‘ప్రత్యేక తెలంగాణను సాధించడం ఒకెత్తయితే, దాన్ని కాపాడుకోవడం మరొకెత్తు’ అని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆనాడే చెప్పారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ఆగం చేయడానికి చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తారని, తెలంగాణ సబ్బండ వర్గాలు ఒక్కటై స్వరాష్ర్టాన్ని కాపాడుకోవాలని ఆయన ఎప్పుడో హెచ్చరించారు కూడా. జయశంకర్ సార్ చెప్పినట్టే నేడు జరుగుతున్నది.తెలంగాణ గుండెచప్పుడు లాంటి కేసీఆర్ పాలనను కాపాడుకోవడంలో తెలంగాణ సమాజం విఫలమైంది. దాంతో ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకుల చేతుల్లో స్వరాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతున్నది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే పాత ప్రభుత్వ విలువ అందరికీ తెలిసొస్తుందని అంటారు. ఏడాదిన్నర కొలువైన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలు, ప్రజా ఆకాంక్షలకు తిలోదకాలిస్తుండటంతో దానిపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్నది. అదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు తలుచుకుంటున్నారు.
అదృష్టం కలిసొచ్చి సీఎం అయిన రేవంత్‌రెడ్డి ఏడాదిన్నరలోనే విశ్వసనీయత కోల్పోయారు. ఎన్నికల్లో గెలిచేందుకు చాంతాడంత హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక బొక్కబోర్లా పడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ చావుతప్పి కన్నులొట్టబోయినట్టు పాలన సాగిస్తున్నారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా రైతుల్లో అప్రతిష్టపాలయ్యారు. ప్రజల దృష్టిని మరల్చడానికి మూసీ ప్రక్షాళన, హైడ్రాను తెరపైకి తీసుకొచ్చి అభాసుపాలయ్యారు. కేసీఆర్ జాడలు చెరిపేస్తామంటూ బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి పాతరేసి పాత పాలనను గుర్తుకుతెస్తున్నారు.
ప్రభుత్వంలో ఉండి కూడా పనిచేసే సత్తా లేక ప్రతిపక్షం మీద ఆడిపోసుకోవడం ఒక్క రేవంత్‌రెడ్డి సర్కారుకే సాధ్యం. గత పాలకులు చేసిన మంచిని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత పాలకులు ముందుకుసాగాలి. వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు లాంటి సంక్షేమ పథకాలను అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రశంసించారు. కానీ, రేవంత్‌రెడ్డి తీరు అలా లేదు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని యావత్ దేశం కీర్తిస్తుంటే, ఆయన మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని నాడు హస్తం నేతలు ప్రచారం చేశారు. నేడు తెలంగాణలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్తు అందక వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. మోటర్ మెకానిక్‌లకు చేతినిండా పని దొరుకుతున్నది. తొమ్మిదిన్నరేండ్లుగా కనిపించని బోరు బండ్లు పల్లెల్లో దర్శనమిస్తున్నాయి. మూలనపడ్డ జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు మళ్లీ పనిచేస్తున్నాయి. పంట పొలాలు ఎండిపోవడంతో రైతుల ఆందోళనలు, ఆక్రందనలు, ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. పనులు లేక కూలీలు పస్తులుండే కాలం వచ్చింది.
అంగన్వాడీ, ఆశావర్కర్లతో పాటు ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలు, కర్షక, కార్మిక వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. ఆడబిడ్డ పెండ్లికి కేసీఆర్ సర్కారు ఇచ్చిన రూ.లక్ష కూడా ఇప్పుడు అందడం లేదు. కేసీఆర్ కిట్ పథకం ఆగిపోయింది. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 పత్తాలేకుండా పోయింది. గొర్రెల పంపిణీ చేయకుండా డీడీలు వాపస్ ఇస్తున్నారు. రైతు భరోసా ద్వారా ఏటా ఎకరానికి రైతులకు, కౌలు రైతులకు రూ.15, 000, రైతు కూలీలకు రూ.12,000, అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12,000 సాయం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, రూ.500లకే గ్యాస్, విద్యార్థినులకు స్కూటీలు, ల్యాప్‌ట్యాప్‌లు, రూ.12 లక్షల దళిత బంధు.. ఇలా చెప్పుకొంటూపోతే కాంగ్రెస్ ఎగ్గొట్టిన హామీల చిట్టా మరో మ్యానిఫెస్టో పుస్తకం అవుతుంది.
కేసీఆర్ హయాంలో తొమ్మిదిన్నరేండ్లు తెలంగాణలో కరువు కనిపించలేదు. ఎకరా పొలం కూడా ఎండిపోలేదు. వలసపోయిన వారు గ్రామాలకు వాపస్ వచ్చారు. కానీ, రేవంత్‌రెడ్డి పాలనలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగించి ఉంటే, తెలంగాణలో నేడు ఈ పరిస్థితి ఉండేది కాదు.రేవంత్ తీసుకున్న నిర్ణయాలు ఇటు ప్రజలకు, అటు కాంగ్రెస్ పార్టీకి ఇసుమంత కూడా మేలు చేయకపోగా, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. తెలంగాణ చిహ్నాల మార్పులు, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, అరకొర రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన కార్యక్రమాలు పార్టీకి ఏ మాత్రం మైలేజీ ఇవ్వకపోగా తీవ్ర నష్టం చేశాయి.
కేసీఆర్ హయాంలో జరిగిన పల్లె సీమల అభివృద్ధి రేవంత్ పాలనలో వెనక్కి వెళ్లిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదు. ‘పల్లె కన్నీరు పెడుతుందో కాంగ్రెస్ కుట్రల’ అన్నట్లు తెలంగాణ ఆగమవుతున్నది. చెత్త ట్రాక్టర్లకు డీజిల్ లేక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక పల్లెలు కంపుకొడుతున్నాయి. అయినా రేవంత్ తీరు మారడం లేదు.
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు అశనిపాతంగా మారుతున్నాయి. తాను తప్ప భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి ఎవరూ సీఎం కావద్దన్నట్లుగా ఆయన నిర్ణయాలు ఉన్నాయి. కాంగ్రెస్ మరో 20 ఏండ్ల వరకు కోలుకునే పరిస్థితి లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతోనే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైతే రేవంత్‌కు పదవీ గండం ఖాయం. అందుకే శల్యసారథ్యం చేసిన రేవంత్.. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు.
మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని నాడు హస్తం నేతలు ప్రచారం చేశారు. నేడు తెలంగాణలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్ర
వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్తు అందక వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. మోటర్ మెకానిక్‌లకు చేతినిండా పని దొరుకుతున్నది.
-జీడిపల్లి రాంరెడ్డి
96666 80051