నేడు భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవం. 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జరుపుకొంటున్నాం. దీని ఉద్దేశం ఓటర్లుగా తమకున్న హక్కులు, బాధ్యతల గురించి భారత పౌరులకు అవగాహన కల్పించడం.
ప్రజాస్వామ్యంలో ఓటర్లకు అభ్యర్థుల నేపథ్యం గురించి తెలుసుకునే హక్కున్నది. అభ్యర్థులకు సంబంధించిన తగిన సమాచారం తెలుసుకుని ఓటేయడం కీలకమైన అంశం. అందువల్ల అభ్యర్థులపై ఏవైనా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉంటే పత్రికలలో ప్రచురించాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన వాగ్దానాలు చేసే హక్కు రాజకీయపక్షానికి ఉంటుంది. అయితే దానివల్ల ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుంది.
ఎన్నికల సంఘం (ఈసీఐ) 1950 జనవరి 25న మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటైంది. ఈసీఐకి పనితీరులో, నిర్ణయాధికారంలో పూర్తి స్వాతంత్య్రం ఉండేలా రాజ్యాంగసభ ఆర్టికల్-324 ప్రకారం రాజ్యాంగ హోదాను ఇచ్చింది. అరకొర అక్షరాస్యత ఉన్న సమయంలో, ఓటర్ల జాబితా అనేదే లేనికాలంలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలను నిర్వహించడానికి శాశ్వత, స్వయం ప్రతిపత్తి గల కమిషన్‌ను ఏర్పాటుచేయడం రాజ్యాంగసభ దూరదృష్టికి నిదర్శనం. ఇప్పటి వరకు నిర్వహించిన 17 లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవికి 16 సార్ల చొప్పు న నిర్వహించిన ఎన్నికలు, 399 సార్లు నిర్వహించిన శాసనసభల ఎన్నికలు ఈసీఐ సమర్థత, నిష్పాక్షికత, విశ్వసనీయతకు అద్దం పడుతున్నా యి. అంతర్జాతీయంగా పలుదేశాల్లో ఎన్నికల ఫలితాలపై వివాదాలు ముసురుకుంటాయి. కానీ, భారతదేశంలో అటువంటిది ఎన్నడూ జరుగలేదు. ఈసీఐ రాజకీయపార్టీల, భారతదేశ పౌరుల విశ్వాసాన్ని పొందింది.
పటిష్ఠమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికలు చాలా కీలకం. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. ఓటు హక్కు అనేది దాన్ని వినియోగించుకున్నప్పుడే దాని శక్తి ఏమిటో తెలుస్తుంది. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సూక్తి మనకు గుర్తు కువస్తుంది- ‘మనం విధులను నిర్వర్తించకుండా వదిలేసి, హక్కుల కోసం పరుగెత్తితే, అవి మనకు దక్కకుండా పోతాయి’. 94 కోట్లకు పైగా నమోదిత ఓటర్లను కలిగి ఉన్న మన దేశానిది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. గత సార్వత్రిక ఎన్నికల్లో (2019) వాస్తవ ఓటింగ్ సంఖ్య 67.4 శాతం ఉందంటే, ఇంకా మనం చేరుకోవలసింది ఎంతో ఉన్నది. ఓటింగ్ వేయని 30 కోట్ల మంది ని పోలింగ్ బూత్‌కు రప్పించగలగడం మన ముందున్న సవాలు.
ఓటు వేయకపోవడానికి పట్టణ ఉదాసీనత, యువత ఉదాసీనత, దేశీయ వలసలు వంటి అనేక కోణాలున్నాయి. చాలా ఉదారవాద ప్రజాస్వామ్య దేశాల వలె మన దేశంలో కూడా ఓటరు నమోదు, ఓటింగ్ స్వచ్ఛందమైనది. ఓటరును ఒప్పించడం, ఓటింగ్‌ను సులభతరం చేయడం వంటి పద్ధతులు ఉత్తమమైనవి. పోలింగ్ తక్కువగా ఉన్న నియోజకవర్గాలు, ఓటు వేయని వర్గాలపై దృష్టిపెట్టాలి.
రెండు కోట్లకు పైగా ఉన్న ఎనభై ఏండ్లు, ఆ పైబడిన వృద్ధులను, ఎనభై ఐదు లక్షల మంది దివ్యాంగులను, 47,500 మంది థర్డ్ జెండర్ వ్యక్తులను ఓటేసే విధానాలను వ్యవస్థీకరించింది. ఇటీవలే రెండు లక్షల మంది శతాధిక వృద్ధులైన ఓటర్లకు ప్రజాస్వామ్యం పట్ల వారికి గల నిబద్ధతకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలు రాశాను. హిమాచల్‌ప్రదేశ్‌లోని కల్పలో 2022 నవంబర్ 5న కీర్తిశేషులు శ్యామ్ శరణ్ నేగికి నివాళులు అర్పించాను. 1951 తొలి సార్వత్రిక ఎన్నికలలో ఓటేసిన ఆయన 106 ఏండ్ల వయసులో మరణించేవరకు ఏనాడూ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండలేదు. ఓటు వేయాలన్న మన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆయనే స్ఫూర్తి.
యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరంలో, ఆ తర్వాత జన్మించిన తరంవారు ఓటర్ల జాబితాలో చేరడం ప్రారంభమైంది. ఓటర్లుగా వారి భాగస్వామ్యం దాదాపు ఈ శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపొందిస్తుంది. అందువల్ల విద్యార్థులకు ఓటువేసే వయస్సు వచ్చేలోపు పాఠశాల స్థాయి లో ప్రజాస్వామ్య భావాలు నాటడం అవసరం. యువతను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ఆకర్షించడం జరుగుతున్నది. ఓటేయడం పట్ల విముఖత కలిగిన పట్టణ ఓటర్ల పట్ల కూడా ఈ ప్రయత్నం సాగుతున్నది.
ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రంలో మరుగుదొడ్లు, విద్యుత్తు, తాగునీరు, ర్యాంపులు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటయ్యేలా చూస్తున్నది. పాఠశాలల్లో శాశ్వత సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, దీంతో ఆర్థికంగా కూడా గిట్టుబాటుగా ఉంటుందని ఎన్నికల కమిషన్ భావిస్తున్నది.
ప్రజాస్వామ్యంలో ఓటర్లకు అభ్యర్థుల నేపథ్యం గురించి తెలుసుకునే హక్కున్నది. అభ్యర్థులకు సంబంధించిన తగిన సమాచారం తెలుసుకుని ఓటేయడం కీలకమైన అంశం. అందువల్ల అభ్యర్థులపై ఏవైనా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉంటే పత్రికలలో ప్రచురించాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన వాగ్దానాలు చేసే హక్కు రాజకీయపక్షానికి ఉంటుంది. అయితే దానివల్ల ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుంది. ఓటర్లను ప్రలోభపెట్టే మోతాదు కూడా కొన్ని రాష్ర్టాలలో ఎక్కువగా ఉన్నది. కఠినమైన నిఘా కారణంగా చాలాచోట్ల నగదు పట్టివేత జరిగింది. అయితే ప్రజాస్వామ్యం పట్ల ఓటర్ల చిత్తశుద్ధి, అప్రమత్తతకు మించిన ప్రత్యామ్నాయం లేదు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై సాధారణ ప్రజలు సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనివల్ల ఎన్నికల పరిశీలకులు వెంటనే చర్య తీసుకోవడం సాధ్యమైంది.
విశ్వసనీయమైన ఎన్నికల ఫలితాలను అందించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పాతుకుపోయిన ప్రజాస్వామ్య విధానాలు ఇప్పుడు మార్పునకు గురవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా వార్తలను, అభిప్రాయాలను లేదా ఫేక్ న్యూస్‌ను భారీ ఎత్తున, వేగంగా ప్రసారం చేయవచ్చు. అందువల్ల ఇది ఎన్నికల నిర్వహణలో ఉపయోగించే ఇతర సాంకేతిక రంగాలను మించి పోయింది. ఎన్నికల కమిషన్ పాత్రను, పరిధిని నిర్దేశించినట్టుగా ఏ చట్టం, నైతికంగా ఈ సోషల్ మీడియాను కట్టడి చేయలేకపోతున్నది. అప్రజాస్వామిక శక్తులు ఈ సాంకేతికతను ప్రభావవంతంగా వాడుకుంటున్నాయి.
ఎన్నికలకు ముందు కొన్ని వందల
ఫేక్ సమాచారాన్ని, వీడియోలను ప్రసారం చేస్తున్నారు. ఎన్నికల వ్యవస్థ నియమాలకు వ్యతిరేకమైన ఈ వీడియోలకు కాలపరిమితి లేకపోవడం వల్ల ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా చెలామణి అవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కృత్రిమ మేధ సాంకేతికత ద్వారా ఇటువంటి తప్పుడు ప్రచారాలనుఅరికడతాయనే ఆశాభావం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అవుతున్నది. భావ స్వేచ్ఛతో పాటు, ఇతర స్వేచ్ఛలను పరిరక్షించుకునే బాధ్యత అందరిపై ఉంటుంది. ఫేక్ న్యూస్ వల్ల ఎన్నికల కమిషన్ బాధ్యతల నిర్వహణ మరింత క్లిష్టదాయకమవుతుందని గ్రహిస్తే, ఎవరికి వారు తమ తప్పును సవరించుకోగలుగుతారు.
ఎన్నికలను అందరి భాగస్వామ్యంతో ఓటరుకు అనుకూలమైనరీతిలో, నైతికబద్ధంగా జరుపుకోవాలనే ఎన్నికల కమిషన్ లక్ష్యాన్ని జాతీయ ఓటరు దినోత్సవం ప్రతిబింబిస్తుంది. ‘ఓటేయడానికి మించింది లేదు, తప్పకుండా ఓటేయండి’ అనేది ఈ 13వ ఎన్నికల దినోత్సవ భావన. ఇది ఓటర్లను ఆకట్టుకోగలుగుతుంది. పౌరులు ఓటరుగా గర్వపడిన నాడు, ఓటేయడం తన పౌర బాధ్యతలో భాగమని భావించిన నాడు ఆ ప్రభావం పరిపాలనా స్థాయిపై తప్పకుండా ఉంటుంది.
ఓటరు దినోత్సవ శుభాకాంక్షలు
(వ్యాసకర్త: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్)
రాజీవ్ కుమార్