నిన్నటివరకు మాకొక ఇల్లుండేది
మా కుటుంబానికి ఇంతో అంతో నీడుండేది
ఎన్ని ఆశల సౌధమది
ఎన్ని నాళ్ళ స్వప్నమది
ఎన్ని కష్టాల ఫలితమది
ఎన్ని కన్నీళ్ళ దుర్గమది
ఎక్కడ పుట్టామో
ఎక్కడ చదివామో
ఎక్కడికి చేరామో
గతాన్ని మరిచినవాళ్ళం
మూలాల్ని కోల్పోయిన వాళ్ళం
పుట్టుకనే జ్ఞాపకంగా మార్చుకున్న వాళ్ళం
బతుకుపోరు తప్ప గతం హోరు మరిచిన వాళ్ళం
నగరంలో వలసలుగా మిగిలిన వాళ్ళం
రెక్కల నమ్ముకుని
బతుకు ముక్కలు చేసుకుని
కడుపు కట్టుకుని
కలలను పేర్చుకుని
రూపాయిలను కూర్చుకుని
ఇంటి జాగగా మారిన వాళ్ళం
ఆపై ఇటుకలుగా నిలిచినవాళ్ళం
అభివృద్ధి అత్యవసర సరుకైంది
సుందరీకరణ ఆకలి తీర్చే అప్సరస రూపమెత్తింది
అధికారం శివాలెత్తింది
చట్టం బుల్డోజరై నడిచొచ్చింది
గూడు కూలింది
నీడ చెదిరింది
కన్నీళ్ళతో నది పారింది
పాములు బుసలు కొడుతూ పడగలు విప్పాయి
కప్పలు కల్లోలమయ్యాయి
ఇప్పుడక్కడ ఏ పుట్టలు వెలుస్తాయో!
ఆ పునాదుల్లో
ఇటుక, ఇసుక, కంకరగా
మారే అవకాశమన్నా మాకిస్తారా?
– వి.ఆర్.తూములూరి 97052 07945