రాష్ట్రం ఏర్పడిన పదేండ్లలోనే ఉద్యమకారులు, కళాకారులు తెలంగాణ అస్తిత్వం కోసం మరోసారి గొంతెత్తాల్సి రావడం బాధాకరమైన విషయం. తెలంగాణ ఉద్యమానికి పరాయి పాలకుల దోపిడీ ఎంత కారణమో, వాళ్ల చేతిలో అవమానానికి గురవుతున్న తెలంగాణ అస్తిత్వపు కళలను కాపాడుకోవాలనే తపన కూడా అంతే కారణం.
తెలంగాణ వాళ్లకు బట్ట కట్టడమే రాదని, తెలంగాణ ప్రజలు మాట్లాడేది సంస్కారవంతమైన భాషే కాదని, తెలంగాణ వాళ్లకు వరి బువ్వ తినడం కూడా తెల్వదని, వలసాంధ్రులు వచ్చినాకనే తెలంగాణ ప్రజలు సంస్కారం నేర్చుకొని జీవించారని పదే పదే చెప్తుండటంతో తెలంగాణ అగ్గి అయి మండింది. మన పాటలను, మన మాటలను కేవలం జోకర్లకు, గూండాలకు పరిమితం చేస్తూ సినిమా రంగంలో మనకు చేసిన అవమానం అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీ పేరు మీద బతుకొచ్చిన ఆంధ్రులకు అప్పనంగా కట్టబెట్టిన భూములు తెలంగాణవే. ప్రోత్సాహం పేరుతో ఇచ్చిన నిధులు కూడా తెలంగాణవే. అయినప్పటికీ ఆంధ్రా పాలకుల చేతిలో తెలంగాణ ప్రజలకు మిగిలింది అవమానమే. తెలంగాణ పండుగలను కానీ, తెలంగాణ కళలను కానీ వారి సినిమాలలో గౌరవంగా చూపించిన దాఖలాలు ఏనాడూ లేవు. అదీగాక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా అనేక సినిమాలను రూపొందించి వలసానందం పొందారు.
ఆస్కార్ కంటే ఆత్మాభిమానమే గొప్పది తెలంగాణ ప్రజల మాటల్లోనే ప్రత్యేకమైన బాణీ ఉంటది. ఇది మన సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం. ఇక్కడి ఒగ్గు కళలు, భాగవతపు చిందు, భక్త సిరియాల, హరిశ్చంద్ర కథాగానాలు, బైండ్ల కథాబాణీలు, మందెచ్చుల వంటి అనేక ఆశ్రిత కులాల ప్రత్యేక బాణీలు తెలంగాణ ఇంటింటి జీవనంలో భాగమై ఉంటయి. తెలంగాణలో తంగేడు బుర్ర (బెరడు) ఊదితే కూడా సంగీతమే వస్తది. తాటి ఆకులు కూడా వీణలై మోగుతై. తెలంగాణ ప్రజలకు పాటంటే జీవన్మరణం, పాటంటే ఓ ధిక్కారం. అలాంటి పాటను పరాయి కళాకారులకు అప్పజెప్పడం మన ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం.
నాడు ఎవరైతే ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో ‘స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె’ అనే పదం ఉంటే మేము పాడమన్నారో.. అదే గీతాన్ని రాష్ట్ర గీతంగా స్వర కల్పనల కోసం వారి చేతిలోనే నేడు పెట్టడమంటే పాటకున్న తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమే. తెలంగాణలో పాటకు అస్తిత్వం లేకుండా చేయడం ద్వారా ప్రధానంగా రెండు వర్గాల మెప్పు పొందే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమోననే అనుమానం కలుగుతున్నది. ఒకటి నల్గొండ కేంద్రంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో బండి యాదగిరి లాంటి ప్రజా కవులు ‘బండెనుక బండి కట్టి, ఏ బండ్లే పోతవ్ కొడుకో నా కొడుకా ప్రతాపరెడ్డి’ అంటూ ఎర్రపహాడ్ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరి రాంచంద్రారెడ్డి లాంటి భూస్వామిక వర్గం మీదికి పాట రూపంలో తూటాలు ఎక్కుపెట్టిన్రు. మరొకటి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోని గీతోని పాలోనివా’, ‘ఆంధ్ర వలస వాదుల్లారా ఇడవకుంటే పాతరే-పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే’ అంటూ ఉద్యమ పాటలు వలసాంధ్ర పాలకవర్గాన్ని నిద్ర కూడా పోనియ్యలేదు. ఇవేగాక ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లీ బందీ అయిపోయిందో కనిపించని కుట్రల’, ‘అమ్మా తెలంగానమా ఆకలి కేకల గానమా’ వంటి పాటలు తెలంగాణ ప్రజల గోసను చెప్తూ ఉద్యమంలో తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్క తాటిపైకి తీసుకువచ్చినయి.
బెల్లి లలితక్కను ముక్కలు ముక్కలు చేసినట్టుగా పాటకున్న చైతన్యాన్ని, ప్రాంతీయ అస్తిత్వాన్ని మట్టిలో కల్పేస్తూ, రాష్ట్రంలో అగ్ర కుల భూస్వాములకు, దోపిడీ వలసాంధ్రులకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి మరోసారి వారికి వ్యతిరేకంగా అస్తిత్వపు పాట వినపడకుండా వారిని సంతృప్తిపరిచి, వారి మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువనగిరిలో ప్రశాంత్ అనే విద్యార్థి గురుకుల వసతి గృహంలో ఆహారం కలుషితమై చనిపోతే, అంతకు కొద్దిరోజుల ముందే భువనగిరిలో భవ్య, వైష్ణవి అనే వెనుకబడిన కులాల బిడ్డలు ఒకేసారి ఆత్మహత్య చేసుకొని చనిపోతే కనీసం పరామర్శించని ముఖ్యమంత్రి స్వయంగా ఆంధ్రుల ఆఫీసులకు వెళ్లి కూర్చోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
సామాజిక తెలంగాణ బోగసేనా?: సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటుచేస్తమన్న రేవంత్రెడ్డి మెజారిటీ వెనుకబడిన కులాలను పాలితులుగానే ఉంచి, కేవలం ఒక సామాజిక వర్గానికే పాలనాధికారం కట్టబెడుతున్నారు. రాష్ట్ర సంపద, సహజ వనరులు తమ గుప్పెట్లో పెట్టుకొని రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందనడం హాస్యాస్పదం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్నట్టు బీసీలకు స్థానికసంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, ఆరు నెలల్లో కులగణన పూర్తిచేస్తమన్న ప్రభుత్వం ఇంకా కార్యాచరణనే మొదలుపెట్టలేదు.
ఉద్యమకారులను గుర్తిస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి అధికార పీఠమెక్కిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులను ఒక్కరిని కూడా ప్రభుత్వంలోకి తీసుకోకపోవడం నిరంకుశత్వానికి నిదర్శనం. అత్యంత వెనుకబడిన కులాల వెల్ఫేర్ మంత్రిత్వశాఖ ఏర్పాటు, వెనుకబడిన వృత్తి కులాలకు వృత్తి బజార్ల పేరిట అందుబాటులోకి తెస్తామన్న వసతుల ఊసే ఎత్తకపోవడం శోచనీయం.
(వ్యాసకర్త: తెలంగాణ స్టూడెంట్స్
పరిషత్ ఓయూ కన్వీనర్)
-మధు యాదవ్ నూకల
63033 43359