బాధేస్తుందన్న మాట గాయాలపాలైంది. సిగ్గు అన్న మాట సిగ్గుతో చచ్చింది. చీము నెత్తురులు అన్న పదం చివికిపోయింది. “ఛీ” అన్నది చచ్చింది. “ఛ.. ఛ” అన్నవి చితికిపోయాయి. బాధేస్తున్నది. ఆ మాటలు వింటే జరంత ఇజ్జత్ పోయినట్టనిపిస్తున్నది. ఆ మాటల రోతలు చూస్తుంటే పదాలే సిగ్గుపడుతున్నయ్. మాటలు గీత దాటి అడ్డూ అదుపూ లేకుండా పోతుం టే వాక్యాలు నగ్నత్వాన్ని భరించలేక లోలోపల రోదిస్తున్నాయి.
నడివీధుల్లో మాటలు బరితెగించి చేస్తున్న విశృంఖలత్వానికి నాగరికం సిగ్గుపడుతున్నది. బరితెగించటాలను దారిలో పెట్టి అందరికీ రక్షణగా ఉండాల్సిన రక్షణ కవచం లాంటి నాయకుడి మాటలు విరుద్ధమై, వికృతమై వికటాట్టహాసాలు చేస్తున్నయ్. నడవాల్సిన దారిని చూపాల్సిన మాటలే దారి, డొంకా లేకుండా ఎటో పోతున్నాయి. ఎట్లుండాలో చెప్పి సరైన మార్గం చూపే మార్గదర్శక మాటే మైకం కమ్మి మాట్లాడకూడనివి మాట్లాడుతూ, చెయ్యకూడనివి చేసేస్తున్నయ్. వావివరుసలు, చిన్నాపెద్దలు, లింగభేదాలు, జాలి దయలు లేని వికృత విశృంఖల భాష నిఘంటువులను చూసి సూర్యరాయాంధ్ర నిఘంటువులు నివ్వెరపోయాయి. మాటలు రోతలై విడదీయలేనంత బూతుగా మారిన రోత వ్యాకరణాన్ని చూసి చిన్నయసూరి చివుక్కుమని బిత్తరపోయి చూస్తున్నరు.
ఈ విశృంఖల కవిత్వాన్ని వినలేక కవి చౌడప్ప పారిపోతున్నారు చూడండి. నీతి శతకాలన్నీ నివ్వెరపాటుకు గురై నిస్సత్తువలో కూరుకుపోతున్నాయి. మాటలన్నింటినీ నడిపించే మాటల నాయకుడే, పదాల బడులన్నింటినీ నడిపించే పదనాయకుడే, వాక్యాలన్నింటినీ పూరించే వాక్యనాయకుడే, వికసిత కావ్యాలను విరచించే వికసిత నాయకుడే వికృతత్వ రోత భాషా గొంతుకై రోతలు కక్కుతుంటే రోతలే పాతాళంలోకి పోయి దాక్కుంటున్నాయి. ఇవన్నీ చూసి “ఇది మీకు తగదని చెప్పే మాట” ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంది.
ఎంత బాధ… ఎంత బాధ… మాటకు ఎంత బాధ… మాటలకు మాట చెప్పి ఓదార్చే మాటకు ఎంత దుర్గతి…! దుర్నీతిని చెప్పాల్సిన మాటే దునుమాడే రూపమెత్తింది. మాటకు మాట చెప్పే మాటకే గొంతు పడిపోతే ఎంత బాధ… ఎంత బాధ. “మాట తప్పిన మనిషి”, “గీత దాటిన మనిషి” మాటలు వింటూ దించిన తలెత్తడం లేదు. తీర్పులు చెప్పాల్సిన మాటలకు మాటలు దొరకట్లే… అన్నీ తీరు తప్పిన మాటలు… దారి తప్పిన వాక్యాలు… అన్యాయం అన్న మాటల్ని కరకర కోసేసే మాటలే. మృత భాషల్ని విన్నాం కానీ, ఇలాంటి మురికి భాషను ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. ఇక చూడనూ లేమేమో… భాషే మురికి నాయక భాష అవతారమెత్తితే దానికి హద్దులూ, పద్దులూ, దిక్కులూ, దివాణాలు ఉండవు. మురికి బహుమురికై బహుభాష మురికిబహుపరాకై మూసీ గేట్లు దాటి ప్రవహిస్తోంది… అడ్డుకట్ట వేసి ఆదుకోవాల్సిన మాటలే అడ్డదిడ్డంగా అడ్డుతగులుతున్నయ్.
మాటలు మారణాయుధాలు. మాటలు చేసే విధ్వంసం,మారణహోమాలను చూసి హంతకులు పారిపోతున్నారు.మాటలను దొంగతనం చేసే కాపీరాయుళ్లు పరుగులు తీస్తున్నారు. వికృత మాటల ధ్వనికి సమాజం కర్ణభేరీలు పగిలిపోతున్నాయి. హతవిధీ… చూడు మాట రోదిస్తుంది…
భాష గుక్కపట్టి ఏడుస్తుంది.
తొండమునేకదంతము అని విఘ్నములు కలుగకుండా వినాయక స్తోత్రాలు చదివాం, విన్నాం. ఈ తొండల భాషను ఇప్పటిదాకా ఇనలే. గాలికి అటు నుంచి ఇటు పోయి చెడుగాలులు సోకి అవి పిల్లల చెవిన పడటంతో పంతుళ్లంతా హైరానా పడుతున్నారు. పిల్లలడిగిన ప్రశ్నలకు సార్లు సమాధానాలు చెప్పాలి కదా! చదువుల రంగాన్ని నడిపేవారే జ్ఞానరంగ మార్గదర్శకులు కదా!! నిన్నగాక మొన్న దినపత్రికల ముఖాలై, టీవీ ఛానల్ల తెరలై, కళ్లను తప్పించుకోలేని దశలో కనిపించే, వినిపించే తొండపు భాషను, తొండాల భాషను విధిగా చచ్చినట్టు వినాల్సి వచ్చి అందరూ విన్నారు. పొద్దున్నే బడికొచ్చిన పిల్లగాడు తొండపు భాషంటే ఏమిటని అడిగిన ప్రశ్నకు సారు చూపులు తకమికపడ్డాయి. సారు పడే అవస్థలు చూసి జవాబులు పారిపోయాయి. పిల్లలకు అయోమయం. ఆశ్చర్యంగా చూస్తున్న చూపులు తరగతి గది నిండిపోయాయి. బయటకొచ్చి చూస్తే జనమంతా విస్తుబోయి తొండపు భాషపై రచ్చబండలకాడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.
అవును… నాయకులు చెప్పిన నేర్చుకోదగ్గ అంశాలను రోజూ మార్నింగ్ అసెంబ్లీలు చర్చించాలి. రాష్ట్ర, దేశ, ప్రపంచ విశేషాలను వివరించాలి. మాటలు తడబడ్డ ట్రంప్ భాష దగ్గర్నుంచి మన నాయక దిగ్గజ మణుల మాటల వరకూ అన్నీ చర్చనీయాంశాలే. మాటల్ని నిషేధిస్తారా అన్న వారు ఈ మురికి భాషను చూసి దిక్కుమొక్కు లేని మాటలకు తోడెవరని ఆలోచనల్లో పడ్డారు. ఇప్పటిదాకా ఎవరూ కనిపెట్టలేని వికృతభాషను చూసి జనమునకు ఒకింత ఆశ్చర్యమూ… అచ్చెరువూనూ. నాయకుని వాగ్భూషణమును చూసి ఇక భావితరంలో నేర్చుకోదగ్గ భాషా అంశాలకు నూతన నిఘంటువులు తయారు చేయవలె! పిల్లలూ ప్రశ్నలడక్కండీ… ఈ ఒక్క భాషాంశాలకు భావాలను, అర్థతాత్పర్యాలను చెప్పలేనని తరగతి గది తల తిప్పేసింది.
-జూలూరు గౌరీశంకర్