రాష్ట్ర మౌలిక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అనేవి తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలకు రైలు పట్టాల్లాంటివి. ఈ రెండింటి మధ్య సమన్వయం లోపిస్తే ప్రభుత్వాలు ఆర్థికంగా దివాళా తీయక తప్పదు. అయితే ఎన్నికల్లో గెలుపోటముల దృష్ట్యా రెండో దానికే పార్టీలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాయి. వాటికీ లక్ష్మణరేఖలు గీసుకుంటేనే పార్టీలకు, ప్రజలకు శ్రేయస్కరం. రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఆర్నెళ్లకే కుడితిలో పడ్డ ఎలుక చందం తిప్పలు పడుతుంటే అలవికాని హామీల ఉచ్చు ఎలా ఉంటుందో తెలుస్తున్నది.
మంత్రిమండలిలో చర్చించకుండానే మన ముఖ్యమంత్రి అధికారుల చేతులు పట్టుకొని ఎలాగైనా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండని ఆదేశిస్తున్నారు. ఎంత పన్నులు, ధరలు పెంచినా హామీల గోతం సంచి నిండదు. ఈ హామీలు మమ్మల్ని అడిగి ఇచ్చారా అని అధికారులు మాత్రం అడగలేరు. అయితే, మరోదారి లేక అడ్డదిడ్డంగా పన్నులు, చార్జీలు పెంచితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఇతర రంగాల అభివృద్ధిపై దాని ప్రభావం పడుతుంది.
సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వాలు చేయూతనిస్తూనే మరోవైపు తన ఆదాయాన్ని పెంచే మార్గాలను తప్పకుండా వెతుక్కోవాలి. ఆదాయ వృద్ధికి పన్నుల పెంపు, భూముల అమ్మకం పరిష్కారం కానే కాదు. అందుకు పారిశ్రామికాభివృద్ధియే దివ్యమైన మార్గం. అది ఉద్యోగ కల్పనతో పాటు రాష్ర్టానికి పలురకాల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దీనివల్ల ఉపాధి మార్గాలు పెరిగి రాష్ట్రంపై సంక్షేమ పథకాల భారం క్రమంగా తగ్గుతుంది. నిజానికి గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విజన్‌తోనే ప్రణాళికలు రచించింది.
దేశ, విదేశీ కంపెనీల రాక కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచి ఎన్నో విజయాలను సాధించింది. కొత్త పరిశ్రమల ఉత్పత్తి మొదలై లక్షలాది యువతకు ఉపాధి లభించడంతో ఎన్నో కుటుంబాలకు ప్రభుత్వ పథకాల అవసరం తీరేది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాలన్నిటికి నియామకం జరపడం ఎవరి వల్లా కాదు. ఉదాహరణకు టెక్నాలజీ అభివృద్ధి వల్ల ప్రభుత్వ బ్యాంకులు సిబ్బంది నియామకం ఆపివేసి, ఉన్న సంఖ్యను కూడా తగ్గించుకుంటున్నాయి.
బ్యాంకుల్లో ఖాళీ పోస్టులను నింపమని ఎవరూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. అదే బాటలో రాష్ర్టాలు కూడా ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని అవసరం ఉన్న వాటికి మాత్రమే నియామకాలు జరుపుకొంటాయి. దుకాణం యజమాని కూడా తమ బేరాన్ని, లాభాన్ని బట్టి పనివాళ్లను పెంచుకుంటాడు, తగ్గించుకుంటాడు. ఈ రోజుల్లో ఎవరైనా లక్ష ఉద్యోగాలు ఇస్తామంటే అది సాధ్యపడని విషయమే. ఖాళీ ఉద్యోగాలు పూరిస్తామని, అందాక నిరుద్యోగ భృతి ఇస్తామని ఆశ చూపడం అంటే యువతను ఖాళీగా ఉంచడమే.
అందుకోసం ప్రైవేటు సెక్టార్లో ఉపాధి లభించే చర్యలు ముమ్మరం చేయాలి. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో ప్రపంచంలోని ప్రముఖ పరిశ్రమలను రాష్ర్టానికి ఆహ్వానించి నిరుద్యోగితను తగ్గించేందుకు తీవ్రంగా కృషిచేసింది. రాష్ట్రంలో నిరంతర విద్యుత్తు, నీటి సరఫరాతో పాటు విశాలమైన రహదారులు, భారీ నిర్మాణాలకు తగిన వనరుల లభ్యత కల్పించడంతో గత కొన్నేండ్లుగా దేశంలో ఎక్కడికీ రానన్ని పరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చాయి. రాష్ట్ర ప్రాథమ్యాలైన వ్యవసాయాన్ని, దాని అనుబంధ రంగాలైన కోళ్ల, గొర్రెల, చేపల పెంపకాలను ప్రోత్సహిస్తూనే మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ స్థాయి పరిశ్రమలను నగరానికి వచ్చేలా మౌలిక సదుపాయాల వృద్ధి చేపట్టింది.
ఈ పదేండ్ల శ్రమ ఫలితంగా హైదరాబాద్ ప్రపంచపటంలో ఉత్తమ వ్యాపార కేంద్రంగా గుర్తింపబడింది. పారిశ్రామిక అభివృద్ధికి కేవలం ఐటీ రంగాన్నే నమ్ముకోకుండా ఎన్నడూ వెనుకడుగేయని ఫార్మా, జీవ విజ్ఞానం, రవాణా, టూరిజం, విద్యారంగాలపై దృష్టిసారించింది. కొత్త ఫార్మా కంపెనీల రాకతో హైదరాబాద్ ఇప్పుడు దేశంలోని మందుల ఎగుమతుల్లో 20 శాతం కైవసం చేసుకున్నది. జీవ విజ్ఞాన పరిశోధనలు హైదరాబాద్‌ను విశ్వనగర స్థాయికి తీసికువెళ్లాయి. ప్రాణాంతక వ్యాధులకు మందులు, వాక్సిన్లు తయారుచేసే నోవార్టిస్ లాంటి కంపెనీలు మన నగరంలో తన పరిశోధనలు మొదలుపెట్టాయి. మెడికల్ డివైజ్ పార్క్, ఫార్మా సిటీ వైద్య పరిశోధనలకు ప్రత్యేకమైనవి.
ఈ రెండింటిలో సుమారు 6 లక్షల ఫార్మా నిపుణుల అవసరం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విదేశీ సంస్థలు పెట్టుబడులకు ముందుకువచ్చాయి. దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో రియల్ ఎస్టేట్ విదేశీ పెట్టుబడుల్లో 32 శాతం నగరానికే దక్కింది. పర్యాటకరంగాన్ని కూడా ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకున్నది. అందమైన హైదరాబాద్ నగరాన్ని గత సంవత్సరం 2 లక్షల విదేశీ పర్యాటకులు సందర్శించారు. దాని వల్ల రూ.26 కోట్ల రాష్ట్ర రెవెన్యూ పెరిగిందని రైల్వే టూరిజం సంస్థ చెప్పింది. 2016లో స్థాపించిన ఐటీ హబ్ ద్వారా ఇప్పటికే 5 వందల స్టార్టప్ కంపెనీలు అనుమతులు పొందాయి.
విదేశాల్లోని భారతీయులు, అక్కడ చదువు పూర్తయిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మన ఐటీ హబ్‌లో తమ అరంగేట్రానికి వస్తున్నారు. ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, నల్సార్ సంస్థల సమన్వయంతో భిన్న పరిశ్రమల స్థాపనకు నగరం కేంద్రమైంది. ఇలా గత పదేండ్లలో ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, తద్వారా ఎన్నో రంగాలకు పని కల్పన, యువతకు ఉపాధి అవకాశాల సృష్టికి రంగం సిద్ధం చేసింది. దాని ఫలితాలు వస్తుండగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ ‘ఇన్ని కంపెనీలను, పెట్టుబడులను రాష్ర్టాలకు తెస్తున్న మీకు సంక్షేమ పథకాలు కొనసాగించే అవసరం ఏమొచ్చింది?’ అనే ప్రశ్నకు ‘ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రణాళికలు ఇప్పుడిప్పుడే ఫలితాలనిస్తున్నాయి. రాష్ర్టానికి వచ్చిన కంపెనీలు పూర్తిస్థాయిగా ఎదిగి ఉపాధి కల్పించే దాకా ఓట్ల కోసమైనా పథకాలు తప్పవు. గెలవాలంటే ఓట్లు కావాలి. గెలిస్తేనే ఏమైనా చేయవచ్చు’ అని అన్నారు. రాష్ట్ర ఓటర్ల ఆలోచనాసరళిని అంచనా వేసి చెప్పిన సమాధానం అది.
అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా తెలిసిన వారు కాబట్టి ఈ ఎన్నికల సమయంలో హామీల వేలం పాటలో పోటీ పడలేదు. ఇంత అనుభవం, దూరదృష్టి ఉండి అరణ్యవాసంలా పాలనకు దూరమైన బీఆర్ఎస్పై ప్రతిపక్షంగా ఎన్నో బాధ్యతలున్నాయి. రాష్ర్టానికి వచ్చిన కంపెనీలకు ఒప్పందం మేరకు సదుపాయాలు కల్పించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం కొత్త ప్రభుత్వంపైన ఉన్నది.
బి.నర్సన్
94401 28169