ఒక జాతి నిర్మాణం దాని చరిత్ర ఆధారంగానే జరుగుతుంది. అభివృద్ధి ఎన్ని పుంతలు తొక్కినా… ఏ గగనానికి చేరినా… నేలపైనే కాళ్లుంటాయి. ఘన చరిత్ర వారసత్వమే, సాంస్కృతిక జీవన కొనసాగింపే ఆ నేలతో మనకున్న అనుబంధం. అందుకే ప్రతీ ప్రాంతం తనదైన అస్తిత్వంతో అలరారుతుంది. ఆ ప్రాంత వాసి గర్వంగా ‘నేను ఇది, ఇక్కడివాడినే’ అని ప్రకటిస్తాడు. ఇది వెనుకబడ్డదనే ఆఫ్రికా ఖండానికైనా… ప్రపంచాధిపత్యం తమదే అనుకుంటున్న అమెరికా సంయుక్త రాష్ర్టాలకైనా… ఈ సాంస్కృతిక, చారిత్రక జీవన వాస్తవం విషయంలో మాత్రం ఎవరు ఎక్కువా కాదు, ఎవరు తక్కువా కాదనే స్పృహ ఉంటూనే ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన అంశంలో మన దగ్గర ఏమిటీ భిన్న వాదనలు?
ఒకరేమో విమోచనం అంటారు… మరొకరు కాదు కాదు విలీనం అంటారు… ఇంకొందరు విద్రోహమని అంటారు. ఇక తాజాగా స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత సైతం ఇందులో ఏదో తేల్చాల్సిన సొంత ప్రభుత్వాలు కూడా జాతీయ సమైక్యత అని ఒకరంటే… లేదు లేదు ప్రజా పాలన దినమని మరొకరంటున్నారు. శాతవాహన, కాకతీయుల ఘన వారసత్వానికి, అరవై ఏండ్ల పాటు అలుపెరగకుండా పోరాడి సాధించిన ఉద్యమ తెగువకు ఎందుకీ దుస్థితి? ఎవరు దీనికి కారకులు? రాజకీయాల సొంత ఎజెండాల అమలు కోసం ఏకంగా ఒక ప్రాంతంలో జరిగిన మహోద్యమ ఘటనలకు, చేసిన సాహసోపేత పోరాటాలకు, ఒరిగిన వేనవేల కంఠాలకు ఇన్ని వక్రభాష్యాలు బహుశా ప్రపంచ చరిత్రలో మరే ప్రాంతానికీ లేవేమో!
తెలంగాణ అంటేనే తెగువ, తెలంగాణ అంటేనే పాయిరం, తెలంగాణ అంటేనే సాంస్కృతిక తేజో జీవనం. ప్రపంచంలో అతికొద్ది తెగలకు, ప్రజలకు మాత్రమే దక్కిన ఎన్నో ఘనమైన వారసత్వ అంశాలు మనకే ఉన్నాయి. ప్రత్యేకమైన నుడికారంతో కూడిన భాష మొదలు తుంగభద్ర, గోదావరి, కృష్ణమ్మల మధ్య త్రిలింగ దేశంగా తెలుగుకు ప్రాచీన హోదాను అందించిన శాసనాలు దొరికిన నేల ఇది. పురాతన రాతియుగపు ఆనవాళ్లతో కూడిన పనిముట్లు దొరికి మన ప్రాంతంలో లక్షల ఏళ్లకు పూర్వమే నాగరికత పురుడుపోసుకుందని ప్రపంచానికి చాటిన ఘనమైన నేల ఇది. మెసొటోమియా మొదలు హరప్పా, మొహెంజోదారో నాగరికతలకు ఏ మాత్రం తీసిపోనిదని, బౌద్ధ, జైన మతాలకు మరో పుట్టినిల్లుగా అలరారిందని ఎన్నో చారిత్రక సత్యాలు ఇక్కడ కనిపించాయి.
ప్రకృతి మాత పరవళ్లు పోయిందా అన్నట్టుగా ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఇక్కడ విరాజిల్లుతున్నాయి. ప్రపంచ ఆదివాసీ కుంభమేళా సమ్మక్క, సారక్క జాతర మహోన్నత సాంస్కృతిక వైభవమైతే… తరగని బొగ్గుతో దేశ, రాష్ర్టాలను సుసంపన్నం చేస్తున్న సింగరేణి బంగారమై వెలుగుతుంటే… ఇంకా అనేక ప్రాంతాల్లో ఎన్నో సహజ సంపదలను తన గర్భాన దాచుకున్న ఈ తెలంగాణ మాత దేశ, రాష్ట్ర వైభవాలకు వాటిని అందిస్తూనే ఉంది. ఇలా ఒక దేశానికి కావాల్సిన అర్హతలతో కూడిన ఘన వారసత్వం పుణికిపుచ్చుకొన్న తెలంగాణ.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సైతం ఏడాదికి పైగా పీడనలోనే మగ్గిపోయింది. ఆ సమయంలో నిజాం రాజు ఏకంగా దేశ హోదా కోసం చేసిన ప్రయత్నాలు చరిత్రలో గోచరిస్తాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే.. 1948 సెప్టెంబర్‌కు అటుఇటుగా ఇక్కడ సాగిన పోరాటం, సాయుధమై రైతాంగంతో మొదలై యావత్ జాతిని ఏకం చేసి స్వాతంత్య్రం కోసం ఉద్యమించేలా చేసిందనేది నిజం. పండిత, పామర తేడా లేకుండా దొరలు, జాగీర్దార్లు, జమీందార్లు మొదలు నిజాం ప్రభువు వరకూ ఆ ధిక్కార నాదం గర్జించింది. ఆ మహోద్యమాన్ని అణచివేయడానికి ప్రపంచంలో ఎక్కడా వాడని సామ, దాన, భేద, దండోపాయాలను ఇక్కడ వాడారు. ప్రజలను, పోరాటకారులను అత్యంత క్రూరంగా హింసించి, అమెరికా నల్లబానిసల కన్నా హీనంగా చూసిన రోజులున్నాయనేది చరిత్ర చెప్తున్నది. ఎక్కడ పీడన తాండవం చేస్తుందో… అక్కడ ఉద్యమం ఉరకలెత్తుతుంది, ఎక్కడ అణచివేత అట్టహాసం చేస్తుందో… అక్కడ ఆక్రందనలు గర్జనలవుతాయి.
గద్దెలను కూల్చి సామాన్యుడు తన కోసం తనే రాసుకునే రాజ్యాంగాలను నిర్మిస్తాయి. ఇక్కడా అదే జరిగింది, అదే జరుగుతుంది. ఎందుకంటే… ప్రాంతాలు వేరు కావచ్చు, యాస, భాషలు వేరు కావచ్చు. కానీ, జీవనంలో ఉండే తడి ఒక్కటే… మనిషిగా గుర్తించబడేది అదే. అందుకే తెలంగాణ పోరాటం యావత్తు ఎవరేం రాసినా… అంతిమ ఫలితం ప్రజలు సాధించుకున్నారు. కానీ. దీన్ని చెప్పడానికి మాత్రం నేడు రాజకీయులు ఎవరి వాదనలకు వాళ్లు బలాన్ని అద్దుకుంటున్నారు. అందుకోసం చరిత్రలో జరిగిన ప్రతీ సంఘటనలో తమదైన కోణాన్ని ఎక్కిస్తూ… లేని వాటిని ఉన్నవని, ఉన్నవాటిని లేవని చిలువలు పలువలు చేరుస్తూ గోబెల్స్ ప్రచారాలు సాగిస్తున్నారు. పీడనను, దోపిడీని, అణచివేతను సమర్థవంతంగా… చేతనతో… ఏ ప్రపంచ పోరాటాలకు తగ్గని రీతిలో ఎదుర్కొన్న మన ఘన వారసుల నిజ చరిత్ర ఇదీ అని మనం ఘనంగా చెప్పుకోలేని దుస్థితిని తీసుకొచ్చారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ అవసరార్థుల వికృత క్రీడలో నేటి తెలంగాణ పౌరున్ని చిక్కేలా చేసి వికటాట్టహాసం చేస్తున్నారు.
ఆపరేషన్ పోలో నిజాంను అణచివేసిందా… లేక తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో పోగైన అతని ఆస్తులను దర్జాగా అనుభవించేలా మధ్యేమార్గం పేరుతో నిజాంకు మంచి చేసిందా… లేక తెలంగాణ ప్రజలను నిజాం పీడన నుంచి విమోచనం చేసిందా…? అప్పటివరకూ ఉద్యమంలో తామే ఉన్నాం, అందుకే తమను అణచడానికే, తమ ఉనికే పోరాటంలో లేదని చెప్పడానికే సైనిక చర్య జరిగిందని నేడు చెప్తున్న వామపక్షీయుల విద్రోహ వాదనల సంగతి సరే. మరి అసలు నిజాలేంటీ…? ఇవేవీ కాకుండా ఇక్కడి ప్రజల అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా భారత నేలలో తెలంగాణం కలిసింది. కాబట్టి, విలీనం అంటే సరిపోతుందా. ఇవన్నీ ఎందుకని మధ్యేమార్గంగా… జాతితో కలిశాం కాబట్టి జాతీయ సమగ్రతను పెంపొందించామనుకోవచ్చా. ప్రభువుల పాలన నుంచి ప్రజాపాలన ఆరంభమైంది కాబట్టి ఇది ప్రజాపాలన దినమేనా…? ఇలాంటి ఎన్నో సందేహాలు సగటు తెలంగాణవాదిని వెంటాడుతున్నాయి. వీటికి నిర్దిష్టమైన పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత ఈ సమాజానిదే. యావత్ ప్రపంచం గర్వించే పోరాటం చేసిన మాకు, మా ప్రాంతానికి ఒక ముఖ్య ఘట్టం ఏంటో, ఎందుకో… ఎలానో… సర్వజనామోద నినాదం సృష్టించుకునే యోగ్యత, అర్హతలు లేవా…? ఇవే ఇప్పుడు మా ప్రశ్నలు. వీటికి పైన చెప్తున్న వాదనలు చేసే సమూహాలే బాధ్యత వహించాలి. కనీసం 2026 సెప్టెంబర్ 17న అయినా… సర్వజనామోదమైన ‘జై తెలంగాణ’ నినాదంతో గర్జించాలి.
జై హింద్! జై తెలంగాణ!!
(వ్యాసకర్త: బందూక్ చిత్ర దర్శకులు, తెలంగాణవాది)
-లక్ష్మణ్ మురారి శెట్టి