లెబనాన్‌లో జరిగిన పేజర్ల వరుస పేలుళ్లు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచాయి. అరచేతిలో ఇమిడే సమాచార పరికరాలు పేలడంతో వేల సంఖ్యలో జనం గాయపడటమే కాకుండా, 10 మందికి పైగా మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ దాడులకు గురైనవారు సామాన్య పౌరులు కారు. వారంతా సాయుధ మిలిటెంట్ దళం హెజ్బొల్లాకు చెందినవారు కావడం గమనార్హం. ఏక కాలంలో వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్ల దృశ్యాలు టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ప్రధానంగా హెజ్బొల్లాకు గట్టి పట్టున్న దక్షిణ లెబనాన్‌లో ఈ పేలుళ్లు సంభవించాయి. లెబనాన్ ప్రభుత్వాధినేతలు ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. అయితే, ఇజ్రాయెల్ సైన్యం ఈ ఆరోపణను ఖండించింది. అయితే, దీన్ని పెద్దగా ఎవరూ విశ్వసించడం లేదు. తైవాన్ నుంచి రవాణా అవుతున్న పేజర్లను దారి మళ్లించి వాటిలో పేలుడు పదార్థాలను, సూక్ష్మ డిటోనేటర్లను అమర్చారని వెలువడుతున్న వార్తలు విస్మయం కలిగిస్తున్నాయి.
ఇరాన్ వత్తాసుతో ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్న హెజ్బొల్లాకు ఈ పేలుళ్లు గట్టి ఎదురుదెబ్బ అనే మాట ఈ సందర్భంగా వినవస్తున్నది. ఎప్పుడో 1990లలో కొన్నాళ్లపాటు ఓ వెలుగు వెలిగి, సెల్ఫోన్ల రాకతో అంతర్థానమైపోయిన పేజర్లను లెబనాన్ మిలిటెంట్లు ఇప్పటికీ ఉపయోగిస్తుండటం, వాటిద్వారానే పేలుళ్లు జరగడం విస్మయం కలిగిస్తున్నది. తనిఖీల్లో, నిఘాలలో పట్టుబడకపోవడం వల్లనే మిలిటెంట్లు వీటిని ఉపయోగిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే పేజర్లను పెద్ద సంఖ్యలో ఉపయోగించి పేలుళ్లు జరిపిన ఉదంతం ఏదీ ఇదివరకు నమోదు కాలేదు. గతంలో 1971 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో తమ క్రీడాకారులను చంపిన ఉగ్రవాదులను వేటాడటానికి ఇజ్రాయెల్ ల్యాండ్‌లైన్ టెలిఫోన్లను వాడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా ఘర్షణల్లో సాంకేతికత రోజుకో రకంగా పరిణమించడం చూస్తుంటే చివరికి దేనికి దారితీస్తుందోననే అనుమానం కలుగక మానదు.
పశ్చిమాసియా సంక్షోభంలో భాగమైన గాజా యుద్ధం ఓ వైపు ఎడతెరిపి లేకుండా సాగుతున్నది. ఇప్పటికే భారీసంఖ్యలో పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే కావడం అత్యంత విషాదకరం. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతున్నదని దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసువేసింది. ఈ పరిస్థితిపై అమెరికాలోనూ ఇటీవల యుద్ధ వ్యతిరేక నిరసనలు భగ్గుమనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అగ్రరాజ్యం మధ్యవర్తిత్వ పాత్రకు సిద్ధపడి పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ, ఆ ప్రయత్నాలు ముందుకువెళ్తున్న సూచనలు కనిపించడం లేదు. పైగా ఘర్షణలు సరికొత్త మలుపులు తిరుగుతుండటం ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్నది.