మెయిన్ స్ట్రీమ్ మీడియా ‘మతలబి’ అయినప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ప్రజల ఆలోచనలకు అద్దం పడుతుంది. సమాజ సహజ రూపాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం దాని పోషకుల ఆలోచనా ధోరణికి అనుకూలంగా వార్తలను ప్రచురిస్తుంది. వాస్తవాలను మరుగున పరుస్తుంది తెలంగాణ విషయంలో గత ఆరు దశాబ్దాలుగా ఇదే జరుగుతూ వచ్చింది. న్యూస్ కన్నా వ్యూస్ ఎక్కువగా ప్రచురితమయ్యేవి. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇది చూశాం. ఉద్యమ నేతల మాటలను, ప్రజల ఉద్యమాలను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తప్పుడు రీతిలో చిత్రీకరించేవారు. 2023 ఎన్నికలకు ముందు చూశాం. గత రెండున్నరేండ్ల నుంచీ చూస్తున్నాం. ఇప్పటి పరిస్థితుల్లో కూడా ఇదే తరహాలో మీడియా ప్రభావం కొనసాగుతున్నది.
ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే..ఈ మధ్య ఒక వ్యక్తికి చెందిన సోషల్ మీడియా పోస్ట్‌ను చూశాను. అందులో చాలా చక్కగా ఆయన ఆకాంక్షించాడు. అదేమంటే.. మనం (ఆంధ్ర ప్రాంత ప్రజలనుద్దేశించి) గోదావరి నీళ్లను బ్రహ్మాండంగా వాడుకోగలిగాం. కానీ కృష్ణా నది నీళ్లను ఇంకా వాడుకలోకి తేవడం లేదు. ఆయన ఉద్దేశం మంచిదే. అది స్పష్టంగా ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాసింది. నది నీళ్లను కరువు ప్రాంతాలకు మళ్లించే ప్రణాళికలు ప్రజల ప్రయోజనాలను ఆశించి చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. క్లాసికల్ చరిత్రకారులు కొందరు ఇలా చెప్పేవారు..
దేశ అభివృద్ధిని అంచనా వేయడానికి అక్కడి ప్రభుత్వం శక్తి (ఎనర్జీ)ని ఎంత బాగా ఉత్పత్తి చేస్తున్నది, ఎంత బాగా ఉపయోగిస్తున్నది అనే సమీకరణం (ఈక్వేషన్) ఆధారం అని. P=E X T. (P అంటే ప్రోగ్రెస్, E అంటే Energy produced, T అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీ వాడతారు). ఈ సమీకరణాన్ని నీళ్ల ఉపయోగం, వినియోగానికి అన్వయిస్తే ఒక రాష్ట్రం తన సహజ నీటి వనరులను ఎంత బాగా వాడుకలోకి తెస్తుంది, ఉపయోగిస్తుంది అనేది P=W X T అని మనం చెప్పవచ్చు. దీన్ని బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రజల మీద చిత్తశుద్ధిని అంచనా వేయవచ్చు. ఇది ఒక శాస్త్రీయమైన మార్గమని చెప్పాలి. ఈ సమీకరణం ద్వారా ప్రభుత్వాల పనితీరును సులభంగా అంచనా వేయడం సాధ్యమవుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి తొలి ప్రభుత్వ ప్రాధాన్యతలు, నీళ్ల వినియోగానికి దాని కృషిని చూశాం. అందుకే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన కొన్నేండ్లలోనే వ్యవసాయ ఉత్పత్తుల్లో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానానికి చేరుకున్నది. ఈ ప్రయత్నాలు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నది. గోదావరి నీటి వినియోగం దాదాపు అనుకున్న స్థాయిలో అందుకోగలిగినా కృష్ణా నీళ్ల విషయంలో ఇంకా జరగాల్సినది చాలా ఉన్నది. ఇది ఒక పెద్ద సవాల్‌గానే మిగిలిపోయింది.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతం కన్నా కృష్ణ నది పరీవాహక ప్రాంతం ఎక్కువ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. తలాపున కృష్ణమ్మ ప్రవహిస్తున్నా పాలమూరు ప్రజలు తలోదిక్కున వలస బాట పట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మహబూబ్‌నగర్ వలసల జిల్లాగా దేశమంతా పరిచయమే. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో మహబూబ్‌నగర్ ఒకటిగా ఉండేది, ఇది చాలా దురదృష్టకరమైన వాస్తవం. ఇక్కడి కరువు వల్ల ఒక దశలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయడం ‘రాజకీయ ఆనవాయితీగా’ వచ్చింది. ప్రజల బాధలను రాజకీయంగా ఉపయోగించుకోవడం అంటే ఇదే.
ఇంకొక ముఖ్యమైన జిల్లా నల్గొండ. ఇది కూడా కృష్ణ్ణా నది ఒడ్డున ఉన్నా, తాగడానికి కూడా నీళ్లకు నోచుకోని జిల్లా. ఫ్లోరైడ్ సమస్యకు ‘బ్రాండ్ అంబాసిడర్’ అయిన జిల్లా దేశంలో ఏదైనా ఉందంటే అది నల్గొండ జిల్లా అని చెప్పవచ్చు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా కూడా కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్నదే. ఒకవేళ ఈ నదిపై ఏదైనా ప్రాజెక్ట్ కడితే దాని ఫలాలు ముందుగా ఈ మూడు జిల్లాల ప్రజలకు అందాలి. ఈ జిల్లాల అవసరం తీరిన తరువాతే వేరే జిల్లాలకు మళ్లించాలి, ఇది సహజమైన, న్యాయమైన విధానం.
కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు అర్ధ శతాబ్దం పాటు జరిగిందేంటి? ఈ జిల్లాల ప్రయోజనాలు దేవుడెరుగు. కృష్ణా నది ప్రాజెక్టుల నీటిని నది బేసిన్ అవతల పక్క నది బేసిన్‌లోకి మళ్లించారనేది వాస్తవం. ఇది చాలాకాలం నుంచి కొనసాగుతున్న అన్యాయం. గోదావరి నదికి, కృష్ణా నదికి ఈ విషయంలో ఒక వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకటి..తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోదావరి నదిపై ఎటువంటి ఆనకట్టలు/ప్రాజెక్టులు (శ్రీరామ్‌సాగర్, పాక్షికంగా ఎల్లంపల్లి మినహా) కట్టలేదు. ఎందుకంటే..గోదావరి నది నిరంతరం ప్రవహిస్తేనే ఏపీలోని గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాల్లో పంటలు పండుతాయి. అదే కృష్ణ్ణా నది విషయానికొస్తే దీనిపై ప్రాజెక్టులు కట్టారు. కానీ వాటి ప్రయోజనాలను మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు అందకుండా చేశారు. ఇది ఒక పెద్ద వైఫల్యం.
ఇక ముఖ్యమైన విషయానికి వద్దాం..ఇంత జరుగుతున్నా ఈ రెండు జిల్లాల ప్రజల రాజకీయ ధోరణి ఎలా ఉన్నది? ముఖ్యంగా ఇక్కడి రైతులు, గ్రామాల్లో నివస్తిస్తున్న ప్రజలు ఎందుకు నిస్సహాయంగా ఉండిపోయారు. కృష్ణమ్మ.. పక్క పరీవాహక ప్రాంతానికి పరుగులిడినా ఎందుకు సంఘటితంగా ప్రతిఘటించలేదు? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక్కడ రెండు కారణాలు చూడవచ్చు. ఒకటి..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడం. అన్ని పార్టీల DNAలో అంతర్గత వలస (internal colonialism) ధోరణి ప్రబలంగా ఉండడం. ఇక్కడి ప్రజల ఓట్లు కావాలి, సీట్లు కావాలి. కానీ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు పట్టవు. ఇది చాలా స్పష్టమైన వాస్తవం. రెండవది..ఇక్కడి ప్రజల్లో ప్రబలంగా నాటుకుపోయిన నిర్లిప్తత. ఎటువంటి భయంకరమైన నిర్లిప్తత అంటే ‘కృష్ణా, గోదావరి నీళ్లు మీకు చెందవు’ అనే ఒక అబద్ధాన్ని బలంగా నమ్మారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం పీఠభూమి. కృష్ణా, గోదావరి నదులు లోతులో పారతాయి. కానీ ఇక్కడి భూములు ఎత్తులో ఉన్నాయి అనే తప్పుడు భావన.
గోదావరి గలగలలు, గోదావరి పుష్కరాలు, కృష్ణమ్మ బిరబిరలు, కృష్ణమ్మ హారతులు ఆంధ్ర ప్రాంతానికే పరిమితం. తెలంగాణ ప్రజలు కేవలం bi-standers మాత్రమే అనే ఆలోచన తెలంగాణ ప్రజల మనసులో స్కూల్ పుస్తకాల నుంచే చొప్పించారు. ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతులు, తమకు గోదావరి నీళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, తమ చెరువులు ఎప్పుడు నింపుతారని రాజకీయ పార్టీలను అడిగిన ఉదంతాలు లేవు. అలాగే కృష్ణా నది నీళ్లు పక్క ప్రాంతానికి పోతుంటే జలహారతులు పట్టిన నాయకులను, రాజకీయ పార్టీలను నిలదీసిన సందర్భాలూ లేవు. ఇది ఒక దురదృష్టకరమైన సత్యం.
గోదావరి జిల్లాల్లో కరువును ఆనకట్టలు, కాలువలు పరిష్కరించాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు సుసంపన్నంగా ఎదగడానికి నాగార్జునసాగర్ దోహదపడింది. ఇప్పుడు కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కూడా అదే మార్గంలో ప్రజల జీవన స్థితిగతులను మారుస్తున్నది. ఈ విజయాలను చూసి రైతులు నీటి మళ్లింపు ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. ఇది వారి భవిష్యత్తుకు మార్గం చూపుతుంది.
తెలంగాణ పల్లెల్లో నది నీళ్లను సాగునీటి రంగానికి మళ్లించటం వల్ల రైతులు, ప్రజలకు ఎన్నో లాభాలు ఉన్నాయని గ్రహించలేకపోవటం కూడా ఇలాంటి ‘Unfelt Need’గా కనిపిస్తున్నది. మన కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలను కూడా మనం గుర్తించలేకపోతున్నాం. ఇంతటి చైతన్యం, స్పృహ లేకపోవటానికి కారణం.. ప్రభుత్వం వ్యవసాయానికి నీళ్లు అందించడం, ఇరిగేషన్ అనేది ఒక unfelt needగా ఇక్కడి రైతులు, ప్రజలు పరిగణించటం. ఎలక్ట్రిసిటీ ఒక felt need అయింది కానీ ఇరిగేషన్ వాటర్ మాత్రం ఇంకా ఒక unfelt need గానే మిగిలిపోయింది. ఇది మన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నది.
ఇది ఎప్పుడు unfelt needగా మారవచ్చునంటే..ప్రజలు, రైతులు, యువత వీటి మీద ఆలోచించటం, ప్రశ్నించటం మొదలుపెట్టినప్పుడు. ఇంతకు ముందు చెప్పినట్టు, మనకు సొంత రాష్ట్రం ఏర్పడ్డా జాతీయ రాజకీయ పార్టీల్లో ఉండే internal colonialism వలన ఆ పార్టీ నాయకులు వారి అధినాయకత్వాలను నిలదీయలేరు. దీనిని ప్రజలు గ్రహించాలి. చర్చించాలి. ప్రశ్నించాలి. ఇది ఒక సామూహిక బాధ్యత. మీడియా, పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియాల్లో వచ్చే వార్తలను సూక్ష్మంగా పరిశీలించి నిజానిజాలు గ్రహించాల్సిన బాధ్యత ఈ తరానికి ఉన్నది. భవిష్యత్ తరాల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే చైతన్యం పొందాలి.
– (వ్యాసకర్త: ప్రొఫెసర్, సోషియాలజీ విభాగం, యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్)
చంద్రి రాఘవరెడ్డి