దశాబ్దం క్రితం ప్రారంభమైన ‘మేడ్ ఇన్ చైనా (ఎంఐసీ)-2025’ విజయవంతమైందని, చైనాలో సాంకేతిక ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు అది ఎంతగానో దోహదపడిందని నీతి ఆయోగ్ గత వారం ఒక నివేదికను వెలువరించింది. అంతేకాదు, ఎంఐసీ-2025 నుంచి భారతదేశం నేర్చుకోవాల్సిన వ్యూహాత్మక పాఠాల గురించి ఓ జాబితానూ విడుదల చేసింది. అయితే, 2014లో ప్రారంభమైన ‘మేక్ ఇన్ ఇండియా’ గురించి అందులో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం సాంకేతికతల బదిలీ కోసం చైనా పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలను ఆహ్వానించింది. పలు రంగాల్లో విదేశీ సంస్థలపై ఆంక్షలు విధించింది. అయితే క్లౌడ్ సేవలు, ఎలక్ట్రికల్ వెహికల్స్, వాటి భాగాలు, విద్యుత్తు ఉత్పత్తి పరికరాలు తదితర రంగాల్లో స్వదేశీ సాంకేతికతను డ్రాగన్ దేశం అభివృద్ధి చేసుకున్నది. అదే సమయంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, ఆటోమోటివ్ సెన్సార్లు, హై స్పీడ్ రైలు బ్రేకులు వంటి రంగాల్లో విదేశీ సంస్థలకు ఎర్రతివాచీ పరిచింది. ఈవీ, సోలార్ ప్యానెల్లు, రోబోటిక్స్, ఏఐ వంటి రంగాల్లో చైనా సర్కారు మద్దతుతో అనేక స్వదేశీ కంపెనీలు వృద్ధి చెందాయి. చైనా ఈవీ సంస్థలు బీవైడీ (ఇది టెస్లాను అధిగమించింది), ఎక్స్‌పెంగ్, ఎన్ఐవో వంటివి ప్రభుత్వ మౌలిక సదుపాయాలను వినియోగించుకొని మార్కెట్లో దూసుకెళ్లాయి.
చైనా ఎగుమతులు పెరిగేందుకు ఎంఐసీ-2025 దోహదపడింది. చైనా-కొరియా ఎఫ్‌టీఏ మూలంగా చైనా ఎగుమతులు భారీగా పెరిగాయి. దేశీయ కంపెనీలకు మద్దతివ్వడం, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచేలా ప్రోత్సాహకాలు, ఇన్పుట్లను అందించడం తదితర చర్యల ద్వారా ప్రపంచ సవాళ్లకు ఎదురొడ్డి మరీ చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా అవతరించింది. ఆఫ్రికా దేశాలతోపాటు వివిధ అభివృద్ధి చెందని దేశాలతో చైనా జీరో టారిఫ్ ఒప్పందాలు చేసుకున్నది. ఇది కూడా ఆ దేశ ఎగుమతుల పెంపునకు తోడ్పడింది.
‘మేక్ ఇన్ ఇండియా’ ఇందుకు పూర్తి భిన్నం. ఈ కార్యక్రమాన్ని 2014 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎఫ్‌డీఐ సరళీకరణ, సింగిల్-విండో అనుమతులు వంటి వ్యాపార సౌలభ్య చర్యలు ఇందులో ఉన్నాయి. దేశంలో తయారీ, ఎగుమతులను పెంచడానికి 2019లో కార్పొరేట్ పన్నులను కేంద్రం తగ్గించింది. 14 రకాల తయారీ రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ 1.0) ఇచ్చే పథకాన్ని 2021లో ప్రారంభించింది. 2025లో ఎలక్ట్రానిక్ విభాగాల కోసం ప్రత్యేకంగా పీఎల్ఐ 2.0 పేరిట ప్రోత్సాహకాలు ఇచ్చింది. సెమీకండక్టర్ల ఉత్పత్తిని పెంచడానికి 2021లో డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని ప్రారంభించింది. ఇలా అనేక పథకాలు, ప్రోత్సాహకాలను ప్రకటించినప్పటికీ, దేశీయ తయారీ రంగం సరైన ఫలితాలివ్వలేదు.
భారత గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ)లో తయారీ రంగం 25 శాతం వాటా సాధించాలని ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, ఆ కార్యక్రమం అమల్లోకి వచ్చాక లక్ష్యానికి విరుద్ధంగా తయారీ రంగం ఇంకా పతనమైంది. 2012 ఆర్థిక సంవత్సరంలో 17.4 నుంచి, 2015 ఆర్థిక సంవత్సరంలో 16.3కు, అక్కడి నుంచి ప్రస్తుతం 13.9 శాతానికి జీవీఏలో తయారీ రంగం వాటా పడిపోయింది. 2015-2025 మధ్యకాలంలో మొత్తం జీవీఏ వృద్ధిరేటు 10.7 శాతం ఉండగా, తయారీ రంగం జీవీఏ వృద్ధిరేటు సగటు మాత్రం 8.6 శాతమే కావడం గమనార్హం.
2014లో మేక్ ఇన్ ఇండియా ప్రారంభమైనప్పుడు ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. కానీ, 2020లో ఆత్మనిర్భర్ భారత్ మిషన్‌ను ప్రారంభించినప్పుడు ‘వోకల్ ఫర్ లోకల్’, లోకల్ టు గ్లోబల్’ తమ లక్ష్యమని ప్రధాని ప్రకటించారు. దాని తర్వాత 2021లో స్థానిక తయారీ, ఎగుమతులను పెంచడం పీఎల్ఐ లక్ష్యాల్లో చేరింది.
గత కొన్నేండ్లుగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల (అసెంబుల్డ్ ఉత్పత్తులు మాత్రమే) వృద్ధి సాధించగానే.. ‘మేక్ ఇన్ ఇండియా’ విజయం సాధించిందని ప్రభుత్వం ప్రచారం చేసుకున్నది. రక్షణ ఎగుమతుల విషయంలోనూ ఇదే జరిగింది. ఈ ఏడాది ఆగస్టు 26న గుజరాత్ నుంచి 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేసే ప్రణాళికను ప్రధాని ప్రకటిస్తూ, ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ నినాదమిచ్చారు. కానీ, వాస్తవానికి తయారీరంగం వలె మన దేశ వస్తువుల ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. 2015-25 మధ్యకాలంలో ఎగుమతుల వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదవడం గమనార్హం. జీడీపీలో ఎగుమతుల వాటా 10.4 శాతమని కేంద్ర ప్రభుత్వం చెప్తుండగా, పైన పేర్కొన్న వృద్ధికి పొంతనే లేదు.
స్వాతంత్య్రానంతరం చైనా కంటే మెరుగైన స్థితిలో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 1948లో ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 0.9 కాగా, భారత్ వాటా 2.2 శాతం. కానీ, క్రమంగా చైనా అందనంత ఎత్తుకు ఎగబాకింది. 2024లో చైనా వాటా 14.6 శాతం కాగా, భారత వాటా క్రమంగా తగ్గుతూ 1.8 శాతానికి దిగజారడం పరిస్థితికి అద్దంపడుతున్నది.
-ప్రసన్న మొహంతి