గత కొన్నేండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు ఎన్పీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసిన నేపథ్యంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక అవకాశంగా వాడుకున్నాయి. ఆయా పార్టీలు ‘ఎన్పీఎస్ను రద్దు చేస్తాం’ అని ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ప్రకటించి అధికారంలోకి కూడా వచ్చాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్పీఎస్పై కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఓ కమిటీ వేసి, దాని సిఫారసుల మేరకు ఎన్పీఎస్ స్థానంలో యూపీఎస్ (యూనిఫైడ్ పెన్షన్ సిస్టం)ను అమలుచేయాలనే నిర్ణయం తీసుకున్నది.
ఎన్పీఎస్ స్థానంలో కేంద్రప్రభుత్వం తీసుకురానున్న యూపీఎస్ 2025, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. 25 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పింఛన్ గ్యారెంటీగా చెల్లించనున్నది. మిగిలినవారికి వారి సర్వీస్‌ను బట్టి దామాషా పద్ధతిలో పింఛన్ చెల్లించనున్నది. కనీస పింఛన్ రావాలంటే పదేండ్ల సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. ఇది రూ.10 వేలు ఉండనున్నది. ఉద్యోగి మరణిస్తే ఫ్యామిలీ పింఛన్ వర్తిస్తుంది. పింఛన్‌దారుడు మరణిస్తే భాగస్వామికి 60 శాతం పింఛన్ లభిస్తుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పింఛన్లో మార్పులుంటాయి. నెల వేతనం మొత్తంలో 10వ వంతున లెక్క గట్టి, ఆరు నెలల సర్వీస్ మొత్తాన్ని ఒక యూనిట్‌గా భావిస్తూ, సర్వీస్ మొత్తం పరిగణనలోకి తీసుకొని పదవీ విరమణ చేసిన రోజున గ్రాట్యుటీకి అదనంగా ఏకమొత్తంగా సొమ్మును ఉద్యోగులకు చెల్లిస్తారు. ప్రస్తుత ఉద్యోగుల చందా 10 శాతం కొనసాగిస్తూనే, ప్రభుత్వ వాటా 14.5 శాతం నుంచి 18 శాతానికి పెరుగనున్నది. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి కూడా ఈ యూపీఎస్ వర్తిస్తుంది. ఉద్యోగులు యూపీఎస్ కావాలో, ఎన్పీఎస్ కావాలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యూపీఎస్ విధానం 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే మొత్తం 90 లక్షల ఉద్యోగులకు వర్తించనున్నది.
ఎన్‌పీఎస్‌లో గ్రాట్యుటీ లేదు. యూపీఎస్‌లో గ్రాట్యుటీతో పాటు ఏకమొత్తం అమౌంట్ పొందవచ్చు. ఎన్‌పీఎస్‌కి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అర్హులు. యూపీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగులే అర్హులు. ఓపీఎస్‌లో ద్రవోల్బణానికి అనుగుణంగా పింఛన్ పెరుగుతుంది. యూపీఎస్‌లో కూడా ఆ అవకాశం ఉన్నది. ఎన్‌పీఎస్‌లో ఆ అవకాశం లేదు. ఓపీఎస్‌లో పీఆర్సీని పరిగణనలోకి తీసుకొని పింఛన్లో మార్పులుంటాయి. యూపీఎస్, ఎన్‌పీఎస్‌లో ఆ అవకాశం లేదు. ఓపీఎస్‌లో అదనపు పింఛన్‌కు అవకాశం ఉన్నది. యూపీఎస్‌లో ఈ విషయంపై స్పష్టత లేదు. ఓపీఎస్‌లో పింఛన్‌దారుని మరణానంతరం భాగస్వామికి పింఛన్ ఉన్నది. యూపీఎస్‌లో పింఛన్‌దారుని మరణానంతరం జీవిత భాగస్వామికి 60 శాతం పింఛన్‌కు అవకాశం ఉన్నది. ఎన్‌పీఎస్‌లో ఆ అవకాశం లేదు. ఓపీఎస్‌లో హెల్త్ కార్డులున్నాయి. యూపీఎస్‌లో స్పష్టత లేదు. ఓపీఎస్‌లో (జీ)పీఎఫ్ 100 శాతం తిరిగి పొందవచ్చు. యూపీఎస్‌లో స్పష్టత రావాలి. కారుణ్య నియామకాలకు, కుటుంబ పింఛన్‌కు అన్నిట్లో అవకాశం ఉన్నది.
ఓపీఎస్‌తో పోల్చుకుంటే ఎన్పీఎస్, యూపీఎస్‌లలో అనేక లొసుగులున్నాయి. ఎన్పీఎస్ అని, జీపీఎస్ అని, యూపీఎస్ అని రోజుకో పింఛన్ సిస్టం తీసుకురాకుండా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం.
మొత్తంగా యూపీఏస్ వల్ల ఉద్యోగులకు తీరని నష్టం వాటిల్లనున్నది. ఓపీఎస్‌కు షేర్ మార్కెట్‌తో సంబంధం లేదు. ఎన్పీఎస్ వలె యూపీఎస్‌లో కూడా ఉద్యోగి, ప్రభుత్వాల వాటా సొమ్మును ప్రభుత్వమే షేర్మార్కెట్లో పెట్టి బడా పారిశ్రామిక వేతల ప్రయోజనాల కోసం కాంట్రిబ్యూషన్ విధానం కొనసాగించనున్నది. పింఛన్ లెక్కింపులో చివరి బేసిక్ పేలో 50 శాతం కాకుండా 12 నెలల సగటు వేతనం పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆ మేరకు ఉద్యోగులు పింఛన్ నష్టపోతారు. యూపీఎస్‌లో పీఆర్సీని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుంది. 25 ఏండ్లు పూర్తిచేస్తేనే పూర్తి పింఛన్ వర్తించడం ఈ విధానంలో ప్రధాన సమస్య. ఈ నిబంధన వల్ల పింఛన్ నుంచి కొన్ని వర్గాలను దూరం చేయడమే అవుతుంది. హెల్త్ కార్డులు, అదనపు పింఛన్‌పై స్పష్టత లేకపోవడం, ఉద్యోగి కాంట్రిబ్యూషన్ తిరిగి తీసుకోవడంపై స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగులకు నష్టం జరగవచ్చు.
ఉద్యోగి నుంచి కాంట్రిబ్యూషన్ 10 శాతం కొనసాగించడం ఈ విధానంలో ప్రధాన లోపంగా కనపడుతున్నది. ఉద్యోగులు కోరుకున్నది కాంట్రిబ్యూషన్ లేని పాత పింఛన్. కానీ, కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌లో కూడా కాంట్రిబ్యూషన్ విధానం కొనసాగించడమంటే పింఛన్ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నమే అవుతుంది. పీఆర్సీ సమయంలో యూపీఎస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం అంటే భవిషత్తులో ఉద్యోగికి పింఛన్ నిరాకరించడమే అవుతుంది.
సీనియర్ సిటిజన్‌కు అదనపు పింఛన్ ప్రస్తావన లేదంటే వారి సేవలు విస్మరించడమే అవుతుంది. మొత్తంగా రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కును నిరాకరించడమే. అంతేకాదు ఓపీఎస్‌తో పోల్చుకుంటే ఎన్పీఎస్, యూపీఎస్‌లలో అనేక లొసుగులున్నాయి. ఎన్పీఎస్ అని, జీపీఎస్ అని, యూపీఎస్ అని రోజుకో పింఛన్ సిస్టం తీసుకురాకుండా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం.