ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అగ్గి విద్యార్థులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29నే ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్-1 పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల రిజర్వేషన్లకు జీవో నెంబర్ 29 పెద్ద అడ్డంకిగా మారింది. అందుకే గ్రూప్-1 అభ్యర్థు లు ప్రభుత్వానికి ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా, జీవో 29ని పక్కనపెట్టి, జీవో 55ను అమలుచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు ముందుకురావడం లేదు. పైగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తూ, వారిని జైళ్లలో పెడుతూ పైశాచికానందాన్ని పొందుతున్నది.
Telangana | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగనున్నది. అగ్రవర్ణాల విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ వారిని జనరల్‌గా పరిగణించడం లేదు. వారికి రిజర్వేషన్ వర్తింపజేయడం వల్ల మరో రిజర్వ్ అభ్యర్థికి అవకాశం లేకుండా పోతు న్నది. అంతేకాదు, గత బీఆర్ఎస్ సర్కారు తీసుకువచ్చిన 95 శాతం లోకల్ రిజర్వేషన్‌ను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. దీంతో ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఎర్ర తివాచీ పరిచినట్టయిందని నిరు ద్యోగులు గోడు వెల్లబోసుకుంటున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం ‘నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 55 ప్రకారం అన్నివర్గాల నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం చేసింది. అంతేకాదు, యూపీఎస్సీ విధానాన్ని సైతం అమలు చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలుచేయడం లేదో అం తుచిక్కడం లేదు. గ్రూప్-1 అభ్యర్థులను పిలిచి, వారు అడుగుతున్న సహేతుకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. జీవో 29 పట్ల రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్ట మైన అవగాహన లేనప్పుడు నిరుద్యోగ అభ్యర్థులకు ఏం సమాధానం చెప్తుందని సామాజిక మాధ్యమాల్లో మేధావులు విశ్లేషిస్తుండటం ప్రభు త్వ అసమర్థతను తెలియజేస్తున్నది. ఇదిలా ఉంటే, నిరుద్యోగ విద్యార్థు లు గత కొన్నేండ్లుగా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కానీ, ఇప్పటినుంచి వికీపీడియాను ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అర్థం లేని, వితండ వాదన చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు, ఏ నిర్ణ యం తీసుకుంటున్నదో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని గ్రూప్-1 అభ్యర్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ బతుకులను బుగ్గిపాలు చేస్తున్నదని నిరుద్యోగ, గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 29ను పక్కనపెట్టాలని విద్యార్థులు తమదైన శైలిలో నిరసనలను తెలియజేస్తున్నారు. వారిలో కాబోయే డీఎస్పీలు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. అలాంటి వారి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పోలీసుల వైఖరి దురుసుగా ఉంటున్నది. తెలంగాణ భవిష్యత్తుకు సారథులుగా నిలిచే గ్రూపు-1 అభ్యర్థులనే ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నదంటే మామూలు ప్రజల పరిస్థితి ఏమిటో మనం ఊహించుకోవచ్చు. రోడ్డెక్కిన ఉద్యోగార్థులను పోలీసులు గొడ్డును బాదినట్టు బాదడం సబబేనా? ఆడపిల్లలని కూడా చూడకుండా వారిని, అర్ధరాత్రి దాకా పోలీస్‌స్టేషన్‌లో పెట్టడం న్యాయమేనా?
ఇదిలా ఉంటే.. రాష్ట్ర బీజేపీ నాయకులు భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నా రు. విద్యార్థుల తరఫున పోరాడాల్సిన బీజేపీ నాయకులు ప్రభుత్వానికే వత్తాసు పలుకుతుండటం నిజంగా సిగ్గుచేటు. ఇటు గ్రూప్-1 అభ్యర్థు లకు, అటు ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరించి సమస్యను సద్దుమణిగించే ప్రయత్నం చేయాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరింత దుమారం లేపుతున్నాడు. మొదటి నుంచి విద్యార్థుల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ రాజకీయం చేయడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. గ్రూప్-1 విద్యార్థుల తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి క్రెడిట్ ఎక్కడ దక్కుతుందో అన్నదే ఆయన తాపత్రయం. అంతేకాదు, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని ఆ సీటు నుంచి తప్పించాలని రాష్ట్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారని బండి వ్యాఖ్యానించడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని తెలియజేస్తున్నది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో 29ను పక్కనపెట్టి ఈ సమస్యకు ఇంతటితో స్వస్థి పలకాలి. లేకుంటే నిరుద్యోగుల లొల్లి ఢిల్లీకి పాకినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అశోక్‌నగర్‌లో ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ ఇంటిని ముట్టడి చేసేందుకు నిరుద్యోగ అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భం గా విద్యార్థి లోకానికి నేను చేప్పేదేమంటే… మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రస్తుతానికి జరుగుతున్న పరీక్షలు జాగ్రత్తగా రాసి, విజయాన్ని సాధిం చండి. కొట్లాడటం, ఉద్యమాలు చేయడం తెలంగాణ రక్తంలోనే ఉన్నది. మన హక్కులను మనం సాధించుకునేదాక విశ్రమించకుండా పోరాడు దాం. మీకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. అందులో భాగంగానే గ్రూప్-1 నిరుద్యోగ అభ్యర్థుల తర ఫున సుప్రీంకోర్టులో వాదించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చర్యలు చేపట్టింది. అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయిన ‘తెలంగాణ భవన్’ మీకు ఒక జనతా గ్యారేజ్‌లా పనిచేస్తుంది. ప్రతిపక్ష పార్టీగా న్యాయం కోసం తలుపు తట్టిన ప్రతి వ్యక్తికి అండగా నిలుస్తుంద నడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.
(వాసకర్త: బీఆర్ఎస్ పార్టీ నాయకులు)
-డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
95530 86666