‘ఓడెక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగినాక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం. ఎన్నికల సమయం లో కుప్పలు తెప్పలుగా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ తీరా గద్దెనెక్కినాక వాటి అమలును మరిచిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ గాల్లో కలిసిపోయింది. పర్మినెంట్ మాట దేవుడికెరుక, ఉన్న కారుణ్య నియామకాలను రద్దుచేసి హోంగార్డులకు పెద్ద షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. 600 మందికిపైగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను ఇవ్వలేమని తెగేసి చెప్పింది. మొత్తంగా హోంగార్డులు మోసపోయి గోస పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వచ్చిందో, లేదో.. అలా ఇబ్బందుల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నారు హోంగార్డులు. ఏ ముహూర్తాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో కానీ, అప్పటినుంచి వేతనాలు సరిగా రాక నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కో నెల జీతం కోసం 25వ తేదీ వరకు వేచి చూడాల్సి వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేల మంది హోంగార్డులున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు హోంగార్డులు తనువు చాలించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మినీ పోలీసులుగా గుర్తింపు ఉన్న వీరికి కనీసం ఉద్యోగి అనే మర్యాద కూడా లేకుండాపోయింది. ఉన్నతాధికారులు వెట్టిచాకిరి చేయించుకోవడం కోసమే హోంగార్డులను నియమించినట్టు ఉన్నది వారి పరిస్థితి.
జీతం తక్కువైనా రెగ్యులర్ పోలీసులతో సమానంగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకైనా ఇన్ని గంటల పని అంటూ ఒక లెక్క ఉంటుంది. కానీ, హోంగార్డులకు మాత్రం టైం అంటూ ఉండదు. ఉన్నతాధికారులు ఎప్పటిదాకా చేయమంటే, చచ్చినట్టు అప్పటిదాకా చేయాల్సిందే. లేకుంటే వీరినే లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తారు. ఉన్నతాధికారుల ఇండ్లకు కూరగాయలు తీసుకురావడం దగ్గరి నుంచి, పిల్లల్ని స్కూల్లో వదిలిరావడం వరకు ఎన్నో పనులు హోంగార్డుల తో చేయిస్తున్నారు. పోలీస్స్టేషన్లలోనూ వదిలిపెట్టడం లేదు. ఉదయం, సాయంత్రం సీఐ, ఎస్సైలకు టీ, టిఫిన్ తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఒకవైపు పోలీసుశాఖలో ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేసినట్టు చెప్తున్నా మరోవైపు అధికారులు మాత్రం అనధికారికంగా ఆర్డర్లీ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. సెలవులుంటాయా అంటే అవీ లేవు. పోనీ, ఉద్యోగ భద్రత ఉంటుందా అంటే అదీ లేదు. ఒళ్లు వంచి ఏండ్ల తరబడి పనిచేసినా పదవీ విరమణ రోజు వట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిందే.
హోంగార్డు అనేది స్వచ్ఛంద దళం. 1946, డిసెంబర్లో భారతదేశంలో మొదటిసారిగా పౌర విఘాతం, మతపరమైన అల్లర్లను నియంత్రించడంలో పోలీసులకు సహాయం చేయడానికి ఈ దళాన్ని ఏర్పాటుచేశారు. ఈ స్వచ్ఛంద పౌరుల దళాన్ని అనేక రాష్ర్టాలు ఆమోదించాయి. సుప్రీం తీర్పు ప్రకారం… హోంగార్డులకు జీతాలు, ఇతర అలవెన్సులు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి.వీరు రోజువారీ విధులు నిర్వహిస్తే రూ.1000 ఇస్తారు. వీరికి ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తించవు. పనిచేస్తే వేతనం ఉంటుంది. లేకపోతే ఆ రోజు వేతనం ఉండదు. ఆరోగ్యం బాగున్నా, లేకపోయినా జీతం రావాలంటే పని చేయక తప్పదు.
రాష్ట్రంలోని ఒక్కో హోంగార్డుకు సుమారు రూ.37,500 అలవెన్స్ రూపేణా రావాల్సి ఉన్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో కలిపి రూ. 5 లక్షలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్ల వంటి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవేవీ పట్టించుకోవడం లేదు. చనిపోయిన హోంగార్డు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన ఉన్నా అదీ అతీ గతీ లేదు. సరికదా అరవై ఏండ్లు నిండిన హోంగార్డులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం కంపెనీ కమాండర్, ప్లాటూన్ కమాండర్ వంటి పదోన్నతులు కల్పించాల్సి ఉన్నది. అది కూడా అమలు కావడం లేదు. ఇప్పటికైనా హోంగార్డుల సంక్షేమం పట్ల పాలకులు జాలి చూపకపోతే వారి బతుకులు బానిస బతుకులుగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.
-అనంతాత్మకుల కొండబాబు
9494408878