శతాబ్దాల నాటి చెక్క తీగల తోలుబొమ్మలాట కళారూపం చిన్నబోయింది. ‘బొమ్మలోల్లు’ అని ఆప్యాయంగా పిలుచుకునే పిలుపు శాశ్వతంగా దూరమైంది. అంతరించిపోయే దశలో ఉన్న అపురూపమైన కళకు తిరిగి ప్రాణం పోసిన మోతె జగన్నాథం పరమపదించి కళాలోకాన్ని శోకసంద్రంలో ముంచారు.
జనగామ జిల్లా అమ్మాపురం గ్రామానికి చెందిన మోతె జగన్నాథం చెక్క తీగల తోలుబొమ్మలాటను పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారు. అలనాటి కథా సంప్రదాయాన్ని బతికించేందుకు అంకితమైన కళాకారుల బృందానికి ఆయనే నాయకత్వం వహించారు. వారి ప్రదర్శనలు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు, ప్రహ్లాద, రామదాసు లాంటి కథలకు ప్రాణం పోశాయి. ఈ బృందం కళానైపుణ్యం తెలంగాణ ప్రాంతపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ కళకు సేవ చేసే రెండు బృందాలు మాత్రమే మిగిలాయి. అవి కూడా మోతె కుటుంబానికి చెందినవే కావడం గమనార్హం.
జగన్నాథంతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. 2006లో ఢిల్లీలోని నేషనల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్‌లో భాగంగా జగన్నాథం బృందంతో కలిసి మేం పనిచేశాం. అప్పట్లో ఉమ్మడి ఏపీలోని 11 జిల్లాల్లో వారితో కలిసి పర్యటించాం. నేషనల్ మాన్యుస్క్రిప్ట్ మిషన్ అవేర్నెస్ ప్రచారంలో భాగంగా జగన్నాథం బృందం ఆధ్వర్యంలో జరిగిన తోలుబొమ్మలాట ప్రదర్శనలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఎంతగానో దోహదపడ్డాయి. సాంస్కృతిక అవగాహనను పెంపొం దించేలా జగన్నాథం నేతృత్వంలో చెక్క తీగల తోలుబొమ్మలాట బృందంతో అనేక వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు నిర్వహించాం. హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనలు కూడా ఇప్పించాం. ప్రముఖ చలనచిత్ర నిర్మాత అజిత్ నాగ్ చెక్క తీగల తోలుబొమ్మలాటలపై ‘బొమ్మలోల్లు’ పేరిట ప్రత్యేక డాక్యుమెంటరీ నిర్మించారు. అందులో జగన్నాథం జీవితం, కళారంగానికి ఆయన చేసిన సేవలను తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మా కృషి కూడా తోడవటంతో దేశంలోని 12కి పైగా రాష్ర్టాల్లో జగన్నాథం బృందం ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందింది.
చెక్క తీగల తోలుబొమ్మలాట ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉంది. సామాజిక-ఆర్థిక సవాళ్ల కారణంగా యువతరం ఈ కళపై ఎక్కువగా ఆసక్తి చూపకపోవడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఆ కళను కాపాడుకునేం దుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, కళకు తన జీవితాన్ని అంకితం చేసిన జగన్నాథం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి. ఈ కళను సజీవంగా ఉంచేందుకు కృషిచేస్తున్న ఇతర కళాకారులను కూడా ఆదుకోవాలి. సంప్రదాయ సాంస్కృతిక రూపాన్ని గుర్తించి, అంతరించి పోతున్న ఈ కళను వెలుగులోకి తీసుకురావాలి. జగన్నాథంకు పద్మశ్రీ దక్కేలా ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఆయన ఆకస్మికంగా మృతిచెందడం బాధాకరం. ఆయన లోటును పూడ్చలేం.