అగ్గో ! అందరికన్నా ముందే
తాత ఓటెయ్యబోతున్నడు !
హుశారుగా పొద్దున లేసి
యాప పుల్ల నోట్లేసుకొని
గల్లీల ఇయ్యాల ఓటెయ్యబోవాలె
ఇగ పంటే కుదరదు
లెగండి అంటూ వైతాళికుడిలా తాత!
కాళ్లకు కిర్రు కిర్రు చెప్పులేసుకొని
అరిగేటట్టు తిరుగుతున్నడు !
తాత కంచు కంఠస్వరం ముందు
డప్పుల మోత మెత్తవడ్డట్టే ఉంటది
తాత తానంజేసి
గిన్నెడు అంబలి దాగి
తెల్లటి దోతి, తలకు పట్కా
చేతిలో కట్టె వట్టుకొని ఓటెయ్యబోతున్నడు !
ఒక్కడే కాదు, అవ్వ ఎంబడి రాంగ
పోరని లెక్క
రాజు మాదిరి నడుసుకుంటా
తాత ఓటెయ్యబోతున్నడు !
తాత ఎనకనే ఎందరో
యాది మరువకుండా ఓటెయ్యబోతున్నరు !
ఓట్లు పడే రోజు ఊర్ల పక్కా జాతర లెక్కనే మరి !
తాతకు ఓటేసే తరీఖా మంచిగ తెలుసు
ఊరోళ్లందరికీ అనుభవంతోని ట్రేనింగ్ ఇచ్చిండు
తాత వేలి మీద గతంల ఓటేసినట్టు
ఎన్ని సిరా చుక్కలు వడ్డయో
మనం ఓటెయ్యడం మరువద్దు
ఓటేస్తనే దునియలా ఉన్నట్టు
తాత గులాల్ సల్లుకుంటా
తన వాడకట్టు బలగంతోని గుంపుగ కలిసి
ఆగినోల్లను నడువుమని
తాత ఓటెయ్యబోతున్నడు!
తాత ఎనక మనం గూడ ఓటెయ్యబోవాలె
తాత కన్నా ముందే ఓటెయ్యాలే!!
కందాళై , రాఘవాచార్య
8790593638