కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏనిమిదేండ్లలో కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా నయా ఉదారవాద సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నది. దీని వల్ల ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. ఈ సిద్ధాంతానికి స్వస్తి పలకాలంటే కార్పొరేట్ దోపిడీకి ముగింపు చెప్పగలిగే ప్రభుత్వం భారతదేశానికి కావాలి. సంపన్నులపై పన్నులు విధించే శక్తి గల ప్రభుత్వం కావాలి. ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గించి ప్రజలందరికీ సమ న్యాయం అందుబాటులోకి తేగలిగిన ప్రభుత్వం కావాలి.
మోదీ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఒక పెద్ద ఉత్సవ సందర్భంగా చెప్పుకుంటున్నాయి. కానీ మోదీ ప్రభుత్వ పాలనలో ఒక మంచి పని కూడా కనిపించదని నిస్సందేహంగా చెప్పవచ్చు. గత 8 ఏండ్లుగా మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఏకపక్షంగా మేలు చేకూరుస్తున్నది. మోదీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చరిత్రలో చూడనంత వేగంగా పతనావస్థకు చేరుకున్నది. జీడీపీ వృద్ధి రేటు అధః పాతాళానికి పడిపోయింది. విదేశీ మారక నిల్వలు కరిగి పోతున్నాయి. ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్ఠానికి చేరింది. పారిశ్రామికాభివృద్ధి కుంటు పడింది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్ఠానికి చేరింది.
కరోనా ప్రభావం, ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా మోదీ ప్రభుత్వం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్ల ధనవంతుల సంపద పెరుగుతున్నదని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. మోదీ అధికారంలోకి వచ్చాక ఆయన కార్పొరేట్ మిత్రుడు గౌతమ్ అదానీ బాగా పెరిగి ప్రపంచ ధనవంతుల్లో రెండో స్థానం సంపాదించారు. 2022లో భారత్లో 100 మంది అత్యంత ధనికులు మరింత ధనవంతులయ్యారని ఫోర్బ్స్ నవంబర్ సంచికలో వెల్లడించింది. వారందరి మొత్తం సంపద రూ.65 లక్షల కోట్లని తెలిపింది.
ఈ ఎనిమిదేండ్లలో మోదీ ప్రభుత్వం రూ.100 లక్షల కోట్ల అప్పు చేసింది. కానీ ఆ డబ్బుతో దేశ ప్రజలకు చేసిన మేలు శూన్యం. 2016లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థలో, సామాన్యుల జీవితాల్లో ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో తెలియనిది కాదు. జీఎస్టీ అమలు చేస్తున్న తీరు నేటికీ విమర్శలకు గురవుతున్నది. కరోనా సమయంలో అమలు చేసిన లాక్ డౌన్ పేదల ఉసురు తీసింది. నాలుగు కార్మిక చట్టాలు కార్మికుల హక్కులను హరించా యి. మోదీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల 84 శాతం ప్రజల రాబడి తగ్గిపోయింది. 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 60 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, దుకాణాలు మూతపడ్డాయి. కొవిడ్ విపత్తుతో దేశ ప్రజలు నానా బాధలు పడుతున్నప్పుడు అదానీ సంపద రోజుకు 1000 కోట్లకు పైగా పెరిగింది. 2016లో భారత్లో 100 మంది బిలియనీర్లు ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య 170కి చేరింది. మోదీ ప్రభుత్వం తన అసమర్థతను, ప్రజా వ్యతిరేక విధానాలను కప్పి పుచ్చుకోవడానికి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపి ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నది.
దేశ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సం స్థలను ప్రైవేటు కంపెనీలకు చవకగా కట్ట బెట్టే పనిని చాకచక్యంగా చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం, సంఘ్ పరివార్ తమ వ్యతిరేక గళాలను, కలాలను అణచి వేయడానికి చట్టాలను ఎలా తుంగలో తొకుతుందో చెప్పడానికి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్న బుల్డోజర్ రాజ్యమే నిదర్శనం. ఈ విద్వేషానికి ఎకువగా బలయ్యేది మైనారిటీలే.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత దశే సామ్రాజ్యవాదం అనుకుంటే అది ఇంకా ఇంకా బలపడినప్పుడు మూల ధనం ఆధిపత్యం ఇప్పుడున్నట్టు పరాకాష్ఠ దశలో ఉంటుందని లెనిన్ 1916లోనే ‘ఇంపీరియలిజం- ది హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ కాపిటలిజం’ పుస్తకంలో స్పష్టంగా చెప్పారు. ఆర్థికవేత్త సి.టి.కురియన్ ప్రకారం 1990 నాటికే 90 శాతం ఆర్థిక లావాదేవీలకు వస్తు సేవలతో సంబంధమే లేదు. మన దేశం లాంటి వర్ధమాన దేశాల్లో ప్రజల జీవన విధ్వంసం, నిరుద్యోగిత, పేదరికం, ద్రవ్యోల్బణం, తగ్గుతున్న కరెన్సీ విలువ అన్నింటినీ నిర్ణయించేది లెవియథాన్ పద్ధతిలో ఉన్న ఫైనాన్స్ క్యాపిటల్, కొనసాగుతున్న సామ్రాజ్యవాద దోపిడీ, అందుకు నయా ఉదారవాద విధానాల ద్వారా మన ప్రభుత్వం అందిస్తున్న బలమైన మద్దతే. ఈ కారణాల వల్ల మెజారిటీ ప్రజల జీవితాలు దుర్భరమవుతున్నాయి.
ధనవంతులు సంపన్నులు కావటానికి సహాయం చేస్తే తద్వారా పెరిగిన సంపదలో కొంత భాగం సాధ్యమైనంత త్వరగా జల్లెడ బొట్లలాగా పేదలకు చేరుతుందని నయా ఉదారవాద సిద్ధాంతం బోధిస్తున్నది. ఈ సిద్ధాంతం ముసుగులో కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వనరులు, ప్రభుత్వ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కానుకగా అప్పగిస్తోంది. ఈ బోగస్ జల్లెడ బొట్ల సిద్ధాంతానికి స్వస్తి పలకాలంటే కార్పొరేట్ దోపిడీకి ముగింపు చెప్పగలిగే ప్రభుత్వం భారతదేశానికి కావాలి. సంపన్నులపై పన్నులు విధించే శక్తి గల ప్రభుత్వం కావాలి. ప్రజలందరికీ సమ న్యాయం అందుబాటులోకి తేగలిగిన ప్రభుత్వం కావాలి. ఉపాధి కల్పన లక్ష్యంగా అభివృద్ధి వ్యూహాలను రూపొందించే ప్రభుత్వం కావాలి. ప్రజారోగ్యం, ప్రభుత్వ విద్య, ఆహార భద్రత, ప్రజోపయోగమైన మౌలిక వసతుల నిర్మాణం వంటి విధానాలు అమలు చేయగల ప్రభుత్వం కావాలి. సమానత్వం, సామాజిక న్యాయం గల భారతదేశాన్ని నిర్మించుకోవాలంటే లౌకిక, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవడమే నేడు దేశ ప్రజల ముందున్న ప్రథమ కర్తవ్యం.
-నాదెండ్ల శ్రీనివాస్ ,96764 07140