HYDRAA | ప్రజల తీవ్ర నిరసనలు, హైకోర్టు వరుస చెంపదెబ్బలు, పలువైపుల నుంచి ఘాటైన విమర్శలతో ప్రభుత్వానికి హైడ్రా విషయమై మూడు నెలలు ఆలస్యంగా ‘కొంత’ జ్ఞానోదయం కలిగినట్లున్నది. ఆ మాత్రం జ్ఞానోదయమేమిటో ముందు చూసి, అది కూడా కొంతమేరకే అనటానికి కారణాలేమిటో తర్వాత చెప్పుకుందాం. హైడ్రా పథకం అమలు, అందువల్ల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర ప్రభుత్వ బాధ్యులతో పాటు, సంబంధిత అధికారులైన వారు ఇటీవల చేస్తున్న కొత్త తరహా ప్రకటనలను, అరకొరగానైనా తీసుకుంటున్న చర్యలను గమనించండి. అవి వారికి, మొదట పేర్కొన్న మూడు విధాలైన పరిస్థితుల ఒత్తిడితో, కొత్తగా కొంత జ్ఞానోదయం కలిగినట్టు చెప్తున్నాయి. అదే సమయంలో అవి ఒక మేరకే అయినందున, అర్ధ జ్ఞానోదయంగా మిగులుతున్నది. అట్లా అర్ధ జ్ఞానోదయం కావటానికి కారణం నిజాయితీ లేనితనమేమో విచారించవలసి ఉన్నది. ఆ పని చివరికి చేద్దాం.
స్థలాలను రిజిష్టర్ చేసింది అధికారులే, నిర్మాణాలకు అనుమతులిచ్చిందీ వారే. కొన్ని సందర్భాలలో ఇది దశాబ్దాల కిందటే జరిగింది. ఇవన్నీ ప్రభుత్వ శాఖలు చేసినప్పుడు ఇప్పుడు మరొక ప్రభుత్వ శాఖ వచ్చి ఇదంతా చట్టవిరుద్ధమంటే అర్థం ఏమిటని, సదరు అధికారులపై చర్యలేమిటని కోర్టు ఇప్పటికే ప్రశ్నించింది.
జల వనరులను, పర్యావరణాన్ని పరిరక్షించటం కోసమంటూ ఎంతో ఆదర్శవంతమైన, ప్రశంసనీయమైన మాటలతో హైడ్రాను సృష్టించిన ముఖ్యమంత్రి ఆలస్యంగా జరిగిన అర్ధ జ్ఞానోదయం తర్వాత ఇప్పుడేమంటున్నారో చూడండి:- ఏ ఒక్కరినీ బాధపెట్టం. నిర్వాసితుల కోసం మేమున్నాం. రూ.10 వేల కోట్లయినా ఖర్చుచేస్తాం. రివర్ బెడ్, బఫర్‌జోన్‌లో ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా ఇండ్లు, పునరావాసానికి పూచీ మాది. మూసీ నిర్వాసితులందరికీ తప్పకుండా ప్రత్యామ్నాయం చూపుతాం. ఎలా ఆదుకుందామో ప్రతిపక్షాలు చెప్పాలి. అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా? వారి సూచనలతో అసెంబ్లీలో తీర్మానం చేద్దాం. అన్నీ కోల్పోయే పేదల బాధలు తెలియకుండానే ఇంత దూరం వచ్చానా? నేను ఎవరినీ అనాథను చేయను. ఇవన్నీ ముఖ్యమంత్రి ఈ నెల మొదటి వారంలో వేర్వేరు సందర్భాలలో అన్న మాటలు.
అయితే ఈ మాటలన్నీ ఎప్పుడు వచ్చాయి? అంతకు కొద్దిరోజుల ముందు సెప్టెంబర్ 30న హైకోర్టు, ఒక అధికారినైతే, తాము చెప్పినా వినరా? జైలుకు పంపాలా? అని తీవ్రంగా హెచ్చరించిన తర్వాత. దసరా పండగ తర్వాత 16వ తేదీన ప్రభుత్వం తిరిగి హాజరు కావలసి ఉన్నది. ఆ విధంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 16ల మధ్య అడకత్తెరలో పోక చెక్క వలె చిక్కుకున్న సర్కారు వారి ఆపద్ధర్మ జ్ఞానోదయమిది అని ఎందుకు భావించకూడదు? సరిగా ఇదే స్ఫూర్తి సంబంధిత అధికారులను కూడా ఆవహించినట్టున్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఎం.డి.దానకిశోర్‌ల మాటలు అటూ ఇటుగా ఈ విధంగా ఉన్నాయి: – హైడ్రా అంటే బూచి కాదు, భరోసా. పర్మిషన్ ఉన్న ఏ నిర్మాణాన్ని కూల్చివేయం. ఇండ్లలో కుటుంబాలు నివసిస్తున్నా ముట్టుకోం. పేదలకు, మధ్య తరగతికి అన్యాయం చేసే ఉద్దేశం లేదు. చిన్నవాళ్లు, పేదల జోలికి వెళ్లడం లేదు. ఏ ఒక్కరినీ బలవంతంగా తరలించం. మూసీ నిర్వాసితులకు శాశ్వత పునరావాసం, జీవనోపాధి కల్పిస్తాం. ప్రక్షాళన సుందరీకరణ కోసం కాదు, నదిని శుభ్రం చేసేందుకు. విద్యార్థులకు గురుకులాల్లో ప్రవేశం కల్పిస్తాం. 23 ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేశాం. ఫిర్యాదులకు ప్రత్యేక యాప్, వగైరాలు.
అర్థం కాని విషయం ఏమంటే, ఇటువంటి గొప్ప మాటలు, భరోసానిచ్చే మాటలను ప్రజలకు మూడు నెలల క్రితం హైడ్రాను ప్రకటించినప్పుడే ఎందుకు చెప్పలేదు? వారి ప్రాంతాలకు పోయి గుట్టుచప్పుడు కాని సర్వేలు చేసి, ఇండ్లకు ఎర్రగుర్తులు వేసి, ఇండ్లపైకి రేకుల షెడ్లపైకి నోటీసులు ఇచ్చి, ఇవ్వకుండా, పోలీసులతో భయపెడుతూ షెడ్ల కూల్చివేతతో, ఉపాధి పోగొడుతూ గిన్నెలలో అన్నాలు ఉడుకుతుండగా, పిల్లల పుస్తకాలు లోపలే ఉండగా, కోర్టులు ఉండని రోజులను చూసి, కోర్టులుంటే స్టేలు తెచ్చుకుంటారనే దారుణమైన మాటలతో జేసీబీ పటాలాలను పంపి నిరాశ్రయులను చేసినప్పుడు ఈ వివేకం ఏమైంది? హైకోర్టు కొరడా దెబ్బల భయం లేనట్లయితే ఈ వివేకోదయాన్ని నటించనైనా నటించి ఉండేవారా? హైడ్రాకు చట్టబద్ధత లేని రోజులలోనూ ఉందని బుకాయించి, అదే ప్రశ్న న్యాయస్థానం వేసినపుడు తలలువాల్చుకునేవారా?
అదేవిధంగా మరెన్నో సూటి ప్రశ్నలకు? ప్రభుత్వమూ, ఈ అధికారులూ ఇప్పుడు చేస్తున్నవి, అంటున్నవి కొన్నింటిని గమనించండి. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులన్నింటి ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గుర్తింపుతో సమగ్ర సర్వే జరపాలని ప్రభుత్వం ఈ నెల మొదటివారం చివరన 7వ తేదీ నాడు ఉత్తర్వు చేసింది. ఆ పని చేయగానే వెబ్సైట్లో వివరాలు పెట్టాలంది. ఇటువంటి మౌలికమైన, ప్రాథమికమైన పని చేయవలసింది ఎప్పుడు? కూల్చివేతలకు ముందా, పని మొదలుపెట్టిన మూడు మాసాల తర్వాతనా? అసలు ఇటువంటి సర్వే జరిగిందా, ఆ మ్యాపులు ఎక్కడ, వాటిపై తుది నోటిఫికేషన్లు ఇచ్చారా అని హైకోర్టు ఇప్పటికే నిలదీసింది. ఆ మాటను మళ్లీ విచారణలలో ముందుకు తెచ్చే అవకాశం లేకపోతే, ఇప్పటికైనా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చేవారా? పోతే, ఈ సర్వేను 45 సంవత్సరాల డేటా, మ్యాపుల ఆధారంగా చేస్తామంటున్నారు. ఇది 2024వ సంవత్సరం. 45 సంవత్సరాలంటే 1979 అవుతుంది. దానిని బట్టి 1979ని కటాఫ్ సంవత్సరంగా భావిస్తున్నారా? లేక ఇందులోనూ లౌక్యం చూపుతున్నారా? ఈ మాటను వారు నిర్దిష్టంగా ప్రకటించలేదు.
వాస్తవానికి ఈ హైడ్రా వ్యవహారం మొదలైనప్పటి నుంచి ఇంతవరకు కటాఫ్ తేదీపై స్పష్టత అన్నదే లేదు. ఇంత ముఖ్యమైన విషయంలో కటాఫ్ తేదీ ఎంత కీలకమో చెప్పనక్కరలేదు. కానీ ప్రభుత్వం ఆ సంగతే గుర్తించకుండా అవకతవకల పరిపాలన సాగిస్తున్నది.
ఆ కటాఫ్ సంవత్సరం 1979 అవుతుందా అన్నది ఇప్పుడైనా స్పష్టంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇస్తే, ప్రజలకు ఒక పెద్ద అయోమయం తీరుతుంది. ఆ పనిచేస్తారా? వాస్తవానికి ప్రభుత్వానికి పూర్తిగా వివేకం కలిగి ఉంటే, హైకోర్టు గత విచారణ జరిగిన సెప్టెంబర్ 30 నుంచి, మరుసటి విచారణ జరగనున్న అక్టోబర్ 16 మధ్య గల రెండు వారాల వ్యవధిని ఉపయోగించుకొని మరికొన్ని పనులు చేయవలసింది. కూల్చివేతలకు ముందు నోటీసులు ఇవ్వకపోవటం, హఠాత్తుగా కూల్చివేతలు, జోన్ల గుర్తింపు మొదలైనవాటి గురించి న్యాయమూర్తి మొదటిసారి విచారణ సమయంలోనే ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రభుత్వం, అధికారులూ రెండుసార్లు కూడా ఖాతరు చేయనందువల్లనే ఆగ్రహించి మూడవ విచారణకు రంగనాథ్‌ను, ఒక తహిశీల్దార్‌ను కోర్టు సమక్షానికి సమన్ చేశారు.
కనుకనే వారు ఈ మాత్రమైనా కదిలారు గానీ, ఇప్పటికైనా ఈ రెండు వారాల సమయాన్ని ఉపయోగించుకొని, చేయవలసిన మరికొన్ని చేయటమే లేదు. ఉదాహరణకు, ఆయా స్థలాలను రిజిష్టర్ చేసింది అధికారులే, నిర్మాణాలకు అనుమతులిచ్చిందీ వారే. కొన్ని సందర్భాలలో ఇది దశాబ్దాల కిందటే జరిగింది. ఇవన్నీ ప్రభుత్వ శాఖలు చేసినప్పుడు ఇప్పుడు మరొక ప్రభుత్వ శాఖ వచ్చి ఇదంతా చట్టవిరుద్ధమంటే అర్థం ఏమిటని, సదరు అధికారులపై చర్యలేమిటని కోర్టు ఇప్పటికే ప్రశ్నించింది. అందుకు ప్రభుత్వం ఒక ఆరుగురికి నోటీసులివ్వటం మినహా తక్కిన అధికారులను, ఇంతవరకు కనీసం గుర్తించలేదు. చర్యల మాట, ఇందుకు బలవుతున్న పౌరులకు పరిహారాల సంగతి తర్వాతి విషయం. ఒకవేళ ఈ అంశాలు రానున్న వాయిదాలలో కోర్టు ప్రస్తావిస్తే ఏమి సమాధానం చెప్తారు?
ఇటువంటివే మరికొన్ని ప్రశ్నలున్నాయి. ఒకవేళ హెచ్ఎండీఏ పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్జోన్లను 45 ఏండ్ల డేటాతో గుర్తించబూనితే, ఆ కాల పరిధిలోనూ వేర్వేరు ప్రభుత్వ ఏజెన్సీల డేటా వేర్వేరుగా ఉండి, మ్యాపులు, సర్వే నంబర్లు తేడాగా ఉండి, వేర్వేరుగా ఉండి, వాటి మధ్య వైరుధ్యాలున్న కేసులు కనిపిస్తున్నాయి. అందుకు ఒక ప్రముఖమైన ఉదాహరణ దుర్గం చెరువు వద్ద గల అమర్‌కాలనీ. అటువంటప్పుడు వాటిని ఏ ఆధారాలతో, ఏ తర్కంతో, ఏ విధంగా రికన్సయిల్ చేసి దేనిని ప్రామాణికంగా నిర్ధారిస్తారు? దేనిని చేయబూనినా కొన్ని నిర్మాణాలకు సంబంధించి పేచీ వస్తుంది. అట్లాగే, 45 సంవత్సరాలకు ముందు- తర్వాత అన్న విభజన కూడా ఈ హైదరాబాద్ మహానగర ఆధునిక విస్తరణ 1979కి ముందే మొదలై అందులో భాగంగా చట్టబద్ధమైన, చట్ట విరుద్ధమైన నిర్మాణాలు కూడా సాగుతూ వచ్చినప్పుడు ఈ 1979 గడువు కూడా చిక్కులకు దారితీయగలదు. అసలు 45 సంవత్సరాలనే నిర్ధారణలోని తర్కమేమిటి? కనుక అవి కోర్టు చిక్కులుగానూ మారుతాయి. అందుకు ప్రభుత్వం వద్ద సమాధానాలున్నాయా?
ఈ కార్యక్రమం వల్ల నగరంలోని చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతంలో నిర్వాసితులు కాగలది ఎందరు? వారికి పరిహారాలేమిటి, ప్రత్యామ్నాయ నివాసాలు, ఉపాధులు, చదువులు, వైద్యాలు, రవాణా సదుపాయాల వంటి వాటిపై అన్నీ చేస్తామనే మాటలు (ఈ నెలలోనే ఉపాధి కమిటీ ఒకటి వేశారు) తప్ప, ఇంత పెద్ద కార్యక్రమంపై హైడ్రాను ప్రకటించి మూడు నెలలు గడిచినా ఒక సమగ్ర ప్రణాళిక లేదు. ఇప్పటికైనా ప్రకటించలేదు నోటి మాటలు తప్ప. నిధుల కేటాయింపులు లేవు.
ఇందుకు సంబంధించి మరొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. మూసీని శుద్ధి చేయటం, అందుకోసం నదిలోని మురుగును, చెత్తను తొలగించటం, వ్యర్థాలు కొత్తగా చేరకుండా చూడటం, పారిశ్రామిక రసాయన వ్యర్థాలను రానివ్వకపోవటం, తమ కార్యక్రమమని అధికారులు తమకు ఆల్యసంగా తట్టిందనే అభిప్రాయం కలిగేట్లు ప్రజలకు ఇప్పుడు చెప్తున్నారు. ఇకముందు చేయదలచింది ఏమిటో చెప్పాలి. ప్రస్తుత కూల్చివేతల సందర్భంలో అంతకన్న ముఖ్యంగా, ఈ శుద్ధి సంబంధిత కార్యక్రమాలన్నీ మొదట అమలు జరిపి ఫలితాలను చూడకుండా, మొదట కూల్చివేతలు, ఆ తర్వాత శుద్ధి అనే తలకిందుల విధానంలోని తర్కం ఏమిటో వివరించాలి. ఎన్నో చోట్ల జరిగినట్లు, కొందరు నిపుణులు ఇప్పటికే ఎత్తిచూపినట్లు, మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మించటం, అదే సమయంలో శుద్ధి కూడా జరపటం, ట్రీట్మెంట్ ప్లాంట్ల సంఖ్యను తగినం త పెంచటం ద్వారా సమస్య పరిష్కారం అవుతుం దా లేదా అనే అధ్యయనాన్ని ప్రభుత్వం ఎందువ ల్ల చేయించి చూడటం లేదో ప్రజలకు తెలియాలి.
పోతే, నిధుల కొరత పేరిట అభివృద్ధి, సంక్షేమాలను పక్కన ఉంచి, రాష్ట్రంపై భారీగా అప్పుల భారం ఉందని కూడా అంటూ, ( రుణమాఫీ పూర్తిగా చేయలేకపోవటానికి కారణం ఆర్థిక సమస్యలని, అప్పు పుట్టటం లేదని, కనుక గత డిసెంబర్ 9న చేస్తామన్న మాఫీని వచ్చే డిసెంబర్ 9 నాటికి గాని చేయలేమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ఈ నెల 13న సెలవిచ్చారు. ఆగస్టు 15 గడువును నిలబెట్టుకోలేకపోయినట్లు కూడా మరోసారి ఆ విధంగా అంగీకరించారు. అటువంటప్పుడు హడావుడిగా ఈ లక్షన్నర కోట్ల ప్రాజెక్టును తలకెత్తుకోవలసిన అత్యవసరం ఏమి వచ్చిందనే ప్రశ్నలు, మెయిన్ హార్ట్ అనే కన్సల్టెన్సీ కమ్ అమలు కంపెనీ రూపంలో భారీ కుంభకోణం ఉందా అనే ఊహాగానాలు వినవస్తున్నాయి గాని, ప్రస్తుతం ఆ చర్చలోకి వెళ్లటం లేదు. ప్రధానమైన ప్రశ్నలకు సంబంధించిన జవాబులే ప్రభుత్వం నుంచి ఇంకా రావలసి ఉన్నందున, ప్రజలకు, హైకోర్టుకు రాగల రోజులలో ఏమి వివరించగలరో చూడవలసి ఉంది.
-టంకశాల అశోక్