తరతరాలుగా వెనుకబడిన ముదిరాజుల అభివృద్ధికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు గత 58 ఏండ్లలో చేసిందేమీ లేదు. కీ.శే.కృష్ణస్వామి ముదిరాజ్ లాంటి సంఘసంస్కర్తలు తమంతట తాము సామాజిక రంగంలో ఎదిగి, పేరు ప్రఖ్యాతులు సంపాదించి, ముదిరాజులను సంఘటితం చేశారు. గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల వైఫల్యాలతో, అనాలోచిత నిర్ణయాలతో ముదిరాజులు తమ కులవృత్తి, జీవనోపాధి కోల్పోయి వెనుకబడటం ద్వారా రాజకీయరంగంలో ఎదగలేకపోయారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముదిరాజులు పోషించిన పాత్రను, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటగా ముదిరాజులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే దూరదృష్టితో ఆలోచించి తదనుగుణంగా ముందుకువెళ్లింది. స్వాతంత్య్రం సిద్ధించిన 64 ఏండ్లలో లేని ప్రగతిని కేవలం పదేండ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలో అనేకమంది ‘ముదిరాజు’ న్యాయవాదులకు జీపీ, ఏజీపీ, స్పెషల్ జీపీలు, స్టాండింగ్ కౌన్సిల్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా నియమించి తగు ప్రాతినిధ్యం కల్పించింది. తద్వారా ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకున్నది. అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు ముదిరాజులను చైర్మన్లుగా నియమించి, గత మంత్రివర్గంలో ఈటల వంటి వ్యక్తులకు కీలక శాఖలు కేటాయించి ముదిరాజులలో ఆత్మస్థయిర్యాన్ని నింపింది. బండ ప్రకాశ్, పిట్టల రవీందర్‌కు సముచిత స్థానాలు కల్పించింది.
ముదిరాజులకు బీసీ ‘ఏ’ క్యాటగిరీలో స్థానం కల్పించేందుకు పోరాడుతున్న డీఎల్ పాండు లాంటి న్యాయవాదులను ప్రభుత్వ ప్లీడర్లుగా నియమించింది. ముదిరాజుల ప్రధాన వృత్తి చేపల పెంపకం. అంతేకాకుండా ముదిరాజులు పండ్ల తోటల పెంపకం, సంరక్షణ, పండ్ల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తూ తమ జీవనోపాధిని గడుపుకొంటారు. చేపల పెంపకం, వృత్తి, వ్యాపారాది విషయాల్లో గత ప్రభుత్వాల హయాంలో ముదిరాజులకు జరిగిన అన్యాయాన్ని పరిగణనలోనికి తీసుకొని మొదటగా జీవో నెం 4 ద్వారా ముదిరాజ్‌లను మత్స్యకారులుగా గుర్తిస్తూ సుమారు 58 ఏండ్లుగా ముదిరాజులు పడుతున్న ఇబ్బందులను, అన్యాయాన్ని తొలగించింది. జీవో నెం.6 ద్వారా ఒక ఎకరానికి ఒకరికి సభ్యత్వం కల్పించి ముదిరాజుల సభ్యత్వాలను గణనీయంగా పెంచింది.
తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజుల పట్ల ప్రేమను చాటుకున్నది. కోకాపేట్లో ముదిరాజుల కోసం సుమారు 300 కోట్ల విలువ చేసే 5 ఎకరాల స్థలం కేటాయించి, 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి, ముదిరాజ్ భవన నిర్మాణానికి అంకురార్పణ చేసింది. అంతేకాకుండా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో 75 శాతం సబ్సిడీలతో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నది. రూ.450 కోట్లతో బడ్జెట్‌తో మినీ వాహనాల, చేపల సరఫరాల వ్యాన్లను, బైకులను ముదిరాజులకు పంపిణీ చేయడం ఆహ్వానించదగిన పరిణామం. రూ.75 కోట్లతో మత్స్యకారుల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, 1000 నూతన మత్స్యకారుల సొసైటీల ఏర్పాటు, రూ.75 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటుచేయడం, 18 ఏండ్లు నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకు మత్స్యకారుల సొసైటీ సభ్యత్వం, చేపపిల్లల, రొయ్య పిల్లల పంపిణీ కోసం వెయ్యి కోట్లు ఖర్చుచేయడం, జీవో 268 ద్వారా సర్పంచ్ల అధికారాలను స్థానిక చెరువులపై తొలగించడం ముదిరాజుల అభివృద్ధి విషయంలో సాధించిన చరిత్రాత్మక విజయాలు.
దశాబ్దాల కాలంగా చేపల ఉత్పత్తి, పెంపకం వ్యాపారాలకు దూరమైన ముదిరాజులు పైన తెలిపిన పథకాలు, జీవోల ద్వారా గణనీయంగా ఎదిగి స్వావలంబన దిశగా వెళ్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ముదిరాజులలో గ్రామీణ నిరుద్యోగిత లేకుండా చేయడం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. జీవో 4/2022 ద్వారా 58 ఏండ్ల అన్యాయాన్ని సవరించి ముదిరాజులను మత్స్యకారులుగా గుర్తించింది. జీవో నెం. 74ను సవరించి జీవో నెం.43/2022ని తీసుకువచ్చి ముదిరాజులకు ప్రాజెక్టులలో చేపలు పట్టుకునే హక్కు కల్పించింది. ముదిరాజుల అభివృద్ధికి రూ.1000 కోట్ల మూలధనంతో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి పూనుకోవడం, బీసీ బంధులో తగిన పథకాలతో ఆదుకోవడం కేసీఆర్‌తోనే సాధ్యమైంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువుల పునరుద్ధరణ, కొత్త రిజర్వాయర్ల నిర్మాణం తర్వాత వేల కోట్ల చేపపిల్లలను రిజర్వాయర్లలో పెంచడానికి వెచ్చించి, సుమారు రూ.32 వేల కోట్ల మత్స్య సంపద సృష్టించి ముదిరాజులు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడింది. ముదిరాజులు తమ అభివృద్ధికి కృతజ్ఞతగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించే దిశగా కృషిచేయాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం మన ముదిరాజుల మీద ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: హైకోర్టు న్యాయవాది స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ)
-లాలారాము ముదిరాజ్
93461 38138