మార్చి 8వ తేదీని ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’గా ప్రతిపాదించిన అంతర్జాతీయ కమ్యూనిస్టు మహిళా ఉద్యమ నాయకురాలు క్లారా జెట్కిన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. క్లారా ఆఖరి సందేశాన్ని నెరవేర్చాల్సిన కర్తవ్యం ప్రతి ఆధునిక మహిళపై ఉన్నది.
నేటి ప్రభుత్వాలు, ఎన్జీవో సంఘాలు మార్చి 8వ తేదీని ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’గా వేడుక చేసుకుంటున్నాయి. నిజమైన ఆనందం విజయంలోనే ఉంటుంది వాస్తవమే కానీ, రమిజాబి, సంగీత శర్మ, ప్రతిమ, శ్రీలక్ష్మీ నుం చి మొదలు ఎందరో అభయలు, నిర్భయలు, శుశృత, రవళి ఇటీవలి భవ్య, వైష్ణవిల ఉదంతాలు నేటికీ జరుగుతున్నాయి. ప్రేమించకపోతే యాసిడ్, పెట్రోల్ దాడుల వంటివి మన దృష్టికి వచ్చినవి కొన్ని మాత్రమే. దృష్టికి రానివి ఎన్ని కేసులో!
రోజురోజుకు స్త్రీల మీద హింస పెరుగుతున్నదనే మాట వాస్త వం కాదా? ఎందరో స్త్రీలు చనిపోతున్నారు, కొందరు చనిపోతామని భయంతో బతుకుతున్నారు. అనేక మంది మహిళలు మానసిక జబ్బులకు గురవుతున్నారు. పైకి కనిపించే కారణాలేవైనా హింస మాత్రం వీటన్నింటినీ ఆవరించి ఉన్న తరుణంలో మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ఉత్సవం చేసుకోవడం అర్థం లేని పనే. ఉత్సవాలు మహిళలుగా మన లక్ష్యాన్ని నిర్వచించుకునే వేళలుగా, మన పురోగతిని సమీక్షించుకునే సందర్భాలుగా మారాలి కానీ, వంటల పోటీలు, ప్యాషన్ షోలతో, ఎంజాయ్ చేసే సందర్భాలుగా కాకూడదు.
ప్రధానంగా స్త్రీలపై హింస నాలుగు రకాలుగా జరుగుతున్నది. కుటుంబ హింస, లైంగిక హింస, రాజకీయ హింస, రాజ్యహింస. ఇది నాలుగు గోడల మధ్యన, సమాజంలో, కమ్యూనిటీలో, రాజ్య యంత్రాంగంలోనూ జరుగుతున్నది. స్త్రీలు శిశువులుగా, పిండాలుగా ఉన్నప్పుడే హత్య చేయబడుతున్నారు. ఇంకా అనేక లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పురుషుడితో మహిళకు ఉన్న సంబంధం వల్ల కుటుంబ హింసకు, వరకట్న మరణాలకు గురవుతున్నారు.
అంతేకాకుండా సాయుధ ఘర్షణలు జరిగిన సందర్భాల్లో మహిళపై అత్యాచారాలు జరుగుతున్నాయి. స్త్రీలను బలత్కారం చేయడం ద్వారా ఒక కమ్యూనిటీని మొత్తంగా అవమానించవచ్చనేది దీని వెనుకున్న ధోరణి అనుకుంటున్నది. ఇక్కడ ప్రధానంగా రాజ్య స్వభావాన్ని, కుట్రలను పసి గట్టాల్సిన అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా విధ్వంసకర అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులవుతున్న ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు పోరాడుతున్నారు.
వారిపై రాజ్యం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. పాలకుల విధానాలను ప్రశ్నిస్తున్న, ఎదిరిస్తున్న ప్రజలపై, ముఖ్యంగా స్త్రీలపై అత్యాచారాలనే అయుధంగా రాజ్యం ఎంచుకున్నది. కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాలు, మధ్య భారతంలో అదే దండకారణ్యంలో మహిళల మాన ప్రాణాలను తోడేస్తున్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం కోసం దశాబ్దాలుగా పోరాడినా ఆఖరికి ఎన్నో మెలికలతో అది ఆమోదం పొందింది. అయినప్పటికీ 2029 వరకు అది అమల్లోకి వచ్చే అవకాశం లేదు. అంటే భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ పురుషాధిపత్యం కలిగి ఉన్నాయనే అర్థం చేసుకోవాలి.
ఆడపిల్లలు స్వేచ్ఛగా సంచరించేందుకు అవసరమైన భద్రతా వాతావరణాన్ని కల్పించాలని పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా సాధికారత, మహిళా స్వాతం త్య్రం అంటూ ఆకర్షణీయమైన మాటలను వల్లిస్తున్న పాలకు లు మరొకవైపు మహిళల పట్ల, సమాజ దృక్పథం కించిత్ కూ డా మారకుండా ఉండేందుకు తగిన భావజాలాన్ని పెంచిపోషిస్తున్నారు. గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లోనూ మహిళలు పలురకాలుగా హింసలకు గురవుతున్నారు. వీటిని నిరోధించేందు కు శాస్త్రీయంగా ఆలోచించి కార్యాచరణకు దిగాలి.
ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, శారీరకంగా మహిళలను సర్వనాశనం చేస్తున్నారు. భూ స్వామ్య, రాజరిక భావజాలపు అవశేషాలను అట్లాగే కొనసాగిస్తూ మహిళలను సేవకులుగా, ఆధునిక బానిసలుగా, పని మనుషులుగా, భర్తల కోరికలు తీర్చే భామలుగా, పిల్లలను కనే యం త్రాలుగా, ఆస్తిపాస్తులపై హక్కులు లేకుండా, తిట్టినా, కొట్టినా అణగిమణగి ఉండే స్థితిని కొనసాగిస్తూనే మరోవైపు కల్లబొల్లి మాటలతో, పంచరంగుల ప్రచారాలతో మహిళల సమస్యలు పరిష్కరిస్తామని పాలకులు ప్రచార ఆర్భాటాలను కొనసాగిస్తున్నారు. కాబట్టి మహిళా సమస్యల పరిష్కారానికి సమాజంలో మౌలిక మార్పులు జరగాలి. మహిళల మీద అమలవుతున్న సమస్త పీడనలకు మూలాలు, దోపిడీ సమాజంలోనే ఉన్నాయి. కాబట్టి తమ మీద జరుగుతున్న సమస్త పీడనలను తొలగించుకోవడానికి దోపిడికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మహిళలు సగభాగం కావాలి. అప్పుడే మహిళలు నిజమైన సాధికారత, స్వేచ్ఛలను పొందగలుగుతారు.
– బండి శ్రామిక, 79811 84205