ఉద్యానవన ఉత్పత్తుల అంతర్జాతీయ సంస్థ (ఏఐపీహెచ్) నుంచి ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ హరితనగరి అవార్డును, అంతర్జాతీయ మహా నగరాలతో పోటీపడి హైదరాబాద్ గెలుచుకోవడం భారతీయులందరికీ గర్వకారణం. మన హైదరాబాద్ నగరమే గతంలో ఆర్బర్ డే ఫౌండేషన్- ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ చేత ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’ గుర్తింపును తెచ్చుకున్నది. ఇదే సందర్భంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత హరిత గుర్తింపు తెచ్చుకోవడం హర్షణీయం. ఈ సత్కారాలను తెలంగాణ సమాజం సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ అంతా పుడమి పచ్చ కోక కప్పుకొన్నదా అన్నట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలో వృక్ష సంపద 104 శాతం పెరిగిందని ‘ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారె స్ట్’ నివేదికనే వెల్లడించింది. ఈ కృషిలో భాగమే హైదరాబాద్ నగరం సాధించిన అంతర్జాతీయ ఖ్యాతి, యాదగిరిగుట్టకు లభించిన హరిత ప్రశంస!
హైదరాబాద్ వంటి నగర ప్రాంతంలో పచ్చదన కార్యక్రమాన్ని చేపట్టడమే సవాలు. స్థానిక పాలన, నగరాభివృద్ధి శాఖలను నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్ హరిత హైదరాబాద్‌ను రూపుదిద్దడంలో చేసిన కృషి కూడా ప్రశంసనీయం. నగరంలో ఎక్కడ ఖాళీ స్థలాలుంటే అక్కడ మొక్కలు నాటించడంతో కాంక్రీట్ జంగిల్‌గా ఉన్న హైదరాబాద్ హరిత నగరి సొబగును సంతరించుకున్నది. యాదాద్రి మాడల్ మియావాకి, వర్టికల్, థీమ్ పార్క్‌ల ఏర్పా టు, రహదారి కూడలుల సుందరీకరణ ఉద్యమ స్ఫూర్తితో సాగింది. జీహెచ్ఎంసీ 4846 కాలనీలను గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. కేసీఆర్ సారథ్యంలోని రాజకీయ నాయకత్వం, అధికారులు, ప్రజలు నిబద్ధతతో కృషి చేయడం వల్లనే హైదరాబాద్ అంతర్జాతీయ యవనికపై తళుకులీనుతున్నది.
విశ్వ గురువు అంటే ఎవరు? ప్రపంచానికి తమ ఉత్తమ కార్యాచరణ ద్వారా ఆదర్శంగా నిలిచే వారే కదా! ఈ విధంగా చూస్తే తెలంగాణ సమాజాన్నే విశ్వగురువుగా చెప్పుకోవచ్చు. పారిశ్రామికీకరణ సాగిస్తూనే, ప్రజల కష్టసుఖాలను పట్టించుకొని సంక్షేమ పాలన అందిస్తున్న రాష్ట్రమిది. తెలంగాణ సమాజ హితమే కాదు, మొత్తం భూగోళంపై మానవాళి మనుగడ కోసం ప్రకృతి పరిరక్షణ నేటి కర్తవ్యమని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తదనుగుణంగా పథక రచనలు చేస్తున్నారు. ‘వాయూనామ్ శోధకాః వృక్షాః రోగానామపహారకాః/ తస్మాత్ రోపణమేతేషాం రక్షణం చ హితావహం’- వృక్షాలు గాలిని పరిశుభ్రం చేస్తాయనీ, వ్యాధి నిర్మూలన గావిస్తాయని, వాటిని కాపాడటమే హితకరమని ప్రాచీన భారతం ప్రపంచానికి చాటింది. ఆ బోధనను తెలంగాణ ఆచరించి ప్రపంచం చేత భళా అనిపించుకుంటున్నది!