Smartphone | భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే.. ‘స్వామి! రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయే వరం ప్రసాదించండి’ అని అడిగాడు భక్తుడు. ‘దానికి దేవుని వరాలు పనిచేయవు నాయనా! తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా తుంచగలవా? ఒంటి మీదున్న బట్టలను పీలికలుగా చించగలవా? పాట అర్థం కాకున్నా, సంగీతంతో పనిలేకున్నా డ్యాన్సులు దరువేసి దంచగలవా? ఎవరికీ అర్థంకాని భాషల్లో మాట్లాడగలవా? బూతుసాహిత్యం, బూమరాంగ్ డైలాగులు తడబడకుండా చెప్పగలవా? ప్రాణాల మీదికితెచ్చే సాహసాలు చేయగలవా? ఇవన్నీ అందుకు కావలసిన టాలెంట్.
ఇక నీ అర్హత అంటావా! చదువు రాకున్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది’ అని సెలవిచ్చాడు భగవంతుడు!
‘ముందుగా నన్ను స్వామి అని పిలవడం మానేసి సామీ! అని పిలువు. ఇక్కడి నుంచే ప్రారంభించు’ అంటూ మాయమయ్యాడు సదరు సామీ. అంతే, స్వామిని చూసిన సంతోషంలో ఆ మనిషిలోంచి మనిషి మాయమయ్యాడు. శరీరం ఏదో అద్వితీయ శక్తితో, సంతోషంతో మెలికలు తిరుగుతుంటే మనసు మొత్తం స్మార్ట్‌ఫోన్‌లో దూరి కమిట్మెంట్ లేని కంటెంట్ల కోసం సెర్చ్ చేస్తోంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన మొదట్లో మనకు తెలియని విషయాలను గూగుల్ చెవిన వేసి సమాధానాలు రాబట్టుకొని తెలుసుకున్నాం. గూగుల్‌లో శోధన ఎక్కువయ్యాక కమర్షియల్ ఎలిమెంట్లతో విశృంఖలత్వం ఎక్కువైంది. ఈ క్రమంలో అందర్నీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది సోషల్ మీడియా.
యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర యాప్‌ల వేదికగా రీల్స్ జనాదరణ పొందుతున్నాయి. వీటిని మెట్లుగా మలుచుకొని పైకి ఎదగాలనుకున్నవాళ్లు తమ టాలెంట్‌ను రకరకాల రీల్స్ రూపంలో ప్రదర్శిస్తూ పాపులర్ అయి డబ్బు, పేరు సంపాదించుకుంటున్నారు. డబ్బు సంపాదన కంటే తమ రీల్స్‌కు మిలియన్ల లైకులు, షేర్స్, సబ్‌స్ర్కైబర్లు పెరిగి రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోవాలన్నదే చాలామంది యావ. ఈ దుగ్ధతో మహిళలు కూడా సభ్య సమాజం తలదించుకునే వేషభాషలతో అసభ్యకర వీడియోలు చేస్తున్నారు. చేసేవాళ్లు వారి స్వలాభం కోసం రీల్స్ చేస్తుంటే, చూసేవాళ్లు మాత్రం నిద్రాహారాలు మానేసి, విలువైన సమయాన్ని వృథా చేస్తూ ‘రీలో రీలో రేలారే’ అంటున్నారు.
ఈ రీల్స్ కారణంగా భారతీయత ఉనికి కోల్పోతున్నది. సంప్రదాయం మంటగలిసిపోయి, నాగరికత రూపు మార్చుకొని రచ్చకెక్కుతోంది. లైకుల కోసం చాలామంది రోడ్లపై, నీళ్లలో, రైళ్లలో సాహసాలు చేస్తున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తమ పిల్లల టాలెంట్‌ను ప్రోత్సహించాలని తల్లిదండ్రులు కూడా చూసీచూడనట్టుగా వదిలేస్తుండటంతో గుర్తింపు పొందాలనే తాపత్రయంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఒక బాలుడు ఉరి వేసుకుంటున్నట్టుగా రీల్ చేయబోయి నిజంగా ఉరి పడి ప్రాణాలొదిలిన ఘటనే అందుకు నిదర్శనం. లక్నోలో వాటర్ టాంక్‌లో రీల్ చేస్తూ ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. బిల్డింగ్‌పై నుంచి దూకడం, బైక్‌లపై ఫీట్లు, చెట్ల కొమ్మల చివరన నిలబడటం, పాము నోట్లో చెయ్యి పెట్టడం లాంటి సాహసాలు రీల్స్ రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ రీల్స్ మోజులో పడి ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడే బాధ్యతను మానవ సమాజం విస్మరిస్తుండటం బాధాకరం. బాధితుల ఆర్తనాదాలను పట్టించుకోకుండా రీల్స్ చేస్తూ పోస్టు చేస్తుండటం మానవత్వానికి మాయని మచ్చ. ఎదుటివాళ్ల కష్టాలు, నష్టాల నుంచి కూడా ప్రయోజనం పొందాలనుకోవడం దారు ణం. సరదాగాకో, ఆటవిడుపు కోసమో రీల్స్ చేయ డం తప్పు కాదు. కానీ, అదే వ్యసనంగా మారి జీవితాలను బలి తీసుకునేంత వరకు వెళ్లడం సరికాదు.
రీల్స్ చేసేవారే కాదు, చూసేవారు పరోక్షంగా ఇబ్బందుల పాలవుతున్నారు. నిత్యం రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసేవారు మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. దేశంలోని సగం జనాభా రోజూ రెండు గంటలకు పైగా సోషల్ మీడియాలో గడుపుతున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం జరుగుతుండటం శోచనీయం. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, నాయకులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు బాధితులుగా మారుతున్నారు. వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బతుకుపై విరక్తి కలిగి ఆత్మహత్యల వరకు వెళ్లేలా చేయడం క్షమించరాని నేరం.
కత్తికి రెండువైపులా పదునున్నట్టు.. సోషల్ మీడియా వల్ల లాభనష్టాలు ఉన్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తమ కలలను సాకారం చేసుకొని ఎదిగినవారెందరో ఉన్నారు. అదే సమయంలో వ్యస నంగా మారి ప్రాణాల మీదికి తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగించుకొని ఎదగాలో, చెడుమార్గంలో వినియోగించి కేసుల పాలై జీవితాన్ని అంధకారం చేసుకోవాలో తేల్చుకోవాల్సింది మనమే.
-జోస్యుల వేణుగోపాల్
94404 36806