నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో ప్రజల హక్కులే మేధావుల హక్కులుగా ఉండేవి. ఆ ఉద్యమం బలహీన పడిన తర్వాత, తెరచాప తెగిపోయిన కొందరు మేధావులకు ప్రజలతో అగాథం ఏర్పడింది. ఇప్పుడు వారు బాలగోపాల్ వలె గ్రామాలకు వెళ్లరు. సామాన్య ప్రజలను కలిసి వారి మంచి చెడులను వారినడిగి తెలుసుకోరు. వారి జీవితాల్లో వస్తున్న మార్పులేమిటో గమనించరు.
నగరాల్లో కూర్చొని ఊహాగానాలు చేస్తూ, తమ ఆలోచనలే ప్రజల ఆలోచనలైనట్టు వారిపై రుద్దజూస్తారు.ఆ క్రమంలో ప్రజల హక్కులు, ఈ తరహా మేధావుల హక్కులు వేర్వేరుగా రూపొందుతాయి. తెలంగాణలో ప్రస్తుతం ఈ స్థితి కనిపిస్తున్నది.
ప్రజల హక్కుల గురించి మాట్లాడే మేధావులు సర్వసాధారణంగా మధ్య తరగతివారు, ఎగువ మధ్య తరగతివారు అయి ఉంటారు. మధ్య తరగతి నుంచి వచ్చేవారు స్వయంగా జీవిత సమస్యలను ఎదుర్కొన్నవారు అయి ఉంటారు. ఆ కారణంగా ప్రజల సమస్యలు, హక్కుల విషయంలో వారికి రెండు విధాలైన నిబద్ధతలుంటాయి. ఒకటి, తాము స్వయంగా అనుభవించిన దానిని బట్టి కలిగింది. రెండు, తాము కండ్లారా చూసిన దానిని బట్టి కలిగింది. కనుక ఈ నిబద్ధత కేవలం మేధోపరమైనది కాదు. అది సజీవమైనది. ఆ పునాది మరింత బలమైనది. తాత్కాలికమైనదిగాక దీర్ఘకాలం పాటు కొనసాగేది.
మరొకవైపు ఎగువ మధ్య తరగతి నుంచి వచ్చే మేధావులు బాగా చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ, లేదా రిటైరై, మంచి కుటుంబాలు కలిగి, ఇప్పటికీ సంపాదనాపరులై, సకల సౌకర్యాలతో జీవిస్తుండి ఉంటారు. ప్రజల హక్కుల పట్ల వీరి నిబద్ధతకు తమ జీవిత నేపథ్యాలతో ఎటువంటి సంబంధం ఉండదు. అది కేవలం మేధోపరమైనది. కనుక అందులో సజీవత పాలు తక్కువ. పునాదిలో బలం తక్కువ. దీర్ఘకాలికత తక్కువ. అదే సమయంలో ఇక్కడ ఒక తేడాను గమనించాలి. మార్క్సిస్టు భావజాలంలో ‘డీక్లాసిఫై’ అనే మాట ఒకటుంది. అంటే, ఒక తరగతి (క్లాస్)కి చెందిన వ్యక్తి తన ఆలోచనలు, వ్యవహరణ వల్ల ఆ ఎగువ తరగతికి దూరమై అంతకన్న దిగువ తరగతి లక్షణాలలో భాగం కావటమన్నమాట. ఎగువ తరగతికి చెందినప్పటికీ ఈ విధంగా డీక్లాసిఫై అయ్యే మేధావులు తక్కువేమీ కాదు. అందుకు బాలగోపాల్ ఒక ఉదాహరణ.
నక్సలైట్ ఉద్యమం బలహీనపడిన దాని ప్రభావం కొంత, తమ ఎగువ తరగతి నేపథ్య ప్రభావం కొంత కలగలసిన మేధావులకు, పైన అనుకున్నట్టు, క్రమక్రమంగా తమ హక్కులకు, ప్రజల హక్కులకు మధ్య భిన్నత్వం ఏర్పడటం మొదలైంది. ఇరువురి జీవితాల మధ్య, ఆలోచనల మధ్య తేడాలు వస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. అందువల్ల వీరిద్దరి దృక్పథాలు, లక్ష్యాలు కూడా సహజంగానే మారసాగాయి. ఈ తరహా ఎగువ మధ్యతరగతి మేధావుల ఆలోచనలు, లక్ష్యాలూ నక్సలైట్ ఉద్యమం బలంగా ఉండినప్పటి సామాన్య ప్రజల జీవితాలకు దూరమవుతూ, నగర ప్రజల సమస్యలకు, రాజకీయాలకు దగ్గర కావటం మొదలైంది. వీరు మాట్లాడే హక్కులకు ఒకప్పుడు సామాన్య ప్రజల సమస్యలు, హక్కులతో మమేకత ఉండగా, ఇప్పుడు తాము దగ్గరవుతున్న కొత్త ప్రపంచపు హక్కులతో మమేకత ఏర్పడటం మొదలైంది.
తెలంగాణ సామాన్యుల గతాన్ని,వర్తమానాన్ని ఒకసారి మననం చేసుకుంటే, నక్సలైట్ ఉద్యమం, దానితో పాటు పౌర హక్కుల ఉద్యమం బలంగా ఉండిన కాలంలో ప్రజలకు ప్రధానంగా మూడు సమస్యలుండేవి. ఒకటి, ఆర్థిక సమస్యలతో, ఉపాధిరాహిత్యంతో ముడిపడినవి. రెండు, భూస్వాములు, ఇతర పెత్తందార్ల అణచివేత, దోపిడీతో సంబంధం గలవి.
మూడు, సాధారణ రూపంలోనూ, తమ నిరసనలు, విప్లవోద్యమాల అణచివేతలోనూ ఎదురయ్యే పోలీసు హింస. ఈ మూడు కూడా ఆ కాలమంతా ఉండేవి. ఆ కాలం అనే దానిని మరొక మాటలో చెప్పాలంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు నాటి మాట అని చెప్పుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి ఈ మూడు పరిస్థితులు కూడా వేగంగా తగ్గుతూ వస్తున్నాయి. అట్లా తగ్గటమన్నది వర్తమానం. తెలంగాణ అంతటా ప్రజలతో కలసి, ఓపెన్‌మైండ్‌తో మాట్లాడిన ఎవరికైనా ఈ మూడు మార్పులు దృష్టికి వస్తాయి.
పైన పేర్కొన్న మూడింటిలో ఆర్థిక సమస్యలు, ఉపాధి రాహిత్యం చెప్పుకోదగిన స్థాయిలో తగ్గాయి. ఈ సమస్య తగ్గుదల ఇంకా కొనసాగుతున్నది. ఈ మాట అన్ని గ్రామీణ వర్గాలకు వర్తిస్తుంది. గ్రామాల నుంచి వచ్చి హైదరాబాద్ తదితర చోట్ల పనిపాటలు చేసుకుంటున్న లక్షలాది మందికీ వర్తిస్తుంది. భూస్వాములు, ఇతర పెత్తందార్ల దోపిడీ, అణచివేతలు నక్సలైట్ ఉద్యమకాలంలోనే వారి భయం వల్ల తగ్గసాగగా, రాష్ట్రం ఏర్పడిన సమయానికి ప్రజలకు కలిగిన అదనపు చైతన్యం వల్ల, కొత్త ప్రభుత్వ విధానాల వల్ల, ప్రజలకు లభించసాగిన ఆర్థిక అవకాశాల వల్ల మరింతగా తగ్గాయి. ఇవే కారణాల వల్ల గ్రామీణ ప్రజల ఒకప్పటి అసంతృప్తి, నిరసనలు తగ్గుతుండగా మరొకవైపు నక్సలైట్ ఉద్యమానికి ఆధారం తగ్గసాగింది. స్వీయ బలహీనతల వల్ల కూడా ఉద్యమం తనంతట తానే దాదాపు లేకుండాపోయింది. ఉద్యమానికి ప్రజల నుంచి, యువకుల నుంచి ఆదరణ అడుగంటింది. ఇప్పుడు ప్రజలు, యువకులు కొత్త రాష్ట్రం నుంచి, ఆర్థికాభివృద్ధి నుంచి అవకాశాలను వెతుక్కుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా ప్రజలకు ఈ మేధావుల నుంచి పౌరహక్కుల పరిరక్షకులుగా ఒకప్పుడు ఉండిన అవసరం ఇప్పుడు లేకుండాపోయింది. ఇది పరిస్థితులతో పాటు వచ్చిన పరివర్తన.
ఆసక్తికరం ఏమంటే, ఇందుకు సమాంతరంగా, ఎగువ మధ్య తరగతికి చెందిన నిన్నటి హక్కుల మేధావులు కూడా కొత్తరకం హక్కుల అవకాశాలను వెతుక్కుంటున్నారు. తమ కొత్త ఆలోచనలకు తగిన కొత్త అవతారంలోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు వారు గ్రామీణ పరిస్థితులను, మార్పులను చూడరు. ఎప్పుడైనా అందుగురించి తప్పనిసరి అయి వ్యాఖ్యానించవలసి వస్తే ఇబ్బంది పడుతూ అరవాక్యంతో ముగిస్తారు. ఇప్పుడు వారి కొత్త హక్కుల ఆలోచనలు నిన్నటివరకు నక్సలిజానికి కారణభూతమైన, నక్సలైట్లను ఊచకోత కోసిన పార్టీతో, ఆర్థిక సంస్కరణలతో విపరీతమైన సహజవనరుల దోపిడీకి, ఆర్థిక వ్యత్యాసాలకు, జాబ్‌లెస్ గ్రోత్‌కు కారణమైన పార్టీతో, తమ బహుముఖ వైఫల్యాల వల్ల ఒక మతతత్వ పార్టీ ఆగమనానికి దారులు వేసిన పార్టీతో, తెలంగాణను ఆంధ్రాతో కలిపిన, ఇక్కడి ప్రత్యేక ఉద్యమాలను అణచివేసిన పార్టీతో, మొదటినుంచి ప్రాంతీయ అసమానతలకు, అంతర్గత వలసపాలనకు, ఫెడరలిజం భంగపాటుకు ఎంతగానో పాటుపడిన పార్టీతో పెనవేసుకుపోతున్నాయి. గ్రామాలను వదిలివేసి నగరాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. హాళ్లు, రౌండ్‌టేబుళ్లు, సెమినార్ ఉపన్యాసాలు, అవే ముఖాలు, అవే చప్పట్లతో మైమరిచిపోతున్నాయి. అదంతా ఒక ఆకర్షణీయమైన సుఖప్రదమైన వలయం.
పైన చెప్పుకొన్న సాధారణ మధ్య తరగతి హక్కుల మేధావులకు ఇదేమీ నచ్చుతున్నట్టు లేదు. కానీ, ఎగువతరగతి మేధావుల నాయకత్వాన అదట్లా సాగిపోతున్నది. ఒకప్పుడు దేశాన్నే గాక యావత్ ప్రపంచపు దృష్టిని ఆకర్షించిన ఇక్కడి హక్కుల ఉద్యమపు క్షీణతలో, ఎగువ తరగతి హక్కుల మేధావుల క్షీణతలో భాగంగా. వీరిపై నైతిక ఒత్తిడి ఏర్పడేందుకు ఇప్పుడు బాలగోపాల్, శంకరన్, కన్నబిరాన్ వంటివారు లేరు కదా!
టంకశాల అశోక్
రైల్వేలకు ఏదీ ‘కవచ్’?
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోనివారు చేసిన తప్పునే పదే పదే చేస్తూ పోయే దుర్గతికి లోనవుతారని సామెత. రైలు ప్రమాదాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఒడిశాలో ఘోర రైలు దుర్ఘటన జరిగి ఐదునెలలు పూర్తి కావడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉంది. బహనాగబజార్ స్టేషన్ సమీపంలో జరిగిన ఆ ప్రమాదంలో 280కి పైగా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొన్నాయి. సిగ్నలింగ్ లోపం అన్నారు. దర్యాప్తు కమిటీ వేశారు. ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఉగ్రవాద కోణాన్ని కూడా పరిశీలిస్తున్నామని రైల్వేమంత్రి చేసిన ప్రకటనపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కంటకాపల్లి వద్ద మరో ఘోర దుర్ఘటన జరిగింది. మరోసారి రెండు ప్రయాణికుల రైళ్లు ఢీకొన్నాయి. 14 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు. బహనాగబజార్ ప్రమాదంపై దర్యాప్తు జరిపిన రైల్వే భద్రతా కమిషనర్ ఏఎం చౌదరి రైల్వేబోర్డుకు ఇచ్చిన నివేదికలో పలు కీలక సూచనలు చేశారు. సిగ్నలింగ్, మెయింటెనెన్స్ వ్యవస్థలను మెరుగుపర్చాలని, ఆమోదిత సర్క్యూట్, వైరింగ్ డయాగ్రాంలు సిబ్బందికి అందించాలని సూచించారు.
మూడోది, అతి కీలకమైందీ నైపుణ్యం గల సిబ్బంది నియామకానికి సంబంధించింది. రైల్వే వ్యవస్థను ఎప్పుడు ప్రైవేటుపరం చేద్దామా, అదానీకి కారుచౌకగా ఎలా కట్టబెడదామా అని ఉరుకులాడే సర్కారు వీటి గురించి ఏం చేసిందనేది ఇప్పుడు ప్రశ్న. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు రాకుండా ఆపే ‘కవచ్’ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది మరో కీలక ప్రశ్న. ‘కవచ్’ వ్యవస్థ రూపకల్పనకు పదేండ్లకు పైగా సమయం పట్టింది. గత జూన్ నాటికి 2 శాతం రైళ్లకు మాత్రమే దీన్ని అమర్చగలిగారు. ‘కవచ్’ వ్యవస్థ లేకపోవడం కారణంగానే ఒడిశా దుర్ఘటన జరిగిందని రైల్వే పరిశీలకులు అప్పట్లో ఎత్తిచూపారు. రైల్వే భద్రతా కమిషనర్ తన సిఫారసులు చేయనంత వరకు ఏమోలే అనుకోవచ్చు. కానీ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రమాదం తర్వాతైనా మేలుకున్నారా? అంటే అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. అయితే తాజా దుర్ఘటనలో ప్రమాదానికి గురైన రెండు రైళ్లకు కవచ్ వ్యవస్థ లేదని తెలుస్తున్నది. అంటే కవచ్ విస్తరణ కార్యక్రమం నత్తనడకన సాగుతున్నట్టు అర్థమవుతున్నది. కవచ్‌ను నేరుగా కొనుగోలు చేయకుండా ఖర్చుకు భయపడి స్థానికంగా అభివృద్ధి చేసేం దుకు ప్రయత్నిస్తున్నారు. కవచ్ జాప్యానికి ఇది కూడా ఒక కారణం. ఫలితంగా రైల్వేల్లో భద్రత అగమ్యగోచరంగా తయారైంది. ఏపీ ప్రమాదం కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ రెండు ప్రమాదాల మధ్య పోలికలు మాత్రం ఉన్నాయని చెప్పొచ్చు. విజయానికి అందరూ తండ్రులే.. అపజయం మాత్రం అనాథ అన్నారు పెద్దలు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీరుకు ఈ నానుడి అద్దం పడుతుంది. ముఖ్యంగా రైల్వేల నిర్వహణ విషయంలో కేంద్ర సర్కారు ట్రాక్ రికార్డు ఏ మాత్రం సమర్థనీయంగా లేదు.
ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలతోనే రైల్వేల ప్రతిష్ఠ మసకబారుతున్నది. సాంకేతికత ఆకాశపుటంచులు చూస్తున్న ఈ రోజుల్లో భూమ్మీద రైళ్లను సురక్షితంగా నడపలేకపోతున్నదనే అపఖ్యాతి మూటగట్టుకుంటున్నది. గత పదేండ్ల బీజేపీ పాలనలో రైల్వేల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా తయారైంది. వరుస ప్రమాదాలు చూస్తుంటే ప్రభుత్వ శక్తి సామర్థ్యాల మీదనే అనుమానాలు కలుగుతున్నాయి. వందేభారత్ రైళ్లకు వందోసారి పచ్చ జెండా ఊపేందుకు ప్రధాని మోదీ వెనుకాడరు. వాటిముందు ఫొటోలు దిగడం, ప్రచారం చేసుకోవడంలోనూ ఎప్పుడూ ఆయన ముందుంటమే కాదు, ఆయనను మించినవాళ్లు దొరకరు. ఇటీవల నమో భారత్ అనే పేరులో తన పేరు కూడా చూసుకొని ఆయన మురిసిపోయారు. ఈ ఫొటోలు, ప్రచారం సరే.. భద్రత మాటేమిటి? ఒక ప్రమాదం జరిగిందీ అంటే వ్యవస్థను దుమ్ముదులిపి లోటుపాట్లను సరిచేయాలని ఎవరైనా చెప్తారు. కానీ అలాంటివేవీ మోదీ సర్కార్ డిక్షనరీలో ఉన్నట్టు లేదు.