తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనాపరంగా దేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఈ ప్రయాణంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు, రాష్ట్ర గౌరవం అన్నీ ముఖ్యమయ్యాయి. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి, ఆయన చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు, పరిపాలనా తీరు పట్ల విస్తృతంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒక సీఎం స్థాయికి తగిన బాధ్యత, పరిజ్ఞానం, సంయమనం ఆయనలో కనిపించడం లేదనే అభిప్రాయం బలపడుతున్నది. ఈ ధోరణితో తెలంగాణ ప్రతిష్ట మసకబారుతున్నది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ముందు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. అది కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదు. ప్రభుత్వ ధోరణిని ప్రతిబింబించే ప్రకటన. కానీ రేవంత్‌రెడ్డి పలుమార్లు చేసిన వ్యాఖ్యలు చూస్తే ప్రాథమిక అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్రిశాట్ సంస్థ అమెరికాకు చెందినదని చెప్పడం, సుంకేశుల ప్రాజెక్టు తెలంగాణకు చెందినదని తప్పుగా పేర్కొనడం, తెలంగాణకు మూడువైపులా సముద్రం ఉన్నదని ఒకసారి చెప్పడం, దేశంలో సముద్రతీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మరొకసారి పేర్కొనడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. చాలా రాష్ర్టాలకు సముద్రతీరమే లేదు అనే సాధారణ విషయం కూడా ఆయనకు తెలియకపోవడం నాయకత్వ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నది.
అసభ్య భాషపదవికి అవమానం
రాజకీయ నాయకత్వంలో భాష, సంస్కారం చాలా కీలకం. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు ప్రజలపై ప్రభావం చూపుతాయి. కానీ రేవంత్ తరచుగా బహిరంగ సభల్లో అసభ్య పదజాలం ఉపయోగించడం, బూతులు మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. ఈ విధమైన ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం మాత్రమే కాదు, ప్రభుత్వ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక సీఎం తన పదవిని గుర్తుంచుకుని మాట్లాడాలి. కానీ ఇక్కడ ఆ సంయమనం కనిపించకపోవడం ఆందోళన కలిగించే అంశం.
కుల విభేదాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు
రాజ్యాంగ ప్రమాణం చేసిన వ్యక్తి సమాజంలో ఐక్యతను పెంపొందించాలి. కానీ ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకొని పదేపదే విమర్శించడం, కించపరచడం సామాజిక శాంతికి భంగం కలిగించే చర్య. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం రాజకీయ స్వలాభం కోసం ఉద్దేశించినవే. ఇది సమాజంలో విభజనను, జాతి విద్వేషాన్ని పెంచే ప్రమాదం కలిగిస్తుంది. సీఎం స్థాయి వ్యక్తి ఈ రకమైన రాజకీయాలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి హానికరం. భారతీయ న్యాయసంహిత అనుసరించి అలాంటి మాటలు మాట్లాడుతున్న రేవంత్ శిక్షార్హుడు.
అవమానాలుఅసహనం
ఇంగ్లిష్ భాషపై పట్టులేని ముఖ్యమంత్రి, వీలయితే కష్టపడి ఆ భాషను నేర్చుకోడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ భాషపై పట్టు ఉండి అనర్గళంగా మాట్లాడే వారిని ఉద్దేశిస్తూ వారిని కించపరచడం కూడా మరో వివాదాస్పద అంశం. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మాట్లాడుతూ.. ఇంగ్లిష్ భాషపై పట్టు పెంచుకోవడానికి సాధన చేయాలని చెప్పకుండా విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఆ భాష గురించి ‘ఇంగ్లీపీస్’ భాష అంటూ వెకిలిగా మాట్లాటం ఎంతవరకు సమంజసం ? భారత్ భాషా వైవిధ్యంతో కూడిన దేశం. ప్రతి భాషకు గౌరవం ఉన్నది. అలాంటి దేశంలో భాష ఆధారంగా వ్యక్తులను చిన్నచూపు చూడటం అసహనాన్ని ప్రతిబింబిస్తుంది.
అసెంబ్లీ మర్యాదల పట్ల నిర్లక్ష్యం: అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. అక్కడ జరిగే చర్చలు ప్రజలకు మార్గదర్శకం కావాలి. కానీ అక్కడ కూడా తీవ్రమైన అసభ్య పదజాలం ఉపయోగించడం, ప్రతిపక్షంపై దాడికి తన పార్టీ సభ్యులను రెచ్చగొట్టడం, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య ప్రమాణాలను దిగజార్చుతున్నది.
హార్వర్డ్‌లో శిక్షణప్రయోజనం ఏమిటి?
ప్రభుత్వ ఖర్చుతో రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో మూడు రోజుల కోర్సు చేయడం గురించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ ప్రతిష్టాత్మక యూనివర్సిటీకి వెళ్లి వచ్చిన తర్వాత కూడా సీఎం తీరు మారలేదు. విదేశాల్లో ఉన్న లక్షలాది తెలంగాణ విద్యార్థులను, రకరకాల ఉద్యోగాలు చేసుకొని జీవిస్తున్న వారిని కించపరిచేలా బాత్రూమ్లు, బాసాన్లు (వంటకు ఉపయోగించిన గిన్నెలు) కడుక్కొని బతుకుతున్నవారిగా కించపరుస్తూ మాట్లాడే మాటలు కూడా ముఖ్యమంత్రి స్థాయికి తగినవి కావు.
కేసీఆర్‌తో పోలికరాజకీయ వ్యూహమా?
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించిన నాయకుడిగా కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆ స్థాయిని అందుకోలేకపోవడం సాధ్యం కాదు కాబట్టే రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాలనలోని లోపాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులను అసహనంతో దూషించడం సరికాదు. విమర్శలు రాజకీయాల్లో సహజం. కానీ అవి వ్యక్తిగత దూషణలుగా మారితే ప్రజలు అంగీకరించరు. పాలకులలు అభివృద్ధి పనులతోనే ప్రజల విశ్వాసం పొందాలి.
అబద్ధాలు, వివాదాలువిశ్వసనీయతపై ప్రభావం
రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఇచ్చిన హామీలు, వాటి అమలు మధ్య వ్యత్యాసం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసు వంటి వివాదాలు ఎదుర్కొంటున్నా ఆయన మరిన్ని వివాదాలకు కారణమవుతున్నారు. ప్రజలు నిత్యం మోసపోవడానికి సిద్ధంగా ఉంటారని అంటూ, వారికి మోసపు వాగ్దానాలు చేసి మోసం చేయాలని చెప్పడం కూడా చూశాం.
వ్యవహారశైలిలో మార్పు లేకపోవడం
కనీసం ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాతనైనా రేవంత్‌రెడ్డి వ్యక్తిత్వంలో మార్పు రావాల్సిందది. బాధ్యత, పరిపక్వత పెరగాల్సింది. కానీ రేవంత్ వ్యవహార శైలిలో పెద్దగా మార్పు కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది.
ప్రజల జీవనంపై వ్యాఖ్యలువాస్తవాలకు విరుద్ధం
ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరా విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారని ఢిల్లీలో మీడియా రేవంత్‌ను ప్రశ్నిస్తే.. సరైన సమాధానం చెప్పలేక పురాతన కాలంలో మాదిరిగా ‘రెండు రాళ్లను కొట్టి నిప్పు పుట్టించి కట్టెలతో వంట చేసుకోవాలి’ అంటూ చులకనగా వ్యాఖ్యలు చేయడం విమర్శలకు కారణమైంది.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేయకుండా మరింత అసహనంతో వ్యవహరిస్తూ Hate Speech Regulation Billను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసే ప్రయత్నం సీఎం చేస్తున్నారు. 1980లో బిహార్‌లో ప్రవేశపెట్టిన ప్రెస్ బిల్లు (Bihar Press Bill, 1980) భారత రాజకీయ చరిత్రలో వివాదాస్పదమైన చట్ట ప్రతిపాదనగా నిలిచింది. ఆ బిల్లును అప్పటి ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఆ బిల్లులోని ముఖ్యాంశాలు
ఈ బిల్లు ప్రకారం అసత్యం, అపకీర్తిని తెచ్చే లేదా ప్రజలను రెచ్చగొట్టే వార్తలను ప్రచురించిన పత్రికలపై కఠిన శిక్షలు విధించేందుకు ప్రభుత్వం అధికారం పొందేది. పత్రిక యజమానులు, ఎడిటర్లు, రిపోర్టర్లకు జైలు శిక్షలు, జరిమానాలు విధించే అవకాశం ఉండేది. ప్రెస్ స్వేచ్ఛపై నియంత్రణలు పెంచేవిధంగా ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ప్రెస్ స్వేచ్ఛను కట్టడి చేసే ప్రయత్నంగా పత్రికా వర్గాలు భావించాయి. ఇది భారత రాజ్యాంగంలోని అభివ్యక్తి స్వేచ్ఛ (Freedom of Expression ) (Article 19(1) (a))కు విరుద్ధమని విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా పత్రికాసంస్థలు, జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్షాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, సమ్మెలు చేశారు. అది ఒక రాష్ట్ర సమస్యగా కాకుండా, దేశవ్యాప్తంగా ప్రెస్ స్వేచ్ఛకు ముప్పుగా భావించారు. ఆ నల్లచట్టం మీద వచ్చిన వ్యతిరేకతతో చివరకు ఆ బిల్లు అమల్లోకి రాలేదు. దేశంలో ప్రెస్ స్వేచ్ఛను కాపాడుకోవడంలో ఆ ఉద్యమం ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
1975లో కేంద్రం ప్రకటించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక ఘట్టం. ముఖ్యంగా ఆర్టికల్ 19 కింద ఉన్న స్వేచ్ఛను ఇందిరాగాంధీ సర్కార్ నిలిపివేసింది. మెయింటెనెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మిసా) ద్వారా వేలాది మంది రాజకీయ నేతలు, కార్యకర్తలను విచారణ లేకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియాపై కఠిన సెన్సార్ విధించడం వల్ల స్వేచ్ఛగా వార్తలు ప్రచురించే అవకాశం లేకపోయింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారాలను విస్తృతం చేశారు. మొత్తంగా, ఎమర్జెన్సీ కాలం ప్రజాస్వా మ్య విలువలకు పెద్ద సవాల్‌గా నిలిచింది. భారత రాజ్యాంగ హక్కుల ప్రాముఖ్యతను ఎమర్జెన్సీ మరింతగా గుర్తుచేసింది.
జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జరిగిన సంపూర్ణ ప్రజాస్వామ్య పోరాటంతో ప్రజలు నాటి నిరంకుశ పాలనను వ్యతిరేకించారు. అనంతరం ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. వాటి నుంచి గుణపాఠం నేర్చుకొని ప్రజాస్వామిక పాలనను అందించాలి. కానీ కర్నాటక, తెలంగాణ రాష్ర్టాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు హేట్ స్పీచ్ రెగ్యులేషన్ బిల్ రూపొందించాయి. తమ ప్రభుత్వాల పాలనలోని వైఫల్యాలను ప్రశ్నించే ప్రజల, ప్రజలను అప్రమత్తం చేస్తున్న వారి ప్రాథమిక హక్కులను కాలరాసేలా నల్లచట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.
(వ్యాసకర్త: న్యాయవాది)
తన్నీరు శ్రీరంగారావు