పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టాలన్న లక్ష్యంతో మొదలైన ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజల తర్వాత ఇరుదేశాల కాల్పుల విరమణతో ముగిసింది. కానీ, భారతదేశంలో మావోయిస్టులుగా మారిన మన దేశ పౌరులను నిర్మూలించడానికి భారత ప్రభుత్వం మొదలుపెట్టిన ‘ఆపరేషన్ కగార్’ మాత్రం ఇంకా ముగియలేదు. దండకారణ్యం నేటికీ నెత్తురోడుతూనే ఉన్నది. దీన్ని ఆపవచ్చు, ఆపాలి కూడా. వరంగల్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఇదే మాట చెప్పారు.
ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలమందితో బయల్దేరి వెళ్తుండగా హుజూరాబాద్ప్రాంతంలో వలంటీర్ల సాయంతో ఆగిపోయిన వాహనాలను క్లియర్ చేస్తున్న క్రమంలో కొంతమంది మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు నన్ను కలిశారు. ‘మీరు మమ్మల్ని నాడు రక్షించకపోతే మేమెప్పుడో కనుమరుగయ్యేవాళ్లం. నేడిలా ఉండే వాళ్లం కాద’ని ఎంతో ఉద్వేగంతో చెప్పారు.
వీరు.. రెండు దశాబ్దాల కిందట నేను కరీంనగర్ ఎస్పీగా పనిచేస్తున్న కాలంలో హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రాంతంలో తలపెట్టిన పరివర్తన సదస్సుల వల్ల మిలిటెంట్ కార్యకలాపాలు మానేసి ఆయుధాలు, అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలిసినవారే. నాడు ఎల్కతుర్తి, హుస్నాబాద్, సైదాపూర్, కోహెడ, చిగురుమామిడి, ఇల్లంతకుంట జమ్మికుంట ప్రాంతాలకు చెందిన అనేకమంది సాయుధులైన నక్సలైట్ల కుటుంబాలను నేను స్వయంగా కలిశాను. ప్రభుత్వ ప్రోత్సాహంతో వారిని జనజీవన స్రవంతిలో కలిపేలా, రక్తపా తం జరగకుండా పలు కార్యక్రమాలను నాడు చేప ట్టాం. వారితో చర్చించి, వారి సమస్యలను అర్థం చేసుకొని, వారికి అవసరమయ్యే సహకారాన్ని అందించి, ఒప్పించి తమంతట తామే లొంగిపోయేలా ఎలా కృషి చేశామో నాటి రోజులు నా కండ్లముందు మెదిలాయి.
సరిగ్గా 22 ఏండ్ల తర్వాత ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ.. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో జరుగుతు న్న హింసను ఆపాలని, మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని ప్రకటించడం నిజంగా చరిత్రాత్మకం. కర్రెగుట్టలో గత నెల రోజులుగా కేంద్రం చేస్తున్న ఆపరేషన్ కగార్ మన దేశ పౌరులపై మన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన యుద్ధం. దేశంలో ప్రజాస్వామికవాదులు, హక్కుల నేతలు, మేధావులు, బుద్ధిజీవులు, ప్రతిపక్ష నాయకులు కూడా ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తున్నారు. అయినా కేంద్రం పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలను అమలుచేస్తూ అడవిలో చిక్కుకున్న మావోయిస్టులను ఏ అవశేషాలు లేకుండా మట్టుబెట్టాలని మొండిగా వ్యవహరిస్తున్నది. హింస ఏ రూపంలో ఉన్నా అడ్డుకోవాలి. అంతేకానీ, హింసను హింస ద్వారానే (అదీ మన పౌరులపై) ముగించాలనుకోవడం సరైనది కాదు. యుద్ధం వద్దని, చర్చలకు పిలవాలని, ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆలోచించాలని ప్రత్య ర్థి కోరిన తర్వాత కూడా యుద్ధమే చేయాలనుకోవడం ఆమోదయోగ్యం కాదు. ఇది మన బిడ్డలను మనమే చంపుకొంటున్నామనడానికి ఉదాహరణ.
నేను సుమారు పదేండ్ల పాటు బెల్లంపల్లి, వరంగల్, కరీంనగర్, అనంతపురం వంటి దట్టమైన అటవీ ప్రాం తాల్లో ఐపీఎస్‌గా పనిచేశాను. ఆ సమయంలో నక్సలైట్లు, మిలిటెంట్లుగా అడవిలో ఉన్నవారు, ఈ రోజు చాలామంది రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలు గా, ఉద్యోగులుగా, వ్యవసాయదారులుగా సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు. వీరిని తెలంగాణ ఉద్య మం కూడా చాలా ప్రభావితం చేసింది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన ప్రతీసారి చాలామంది మిత్రులు కలిసి ఈ విషయాన్ని నాతో పంచుకుంటుంటారు. అయితే ఇది అంత సులువుగా సాధ్యం కాలేదు.
ప్రాణాలకు తెగించి, అడవిలో నక్సలైట్లు ఉన్నచోటుకే వెళ్లి, వారిని కలిసి, మాట్లాడి ఒప్పించడం అంటే మాటలు కాదు. అలాంటి ప్రయత్నాల్లో కొన్నిసార్లు కాల్పులు కూడా జరిగాయి. ఇరువైపులా ప్రాణాలు పోయాయి. ఈ విధంగా ప్రయత్నించిన నాలాంటి చాలామంది అధికారులు వారికి టార్గెట్‌గా మారారు. కుటుంబాలతో సహా భారీ మూల్యం నేటికీ చెల్లించుకుంటూనే ఉన్నాం.
వాస్తవానికి చాలామంది మావోయిస్టులు రాజ్యంపై యుద్ధం చేయడానికో లేదా రాజ్యాన్ని ఓడించాలనే లక్ష్యంతోనో అడవిబాట పట్టలేదు. వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అవమానాలు, వ్యవస్థలో ఉన్న లోపాలను చూసి బాధింపబడినవారు, భూస్వాముల ఆగడాలు, వివక్షను సహించనివారు, అధికారుల దోపిడీని, దౌర్జన్యాలను ఓర్వలేనివారు సిద్ధాంతం పట్ల ఆకర్షితులై వెళ్తారు. అడవిలో ఉన్న వారికి కూడా తెలుసు వారు రాజ్యాన్ని ఓడించలేరని, అదంత సులువు కాదని. కానీ, వెళ్లిన తర్వాత తిరిగివచ్చే అవకాశం లేక అక్కడే చిక్కుకుపోతారు. నక్సలైట్లు, మిలిటెంట్లకు లొంగిపోయే అవకాశం కల్పించి, ప్రతిభ ఆధారంగా వారికి సహాయం లేదా ఉపాధి కల్పించి, పోలీసు వేధింపులను ఆపి, అవసరమైతే వ్యవసాయ భూమిని కూడా ఇచ్చే వెసులుబాటు కల్పిస్తే వారు కచ్చితంగా జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరిస్తారు.
పదేండ్ల పాటు నేను పని చేసిన అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వాలు, అధికారులు చేసింది సరిగ్గా ఇదే. హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, వేములవాడ, వరంగల్, ములుగు వంటి ప్రాంతాల్లో, 2002 కాలంలో చావుకు భయపడకుండా అడవుల్లోకి వెళ్లి వారిని, వారి కుటుంబాలను కలిసి ‘అజ్ఞాతం-స్వేచ్ఛ’, ‘పరివర్తన సదస్సు’, ‘నిమ్మజ్జనం’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా సాయుధులైన నక్సలైట్లకు జీవనాధారం చూపి, వారికి కావాల్సిన సహకారం అందించి వేల మందిని లొంగిపోయేలా చేసి, జనజీవన స్రవంతిలో మేము కలుపగలిగాం. అంతేకాదు, దేశంలోనే మొదటిసారిగా దాదాపు వంద మందికి పైగా మిలిటెంట్లు ఆయుధాలతో సహా ప్రభుత్వం ముందు లొంగిపోయేలా కృషిచేశాం.
2004లో వరవరరావు, హరగోపాల్, కన్నాభిరాన్ వంటి మేధావులతో ఏర్పడిన పీస్ కమిటీ (కమిటీ ఆఫ్ కన్సర్న్డ్ సిటిజన్స్) సూచన మేరకు ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపింది. అవి సఫలమయ్యాయి. కానీ, ఒప్పందం ప్రకారం మావోయిస్టులు ఆయుధా లు విడువకపోవడంతో యథావిధిగా ప్రజాకోర్టులు పెట్టి చట్టాన్ని తామే చేతుల్లోకి తీసుకోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇపుడు కూడా ఒకవైపు మావోయిస్టులు శాంతి మంత్రం జపిస్తూనే, మరోపక్క మం దు పాతరలతో పోలీసులను మట్టుపెట్టడం వంటి ఘటనలు విమర్శలకు తావివ్వడమే కాకుండా, వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. ఇలాంటి చర్యలు తిరిగి ప్రతిపాదిత చర్చల విఫలానికి దారితీసే ప్రమాదం ఉన్నది.
ప్రస్తుతం మావోయిస్టులే చర్చలకు పిలవాలని కోరుతున్నారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమంటున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం ఆలోచించాలి. అవసరమైతే ఒక మెట్టు దిగిరావాలి. ఎందుకంటే మావోయిస్టులు కూడా ఈ దేశ బిడ్డలే. ఇదేమీ ఇండియా-పాకిస్థాన్, రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం కాదు. కాబట్టి ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలి. నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించాలి. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మనుషులను చంపుకొంటూపోతే యుద్ధం ముగియదని గ్రహించాలి. చంపితే మనుషులే చస్తారు తప్ప, భావజాలం చావదని తెలుసుకోవాలి. మేధావులు, ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ అధికారులు, ప్రతిపక్ష పార్టీల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నక్సలైట్లకు ఉన్న అనుమానాలు, అవసరాలు, వారి భావాలు, బాధలను కూడా అర్థం చేసుకోవాలి. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అడవుల్లో ఉన్న అరుదైన, విలువైన సహజ వనరుల దోపిడీ కోసం నక్సలైట్ల ఏరివేత మొదలెట్టారని, వారితో పాటు అమాయక ఆదివాసీల ను కూడా నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారని, మహిళలపై లైంగికదాడులు చేస్తున్నారనే వాదనలకు జవాబివ్వాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వంపై ఉన్నది.
మావోయిస్టులు కూడా ఆయుధాలన్నీ ఒకచోట పెట్టి లేదా మూడో పక్షానికి అప్పగించి చర్చలకు హాజరై సంపూర్ణ, శాశ్వత పరిష్కారం చూపే మార్గాలను ఆలోచించాలి. తిరిగి ఆయుధాలు ముట్టుకోబోమని హామీ ఇవ్వాలి. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పేదల పక్షాన నిలబడి కొట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ఉందని గుర్తుచేసుకోవాలి. భారత రాజ్యాంగం ఆయుధాలు చేతబట్టడాన్ని ఒప్పకోదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని గ్రహించాలి. నేపాల్‌లో జరిగిన విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇం దుకు కేంద్రమే పెద్దన్న పాత్ర పోషించాలి. దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం పనిచేస్తామని ప్రభుత్వమే హామీ ఇవ్వాలి. మూలాల్లోకి వెళ్లి వినూత్నమైన పరిష్కార మార్గాలను అన్వేషించాలి. లొంగిపోయినవారికి హోంగార్డులుగా, విలేజ్ వలంటీర్లుగా కో ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటుచేసి సమాజ మార్పు కోసం వారి సేవల ను వినియోగించుకుంటామని హామీ ఇవ్వాలి. భూమి, ఆర్థిక సాయం కూడా అందించాలి. గతంతో పోల్చి చూస్తే ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇంటర్నెట్ వాడకం పెరిగింది. వంతెనల నిర్మాణాలు జరిగాయి. కాబట్టి మావోలు కూడా ఆలోచించి సరెండరవ్వాలి. వివక్ష, దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా నిరాయుధులుగా రాజ్యాంగబద్ధంగా సమాజ మార్పు కోసం కృషిచేస్తామని మాటివ్వాలి.
దోపిడీ, దౌర్జన్యం, వివక్ష, అణచివేత, అన్యాయం లేని విధంగా, దేశం సర్వతోముఖాభివృద్ధి చెందేలా కేంద్రం పాలించాలి. ఎందుకంటే దోపిడీ, అసమానతలు ఉన్నంతకాలం ప్రజలు ఆత్మగౌరవంతో బతుకలే రు. కాబట్టి తిరిగి మిలిటెంట్ పోరాటాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ తదితర బీజేపీ నాయకులు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తూ.. మానవీయ, రాజ్యాంగ విలువలు లేకుండా మాట్లాడ టం మానుకోవాలి. శత్రువునైనా సరే చంపడం ద్వారా మార్చాలనుకోవడం సరికాదు. ప్రతి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించాలి, చర్చించాలి, వాదోపవాదాలతో వారి మార్గం సరైంది కాదని నిరూపించాలి.
2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్రం చెప్తున్నది. అంతమంటే మనుషులను చంపడం కాదు, భావజాలంపై చర్చ జరగాలి. మనుషులే చనిపోతారు, భావజాలం చావదు, ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఏ సమస్యనైనా పరిష్కరించాలంటే, దాని మూలాల్లోకి వెళ్లాలి. అప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ముందు ఈ దేశ సమస్యలపై, సామాజిక అసమానతలపై, వివక్షపై లోతైన విశ్లేషణ జరగాలి. ప్రజలంతా సమానమేనన్న భావన ప్రజలందరికీ కలగాలి. అందుకు ఒక తేదీ పెట్టుకొని అంతం చేస్తామంటే కుదరదని గ్రహించాలి.
ప్రజాస్వామ్య దేశం ఎప్పుడూ తన సొంత బిడ్డలను చంపుకోదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అఫ్తాబ్ ఆలం చెప్పిన విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని, ఆచరించాలి. సీనియర్ అధికారులు, మేధావులు, జర్నలిస్టులు చొరవ తీసుకోవాలి. అందరూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూ దేశాభివృద్ధికి కృషి చేసి, నెత్తుటి మరకలు లేని దేశంగా కాపాడుకోవాలి.
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత సైన్యం దాడులు జరుపుతున్న సమయంలోనే, మరోవైపు పాక్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారని తెలిసిందే. చివరికి భారీ నష్టం జరగకుండా ఇరు దేశా లు కాల్పుల విరమణ ప్రకటించాయి. రెండు దేశాల రక్షణ, పౌరుల భద్రత దృష్ట్యా చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోవడం శుభపరిణామం. అయితే మన శత్రుదేశంతోనే చర్చలు జరిపి ఒప్పందం చేసుకోగా లేనిది, మన దేశంలో అంతర్గతంగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి చర్చలు జరిపితే కేంద్ర ప్రభుత్వానికి జరిగే నష్టం ఏమిటి? దేశ సరిహద్దులో మరణించినా, కర్రెగుట్టలో మరణించినా అందరూ మన దేశ పౌరులే కదా! కర్రెగుట్టలో చర్చలకు తావివ్వకుండా చంపుకొంటూ, పక్క దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తే, మన దేశ ప్రజల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతున్నది.
శాంతి చర్చలు, ఒప్పందం వల్ల రెండు దేశాల మధ్య యుద్ధాన్నే ఆపగలిగినప్పుడు అవే ఒప్పందాలు, శాంతి చర్చలు జరిపి మన దేశంలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌ను ఆపలేమా? ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. దేశంలోని అన్ని పార్టీల నాయకులతో చర్చించి ప్రధాని, కేంద్ర హోంశాఖ దీనిపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా సేకరించి మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని అమలు చేయాలి. తద్వారా దండకారణ్యంలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పాలి.