ఇటీవల నల్సార్‌లో న్యాయవిద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు సీజేఐ చేతుల మీదుగా పట్టాలు ఇప్పించాలనే ప్రతిపాదన వివాదంలో చిక్కుకొన్నది. సీజేఐ చేతుల మీదుగా పట్టాలు తీసుకునేది లేదని విద్యార్థులు తేల్చిచెప్పారు. అదొక ప్రైవేట్ యూనివర్సిటీ. కచ్చితంగా స్నాతకోత్సవం సీజేఐ చేతుల మీదుగానే జరుగాలనే రూలేమీ లేదు. కనుక దానిని అంతటితో వదిలిపెట్టాలి. అలా కాకుండా సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ మధ్యలో దూరి సదరు విద్యార్థులను రాష్ర్టాల బార్ కౌన్సిల్స్‌లో నమోదు చేసుకోరాదని ఫర్మానా జారీచేసి అగ్నికి ఆజ్యం పోసింది. తర్వాత ఎస్బీసీ యూటర్న్ తీసుకుని తన నిర్ణయాన్ని ఉపసహరించినప్పటికీ జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో కేవలం విద్యార్థుల సమస్య కాస్తా మొత్తం న్యాయ వ్యవస్థ పారదర్శకత, సమన్వయం, విశ్వసనీయతలకు సంబంధించిన సమస్యగా మారింది. అసలు దేశ న్యాయవ్యవస్థలో ఏం జరుగుతున్నది? అనే ప్రశ్న ఈ సందర్భంగా ముందుకు వస్తున్నది.
విద్యార్థుల ప్రవర్తన, క్రమశిక్షణ విషయంలో సంస్థలు చర్యలు తీసుకోవడం సమంజసమే అయినప్పటికీ, దాని ప్రభావం మొత్తం బ్యాచ్ భవిష్యత్తుపై పడేలా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ కీలక అంశం. న్యాయ కళాశాలల్లో క్రమశిక్షణ, విద్యా వాతావరణం, అధ్యాపకుల గౌరవం కాపాడటం కూడా అంతే ముఖ్యం. స్వేచ్ఛకు బాధ్యత జత కావాలి. హక్కులతో పాటు కర్తవ్యాల అవగాహన కూడా న్యాయ విద్యలో భాగం కావాలి. అయితే ఈ వివాదంలో అత్యంత ఆందోళన కలిగించిన అంశం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైఖరి. నల్సార్ వంటి ప్రతిష్ఠాత్మక న్యాయ విద్యా సంస్థలో చదివే విద్యార్థులను ఆషామాషీగా కొట్టి పారేయడానికి వీల్లేదు. వారు రాజ్యాంగం, హక్కులు, న్యాయం వంటి అంశాలపై శిక్షణ పొందుతున్న వారు. అలాంటి విద్యార్థుల అభిప్రాయ వ్యక్తీకరణ, నిరసన హక్కులను క్రమశిక్షణ పేరుతో అణచివేయాలనే ఆలోచన ఎస్‌బీసీకి ఎందుకు వచ్చింది?
హక్కుల పరిరక్షణకు ఉక్కు స్తంభంలా నిలువాల్సిన సంస్థ హక్కులను తొక్కేయాలని భావించడం ఏంది? భిన్నాభిప్రాయాలను గౌరవించాలనే సంస్కృతిని సంస్థ మరచిపోయిందా? న్యాయ పట్టభద్రులను రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో నమోదు చేయకుండా అడ్డుకోవాలన్న నిర్ణయం వెలువడిన వెంటనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత బార్ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందనే ప్రశ్న మాత్రం మిగిలిపోయింది.
ఒక నియంత్రణ సంస్థగా బార్ కౌన్సిల్ నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా, విస్తృత సంప్రదింపులతో తీసుకోవాలి. ఎందుకంటే సంస్థ నిర్ణయాలు వేలాది యువ న్యాయవాదుల జీవితాలను ప్రభావితం చేయగలవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, తరువాత ఒత్తిళ్లకు తలొగ్గి వెనక్కి తగ్గడం సంస్థ ప్రతిష్ఠకు మంచిది కాదు. బార్ కౌన్సిల్ వంటి సంస్థలు కూడా ప్రతిష్ఠను కాపాడుకునేందుకు పారదర్శకత, స్థిరత్వం, ముందుచూపుతో వ్యవహరించాలి. న్యాయం చెప్పే వ్యవస్థలోనే న్యాయం పట్ల నమ్మకం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ. నల్సార్ వివాదం ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన అంశం కాదు, భారత న్యాయ వ్యవస్థలో సహనం, సంస్థాగత బాధ్యత ఎంత ముఖ్యమో ఎత్తిచూపిన ఘటనగా గుర్తుండి పోతుంది. ‘నాకూ, విద్యార్థులకూ మధ్య తగాదా తలెత్తితే మధ్యలో బార్ కౌన్సిల్‌కు ఏం పని’ అని సీజేఐ స్వయంగా ఈ వివాదానికి ముక్తాయింపు పలుకడం కొసమెరుపు. కాగా ఇటీవల ఇదే తరహాలో బెంగళూరు లో మొదలైన వివాదం అనేక మలుపులు తిరిగి చివరకు మొత్తంగా స్నాతకోత్సవం రద్దుతో ముగిసింది.
బెంగళూరు వివాదంలో చీఫ్ జస్టిస్‌తో పాటుగా బార్ కౌన్సిల్ ఆప్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తమైంది. సీజేఐతో విద్యార్థి ప్రతినిధులు భేటీ అయ్యి చర్చించారు. విద్యార్థుల్ల్లో ఓటింగ్ కూడా పెట్టారు. మనన్ కుమార్ హాజరు కాబోవడం లేదని యాజమాన్యం తెలిపంది. అయితే చివరి నిమిషంలో వర్సిటీ యాజమాన్యం సీజేఐని ఆహ్వానిస్తూ బహిరంగంగా ప్రకటన చేయాలని విద్యార్థులకు సూచించడంతో పీటముడి పడింది. పైగా ఎలాంటి నిరసనలు చేపట్టరాదని మరో షరతు విధించింది. నల్సార్ యూనివర్సిటీ వ్యవహారంలో బీసీఐ పాత్రపై విమర్శలు తలెత్తితే ఇక్కడ యాజమాన్యం పాత్ర ప్రశ్నార్థకం కావడం విడ్డూరం.
ముంబై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 86వ వార్షిక స్నాతకోత్సవం హఠాత్తుగా వాయిదా పడింది. ఇవే కాకుండా హెచ్ఆర్ ఖన్నా స్మారకోపన్యాసం, సోనీపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ స్నాతకోత్సవం కూడా వాయిదా వేయడమో, రద్దు చేయడమో జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నిరసనల పరంపర మన న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠకు అంత మంచివి కావు. ఇలా స్నాతకోత్సవాలు వివాదాల పాలు కావడం, విద్యార్థులు ఆ ప్రత్యేక సందర్భం లేకుండానే పట్టాలు ’ఇన్ యాబ్సెన్షియా’గా పొందడం కూడా అభిలషణీయం కాదు. అన్నిటింకి మించి నిరసనలు వద్దనే తాఖీదులు న్యాయవ్యవస్థలోనే ప్రతిధ్వనించడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సరికాదు. పెద్దలు, పిల్లలు ఆలోచించాల్సిన విషయం ఇది.
తుమ్మలపల్లి
రఘురాములు