అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కలల బిల్లుగా అభివర్ణిస్తున్న ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను ఇటీవల యూఎస్‌లోని ఇరు సభలు ఆమోదించాయి. దీంతో ఇది చట్టరూపం దాల్చింది. తొలి నుంచి ఈ బిల్లును ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, రిపబ్లికన్లలో పలువురు వ్యతిరేకించారు. ఈ బిల్లు వల్ల అమెరికా బడ్జెట్ లోటు 2.5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని, అమెరికా పౌరులపై రుణభారం ఎక్కువవుతుందని, ఆర్థిక అసమానతలు పెరుగుతాయని అటు డెమొక్రాట్లు, ఇటు కొందరు రిపబ్లికన్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ చట్టం వల్ల అమెరికాకు నష్టం జరుగుతుందని ఐఎంఎఫ్ సైతం హెచ్చరించింది. అయినా వెనక్కి తగ్గని ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడే బిగ్ బ్యూటిఫుల్ చట్టానికి బీజం పడింది. ఈ ఏడాది మే నెలలో రూపొందించిన ఈ చట్టంలో సంపన్నులు, పారిశ్రామిక వర్గాలకు పన్నుల్లో రాయితీలు, ప్రభుత్వ వ్యయం తగ్గించడం, వీసా ఫీజుల పెంపు, విద్యార్థుల సౌకర్యాల కుదింపు వంటి కీలక అంశాలున్నాయి. ఈ చట్టం వల్ల అమెరికాకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం.. ఈ చట్టం అమలైతే రానున్న 10 ఏండ్లలో సుమారు 4 ట్రిలియన్ డాలర్ల వరకు అమెరికాపై ఆర్థిక భారం పడనున్నది. అమెరికా కుబేరులకు సుమారు 3 ట్రిలియన్ డాలర్ల వరకు పన్ను రాయితీ లభిస్తుంది. ముఖ్యంగా ఈ చట్టం ద్వారా సుమారు 1.70 లక్షల మంది ఆరోగ్య భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. వైద్య ఖర్చులు భారీగా పెరుగుతాయి. కమ్యూనిటీ నర్సింగ్ హోమ్‌లకు ఇచ్చే ప్రభుత్వ సహాయం ఆగిపోతుంది. 300 బిలియన్ డాలర్లను అంతర్గత భద్రత, ఆయుధాల కొనుగోలుపై వెచ్చించనున్నట్టు ఈ చట్టంలో పేర్కొన్నారు. పేదలకు ఇచ్చే ఫుడ్ కూపన్లను నిలిపివేయడం, సంక్షేమ పథకాలను ఎత్తివేయడం, విద్యార్థుల స్కాలర్షిప్లు, రుణాలను తగ్గించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనేది ట్రంప్ ఆలోచన.
గ్రీన్ ఎనర్జీపై సబ్సిడీని కుదించడంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ చట్టం కారణంగా విద్యుత్తు కార్ల కొనుగోలుపై టాక్స్ క్రెడిట్ తగ్గనున్నది. అమెరికాలో కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై 2032 వరకు 7,500 డాలర్ల టాక్స్ క్రెడిట్ ఇచ్చేలా ప్రస్తుత చట్టాలున్నాయి. అయితే బిగ్ బ్యూటిఫుల్ చట్టం ప్రకారం.. ఈ టాక్స్ క్రెడిట్ ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు మాత్రమే లభిస్తాయి. ఫలితంగా, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు గణనీయంగా తగ్గిపోయే ఆస్కారం ఉంది. ఈ చట్టాన్ని మస్క్ వ్యతిరేకించడానికి ముఖ్యకారణం కూడా ఇదే.
ఇక ఈ చట్టం మన దేశంపై కూడా ప్రభావం చూపనున్నది. రెమిటెన్స్ పన్ను కారణంగా అమెరికాలో నివసించే లక్షల మంది ప్రవాస భారతీయులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రవాసులు తమ స్వదేశానికి పంపించే నగదు రెమిటెన్స్‌పై 1 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విదేశీయులు, హెచ్ 1బీ, గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను విధించనున్నారు. 2026 జనవరి 1 నుంచి భారత్‌కు పంపే రెమిటన్స్పై 1 శాతం పన్ను అమలుకానున్నది. నగదు, చెక్కు, మనీ ఆర్డర్ రూపంలో జరిగే రెమిటన్స్లకు ఇది వర్తించనున్నది. అయితే డిజిటల్ మార్గాల్లో పంపేవారికి ఈ పన్ను వర్తించదు.
మన దేశానికి బదిలీ అయ్యే రెమిటెన్స్‌లో సగానికి పైకా అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తుంది. మొత్తం రెమిటెన్స్‌లో అధిక వాటా అమెరికాలో ఉంటున్న భారతీయులదే. రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారం.. భారత్‌కు వస్తున్న రెమిటెన్స్ 2010లో 55.6 బిలియన్ డాలర్లు కాగా, 2023-24కు 129.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గత పదేండ్లలో భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లు సుమారు 57 శాతం పెరిగాయి. 2023-24లో రెమిటెన్స్ రూపంలో భారత్‌కు సుమారు 129.4 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇది పాకిస్థాన్, బంగ్లాదేశ్ వార్షిక బడ్జెట్‌కు సమానం. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే రావడం విశేషం. ఒక నివేదిక ప్రకారం.. ఏటా సుమారు 12-18 బిలియన్ డాలర్లను భారత్ నష్టపోయే అవకాశముంది. ఈ ప్రభావం విదేశీ మారక నిల్వలపై పడుతుంది. ఫలితంగా డాలర్ నిల్వలు తగ్గి రూపాయిపై ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ క్షీణించి దిగుమతి వర్తక వ్యయం పెరుగుతుంది. మార్కెట్లో ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
మరోవైపు, బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా రెమిటెన్స్ ప్రభావం పడనున్నది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు కూడా తగ్గుతాయి. ఫలితంగా, మార్కెట్లో వడ్డీ రేట్లు పెరుగుతాయి. ప్రవాస భారతీయులు తమ రెమిటెన్స్‌లో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయే ఆస్కారం లేకపోలేదు. ఫలితంగా సిమెంట్, ఇనుము తదితర అనుబంధ రంగాలు ప్రభావితమవుతాయి. అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం, వీసాల నిబంధనలు కఠినతరం చేయడం, వీసా ఫీజుల పెంపు వంటి అంశాలు మన దేశ యువత ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి. మొత్తంగా బిగ్ బ్యూటిఫుల్ చట్టం అమెరికాలోని పేద, మధ్యతరగతి వారిపైనే కాకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనున్నది.