ప్రతిసారి అందరూ అనుకుంటారు.. అంతా అయిపోయిందని. ఆయన పని ఖతమైందని. ఇక ఇంతేనని,ఆ పార్టీ పని ముగిసినట్టేనని. ఇక పైకి లేచే అవకాశమే లేదని. 2001 నుంచి వెక్కిరింపులు, విమర్శలు, దూషణలు, ఛీత్కారాలు. ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అన్ని మెట్లూ దిగజారి.. విలువల వలువలు విప్పేసుకొని మరీ వీరంగమాడుతుంటారు.
కేసీఆర్ అనే పేరు వింటేనే ప్రధాన మీడియా గగుర్పాటుకు గురవుతుంది. రాజకీయ నేతలు ఉలికిపాటుకు గురవుతారు. ఆయన విజయాలను చూస్తుంటారు. కానీ, ఆయన పరాజయాలను మాత్రం పూనకం వచ్చినట్ట్టు సెలబ్రేట్ చేసుకుంటారు. శివాలూగుతారు. పొరుగు రాష్ట్ర రాజకీయ నేతల సంబురాలకైతే అంతే ఉండదు. భారత రాజకీయాల్లో ఇన్నిరకాలుగా, ఇంత తీవ్రంగా మాటలు ఎదుర్కొన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ ఒక్కరే. కానీ ఆ ఒక్క కేసీఆరే.. మహామహులను సైతం నివ్వెర పోయేలా మట్టికరిపించారు. ఆ ఒక్క కేసీఆరే తెలంగాణ అన్న పదం వాడకుండా మనుగడ సాగించలేని స్థితికి రాజకీయ నాయకులను తీసుకొని వచ్చారు. పార్టీ పెట్టిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ బావుటా ఎగురవేశారు. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీని నెట్టేశారు. 2009లో చంద్రబాబు సైతం తనతో పొత్తు కోసం వెంపర్లాడేలా చేసుకున్నారు. చంద్రబాబుతో ‘జై తెలంగాణ’ అనిపించారు. 2004లో రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ పేరును చేర్చడం దగ్గర నుంచి తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయించేదాకా కేసీఆర్ వ్యూహ ప్రతివ్యూహాలను అర్థం చేసుకోవడం సోకాల్డ్ కింగ్మేకర్లమని అనుకొనేవారికి సైతం సాధ్యం కాలేదు. కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నా మీడియాకు వార్తే. లేకపోయినా వార్తే.
2009లో ‘14-ఎఫ్’ పై న్యాయస్థానం తీర్పు చెప్పిన సందర్భానికి కొద్ది రోజుల ముందు వరకు తెలంగాణలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు జరుగలేదు. 14-ఎఫ్‌తో కేసీఆర్ ఉద్యమాన్ని సునామీలా ఎగిసిపడేలా చేశారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్ కూటనీతితో దాన్ని అడ్డుకున్నా, అప్పటిదాకా తెలంగాణలో తటస్థంగా ఉన్న వారిలో సైతం చైతన్యాన్ని నింపింది. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రపతి ఆమోదం తరువాత కాంగ్రెస్ చెయ్యివ్వడంతో ఒంటరిగానే బరిలోకి దిగారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలన్నీ అనూహ్యమైనవే. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో ఏ ఒక్క ప్రధానమంత్రి, ఏ ఒక్క ముఖ్యమంత్రి సైతం కలలో కూడా ఊహించని నిర్ణయాలే ఇవి. వ్యవసాయ సంబంధమైన నిర్ణయాలైనా, ఉపాధి సంబంధమైన నిర్ణయాలైనా, బడుగువర్గాల ఉన్నతీకరణ కోసం తీసుకొన్న నిర్ణయాలైనా ఏవైనా సరే ఎవరూ ఊహించనివి. అంతుపట్టనివి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో శిఖండి రాజకీయాలతో అడ్డగోలు ఆరోపణలు చేయటంతో పాటు కేసీఆర్ కంటే తాము గొప్ప పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాదనుకున్న అధికారం వచ్చేసరికి వారి కండ్లు బైర్లుకమ్మాయి. అయితే, ఆ తర్వాత కొద్ది రోజులకే తత్తం బోధపడింది. అన్ని స్కీములను కేసీఆర్ ఎలా అమలు చేయగలిగారో అంతుపట్టలేదు. తాము ఎలా అమలు చేయాలో అర్థం కాలేదు. దీంతో కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేయడం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నది. ఈ కాలంలో ఒకటి రెండుసార్లు తప్ప కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేదు. ఒక ప్రైవేట్ చానల్ చేసిన ఇంటర్వ్యూలో సైతం అధికారంలో ఉన్నవారికి శుభం కలగాలని ఆశించారే తప్ప మరొక్క మాట మాట్లాడింది లేదు. కానీ, పాలకులు మాత్రం కేసీఆర్‌ను, కేసీఆర్ పాలనను నిత్యం వార్తల్లో ఉంచుతున్నారు. ముఖ్యమంత్రి తన హోదాను, నైతికత స్థాయిని దిగజార్చుకొని మరీ కేసీఆర్‌ను దూషిస్తున్నారు. మంత్రులూ అదే బాటలో నడుస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా అదే కోవలో పోస్టులు పెడుతూ వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ అయింది.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు పథకంపై కాంగ్రెస్ విషం చిమ్మింది. వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే తాము రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది. సర్వేలు చేస్తే గ్రామానికి సగటున 16 ఎకరాలు మాత్రమే సాగు యోగ్యం కాని భూములున్నాయని తేలింది. అంటే.. గత పదేండ్లుగా రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో సాగవుతున్న కోటిన్నర ఎకరాల్లో కేవలం రెండున్నర లక్షల ఎకరాలు మాత్రమే సాగు యోగ్యం కానివని స్పష్టమైంది. దీంతో సర్కారు గుండెలు గుభేల్మన్నాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని మల్లగుల్లాలు పడింది. చివరికి మండలానికి ఒక గ్రామానికి మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని, మిగతాది వచ్చే సీజన్ దాకా సాగదీయాలని డిసైడయ్యారు. ఇదీ కేసీఆర్ కొట్టుడు అంటే. ఈ కొట్టుడుకు రేవంత్ ప్రభుత్వం విలవిల్లాడిపోతున్నది. కరెంటు విషయంలోనూ అంతే. ఆయన 24 గంటల కరెంటు ఎలా ఇచ్చారో తెలియదు. తాము ఎలా ఇవ్వాలో అర్థం కాదు.
కేసీఆర్ కొట్టుడు అంటే ఇదీ. ప్రతి పథకం విషయంలోనూ రేవంత్ సర్కారు ఇదే రకమైన సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. కేసీఆర్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు. ఆయనను అనుసరించడం కూడా కష్టమేనని వివిధ రాష్ర్టాల్లో కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వాలకు అర్థమైంది. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ పథకాలను పేరు మార్చి, స్కీం పరిమాణాన్ని కుదించుకొని అమలు చేస్తున్నది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ప్రజలు అనివార్యంగా ప్రస్తుత పరిపాలనను కేసీఆర్ పాలనతో బేరీజు వేసుకుంటున్నారు. ఏడాదిలోనే నీళ్లకు నీళ్లు, పాలకు పాలు విడిపోయాయి. చెడు ఉన్నచోటే మంచి విలువ తెలుస్తుందన్నట్టుగా కేసీఆర్ పాలన విలువ ఏమిటో ప్రజలకు క్రమంగా తెలిసివస్తున్నది. ఫాంహౌస్ పాలన బాగుందా? ప్రజా పాలన బాగుందా? అని ఎప్పటిలాగే వెటకారం చేస్తూ కాంగ్రెస్ అధికార ట్విటర్ హ్యాండిల్లో ఓ పోల్ పెడితే ఏకంగా లక్ష ఓట్లు పోలయ్యాయి. 70 శాతం ఓట్లు వాళ్లు వెటకరించిన ఫాం హౌస్ పాలనకే పడ్డాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అధిష్ఠానం నుంచి కార్యకర్త దాకా అంతా విలవిల్లాడిపోయారు. దీనికి తోడు కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి తన దెబ్బ ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. ఇక ఆయన ప్రజాక్షేత్రంలోకి దిగితే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా?