.. ఈ హామీలన్నింటినీ తమ పార్టీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపిస్తున్నదా? అంటే అదీ లేదు. మరి తెలంగాణ ప్రజలకే ఇన్ని హామీలు ఇచ్చే ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది?
ఇక బీజేపీ సంగతి చూద్దాం.. 1980వ దశకంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించింది ఒకటి, రెండు శాతం ఓట్లు మాత్రమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి బీజేపీ అంటే.. హైదరాబాద్‌లోని ఒకటి, రెండు నియోజకవర్గాలకే పరిమితమైన పార్టీ. కానీ.. కొన్నేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ పెద్దలు తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. తెలంగాణను ఎలాగైనా చేజిక్కించుకోవాలని కంకణం కట్టుకున్నారు. నేరుగా ప్రజల్లోకి వెళ్తే ఫలితం లేదని వాళ్లకు తెలుసు. అందుకే కుట్రలు, కుతంత్రాలకు వెనుకాడటం లేదు. తెలంగాణను బీజేపీ ఎందుకు టార్గెట్ చేసినట్టు? ప్రజాదరణ లేదని సొంత నివేదికలే చెప్తున్నా ఎందుకు పోరాడుతున్నట్టు? ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. ఇలా బీజేపీలోని బడా నేతలంతా తెలంగాణకు టూరిస్టులుగా ఎందుకు మారినట్టు? ‘మాకెన్ని సీట్లు వచ్చినా అధికారం మాదే’ అని బీజేపీ నేతలు బహిరంగ సభల్లో వ్యాఖ్యానించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినట్టు?
వీటన్నింటికీ ఒకే ఒక సమాధానం. తెలంగాణలో తులతూగుతున్న సంపద. దాన్ని చూసి రెండు పార్టీలకు ఆ ధైర్యం వస్తున్నది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో, బీఆర్ఎస్ సమర్థమైన దశాబ్ద పాలనలో తెలంగాణ సాధించిన, సాధిస్తున్న, సాధించబోతున్న ప్రగతి, తద్వారా తెలంగాణలో సృష్టించబడే మరింత సంపద వారి కండ్లల్లో మెరుస్తున్నది. 2014-15లో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ విలువ రూ.లక్ష కోట్లు మాత్రమే. తొమ్మిదేండ్ల తర్వాత మన బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లు. అనతి కాలంలోనే అద్భుతంగా పెరిగిన ఈ సంపదే కాంగ్రెస్ పార్టీకి అలవిగాని హామీలు ఇచ్చే ధైర్యాన్నిచ్చింది. ఈ తొమ్మిదేండ్లలో వినూత్న పథకాలు, కార్యక్రమాలతో అభివృద్ధి పరుగులు పెట్టించి, ఒక రాష్ట్రంలో సంపదను ఎలా పెంచాలో కేసీఆర్ నేర్పించారు. ఆ సంపదను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచి, వారి జీవన విధానాన్ని ఎలా మార్చవచ్చో నిరూపించారు. ఫలితంగా 2014-15లో రూ.1.24 లక్షలుగా ఉన్న తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం నేడు రూ.3.17 లక్షలకు పెరిగింది.
ఈ ప్రగతి ఇక్కడితో ఆగేది కాదని, మరింత సంపద తెలంగాణలో పోగవుతుందని కాంగ్రెస్‌కు, బీజేపీకి తెలుసు. అందుకే తేనెతుట్టెపై ఆశపడ్డట్టు తెలంగాణపై ఆ రెండు పార్టీల కన్నుపడింది. పదేండ్ల కిందట జాతీయ ర్యాకింగ్స్లో అన్ని విభాగాల్లో చివరి వరుసలో ఉన్న తెలంగాణ.. నేడు అగ్రస్థానంలో నిలిచింది. మిగులు రాష్ట్రంగా వచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిగా మార్చారని రెండు పార్టీల నేతలు పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తెచ్చిన ప్రతి రూపాయిని తెలంగాణ ప్రగతికే వినియోగించి.. రూపాయికి రెండు రూపాయల ఫలితం చూపించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా ప్రతిపక్షాలు ఈ ప్రచారం మాత్రం ఆపడం లేదు. కానీ.. ఎన్నికల సమయానికి వచ్చేనాటికి మాత్రం వారు ఇన్నాళ్లుగా ప్రచారం చేసిన ‘అప్పుల కుప్ప’కు యజమానులయ్యేందుకు ఆరాటపడుతున్నారు.ఎందుకంటే తెలంగాణ ‘అప్పుల ముల్లె’ కాదు,‘సిరిసంపదల మూట’ అని వాళ్లకు తెలుసు.
-కాసాని మహేందర్ రెడ్డి
94923 06808