HYDRAA | ‘హైడ్రా’.. ఈ పేరు వింటేనే రాష్ట్ర ప్రజలు హడలెత్తుతున్నారు, హై రానా పడుతున్నారు. వాస్తవానికి ‘హైడ్రా’ అం టే విపత్తు నివారణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటుచేసిన ఒక నోడల్ ఏజెన్సీ. కానీ, ఈ హైడ్రా తన పరిధిని మరిచి, హద్దు మీరి ప్రవ ర్తిస్తున్నది. చట్టానికి, రాజ్యాంగానికి, న్యాయసూత్రాలకు అతీతంగా వ్యవహరిస్తూ, ఏ కోర్టు తీర్పు లు తనకు వర్తించవన్నట్టుగా దుందుడుకు స్వభా వంతో వ్యవహరిస్తున్నది.
ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కావడాన్ని, చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలను ఎవ రూ సమర్థించరు. అక్రమ నిర్మాణాలుంటే వాటిని తొలగించడాన్ని కూడా ఎవరూ వ్యతిరేకించరు. కానీ, ఎదుటివారికి వారి వాదన చెప్పుకొనే అవకాశం ఇవ్వాలన్నది మౌలిక న్యాయసూత్రం.
ఈ సూత్రానికి విరుద్ధంగా, చట్టపరంగా చేపట్టవలసిన కనీస చర్యలు తీసుకోకుండా ఆక్రమణల పేరిట ఇండ్లు కూల్చివేయడాన్ని ఖండించవలసిన అవస రం ఉన్నది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విష యం ఏమంటే.. ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్న భూములు ప్రభుత్వానికి కావు. అవన్నీ పట్టా భూములే. ఏక్ఫసులా భూములు. అంటే, వేసవి కాలంలో, చెరువు నీళ్లు తగ్గినప్పుడు ఒక పంట మాత్రమే పండించుకునే భూములు. ఈ భూములను అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. పట్టాదారు చనిపోతే వారసులు విరాసత్ కూడా చేసుకోవచ్చు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ భూముల్లో నిర్మాణాలు చేయవద్దనే విషయం యజమానులకే కాదు, చాలామంది అధికారులకు కూడా తెలువదు. అందుకే వాటిలో నిర్మాణాలు జరిగా యి. అదెవరి తప్పు?
పలానా భూమి ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నదా అని నిర్ధారించే బాధ్యత నీటిపారుదల, రెవెన్యూ అధికారులది. అట్లా నిర్ధారించిన భూముల్లో నిర్మాణాలు జరగకుండా, అనుమతులు ఇవ్వకుండా చూడవలసిన బాధ్యత పంచాయతీ, మున్సిపల్ శాఖ అధికారులది. వ్యవసాయేతర, కమర్షియల్ ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకోవలసిన బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖ అధికారులది.
కానీ, ఆయా శాఖల అధికారులు ఎవరి విధు లు వారు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల, ఒకవేళ నిర్వహించినా నిబంధనలను అతిక్రమించడం వల్ల ఈ నిర్మాణాలు జరిగాయి. అధికారులే గనుక అనుమతులు ఇవ్వకుంటే అక్కడ నిర్మాణాలు జరిగేవా? అధికారులు సక్రమైనవేనని ముద్రవేస్తేనే కదా సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడవెట్టి మరీ ఆ భూములను కొనుగోలు చేసింది? ఇండ్లు నిర్మించుకున్నది?
లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ నిర్మాణాలను కూల్చేయండని హైడ్రా అధికారులను ఉసిగొల్పడం సబబేనా? తప్పు ఎవరు చేశారు, ప్రభుత్వం శిక్ష ఎవరికి వేస్తున్నదో ఒక్కసారి అవలోకనం చేసుకోవాలి. సొం తింటి కలను సాకారం చేసుకునేందుకు గాను తమ జీవితకాలం కష్టం చేసుకొని సంపాదించుకున్న సొమ్మును పోసి, అప్పులు చేసి ఇల్లు కొన్నవారిదా తప్పు? అనుమతులు ఇచ్చిన అధికారులదా? హైడ్రా అధికారులు అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో అన్నట్టుగా వ్యవహరిస్తున్నా రు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇండ్లు నిర్మించుకున్న పెద్దలకు, ముఖ్యమంత్రి సోదరుడి ఇంటికి నోటీసులు ఇచ్చి, స్టే తెచ్చుకునే అవకాశం కల్పించిన అధికారులు పేద ప్రజలకు మాత్రం కనీసం హెచ్చరికలు కూడా చేయకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. పేద ప్రజలను ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీచేసి వేరే చోటికి వెళ్లండి అంటే వారెక్కడికి వెళ్తారు? కాబట్టి ప్రభుత్వం చెరువుల రక్షణ కోసం పేదలను అక్కడినుంచి తరలించివలసి వస్తే ముందుగా వారితో చర్చలు జరపాలి. వారికి తగిన సమయం ఇవ్వాలి. నిర్వాసితులకు తగిన పునరావాసం, నష్టపరిహారం చెల్లించాలి. అంతే కానీ, ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే ఈ ప్రభు త్వం ప్రజా తిరుగుబాటును చవిచూడటమే కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది.
-మహ్మద్ జమీలొద్దీన్ అహ్మద్
86862 11556