వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో జరిగే బీఆర్ఎస్ మొదటి సభ ప్రజాక్షేత్రంలో పార్టీ పునరుజ్జీవనానికి నాంది పలకగలదని భావించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత వెనుకబాటుకు గురైన పార్టీకి ఈ స్వల్పకాలంలోనే ప్రజల్లో తిరిగి ఆదరణ పెరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు మొదటి కారణం, కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీల అమలులో తడబడుతున్నదనే భావన ప్రజల్లో క్రమంగా ఏర్పడుతుండటం కాగా, రెండవది ఈ మూడు నెలల కాలంలో అసెంబ్లీలో, బయట కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ విమర్శలకు, ఆరోపణలకు సమర్థవంతంగా జవాబులిచ్చి అధికార పక్షాన్నే ప్రజల దృష్టిలో పలచన చేయగలగటం. మూడవది, పార్టీ ఓటమికి కారణాలను, సంస్థ బలోపేతానికి సూచనలను విస్తృతమైన సమీక్షల ద్వారా కనుగొని అందుకు అనుగుణంగా తగిన కార్యాచరణకు సంసిద్ధులు కావటం. నాల్గవది, కేసీఆర్ నాయకత్వ స్థాయికి, ప్రతిష్ఠకు సరిపోగల నాయకుడెవరూ ఇతర పార్టీలలో నేటికీ కనిపించటం లేదన్న ప్రజల అభిప్రాయం.
కరీంనగర్ సభలో ఈ నాలుగు అంశాల ప్రాతిపదికగా రాష్ట్ర ప్రజలకు విషయ వివరణ చేయటంతో పాటు మరొక ముఖ్యమైన పని కూడా చేయగలిగితే మరింత ప్రయోజనకరంగా ఉండవచ్చు. అది, కరీంనగర్లో 2001లో జరిగిన మొదటిసభలో పార్టీ లక్ష్యాలు, ఆశయాలు ఏమిటో చెప్పిన విధంగా, అప్పటినుంచి 23 ఏండ్లు గడిచిన తర్వాత నిర్వహిస్తున్న ఈ కీలకమైన సభలో ఆయా లక్ష్యాలను, అప్పటినుంచి ముందుకువచ్చిన కొత్త విషయాలను, అప్పటితరంతో పాటు కొత్త తరాలకు తెలియజేసి మరొకమారు ఉత్తేజపరచటం. దీనినే మరొక మాటలో వివిధ విషయాలపై మౌలికంగా పార్టీ దృక్పథం, ఫిలాసఫీ అనవచ్చు. ఇటువంటిది ఏ రాజకీయ పార్టీకైనా అవసరమని తెలిసిందే. కాగా, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ ఫెడరలిస్టు పార్టీకి మరింతగా అవసరం.
దేశంలోని ఇటువంటి ఫెడరలిస్టు పార్టీలన్నింటికి తప్పనిసరి అవసరం. అవి ప్రాంతీయ ప్రజల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను పరిరక్షిస్తూ, అటువంటి సామాజిక, రాజకీయ శక్తులకు ప్రాతినిధ్యం వహించాలి గనుక.ఆ క్రమంలో, కేంద్రీకరణ శక్తులను, అవి ప్రాంతీయ ప్రయోజనాలకు, ప్రాంతీయ శక్తులకు భంగం కలిగించేవాటిని ఎదుర్కొని నిలబడవలసి ఉంటుంది గనుక.
మొదటి పేరాలో ప్రస్తావించిన నాలుగు అంశాలు ప్రస్తుత లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుంటూ చెప్పుకొన్నవి. వాటిలోని మొదటి రెండింటి పరిస్థితి మునుముందు కాలాన్ని బట్టి మారవచ్చు. మూడవది పార్టీని రాగల కాలంలో ఏ విధంగా బలోపేతం చేయగలరన్నదానిపై ఆధారపడి ఉంటుంది. నాల్గవది చిరకాలం నిలిచిపోయే ప్రజాభిప్రాయం. అవి అట్లుండగా ఇప్పుడు చెప్పుకొన్న పార్టీ లక్ష్యాలు, ఆశయాలు, ఫెడరలిస్టు ఫిలాసఫీ, వాటితో పాటు సెక్యులరిస్టు విలువలన్నవి బీఆర్ఎస్కు పునాదుల వంటివి అవుతాయి. పునాది ఎంత పటిష్టంగా ఉంటే నిర్మాణం అంత పటిష్టం, దీర్ఘకాలికమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఆ లక్షణాలు గల పునాది, నిర్మాణాలు భూకంపాలతో సహా ఎటువంటి ఒడిదుడుకులనైనా తట్టుకొని నిలబడగలవు. అందుకే మొదటి నాల్గింటికన్న ఇది మౌలికం, దీర్ఘకాలికం అవుతున్నది.
కరీంనగర్ సభావేదిక ఫిలాసఫీ ప్రసంగాలకు తగిన సందర్భం కాదన్నది నిజమే. అక్కడ మొదట పేర్కొన్న నాలుగు అంశాల చుట్టే ప్రసంగాలు తిరుగుతాయి. దానితో పాటు, ఇవి లోక్సభ ఎన్నికలు అయినందున వాటిలో బీఆర్ఎస్ గెలవటం తెలంగాణ ప్రయోజనాలకు ఏ విధంగా అవసరం? ఎన్నికలు ఏవైనా అవి తెలంగాణ ప్రయోజనాలతో ఎట్లా ముడిబడి ఉంటాయి? కాంగ్రెస్, బీజేపీల వంటి జాతీయ పార్టీలు ఏ విధంగా మొదటినుంచి కూడా రాష్ర్టాలను, వాటి ఫెడరల్ హక్కులను, ప్రాంతీయ ప్రయోజనాలను అణచివేస్తూ కేంద్రీకరణ శక్తులకు లాభం చేస్తున్నాయి? తమ ఢిల్లీ అధికారం కోసం ప్రాంతాలను ఎట్లా ఉపయోగించుకుంటున్నాయి? నిజానికి తెలంగాణ రాష్ట్ర కోరికకు, ఉద్యమానికి, త్యాగాలకు ఏ విధంగా ఈ పరిస్థితులు కూడా ఒక ముఖ్య కారణం? అనే విషయాలు తెలంగాణకు చెందిన పాత, కొత్త తరాల వారి దృష్టికి బలంగా మరొకసారి తీసుకుపోవటం కూడా ఒక తప్పనిసరి అవసరం.
ఆ విధంగా మొదటి నాలుగు అంశాలు, ఈ ఐదవ అంశం పడుగు పేకల వలె కలిసి సాగాలి. అది ఎంత జరిగితే తెలంగాణ స్ఫూర్తి, ఫెడరల్ స్ఫూర్తి అంతగా రూపుదిద్దుకుంటుంది. అందువల్ల ప్రస్తుత లోక్సభ ఎన్నికల సందర్భానికి గాని, మునుముందు కాలానికి గాని కలిగే ప్రయోజనమేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విధంగా బీఆర్ఎస్ అర్థవంతం, ఆరోగ్యవంతం, సుస్థిరం, దీర్ఘకాలికమవుతుంది.
ఇప్పుడు, పైన మొదటిపేరాలో పేర్కొన్న నాలుగు అంశాలను కొద్దిగా చర్చిద్దాం. మొదటిది హామీల అమలు. మిగిలిన వాటికన్న ముఖ్యంగా ప్రజల మనస్సులో మెదిలేది హామీల అమలు. అవి వారి జీవితాలకు ప్రత్యక్షంగా సంబంధం కలవి గనుక. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో వందల కొద్ది హామీలున్నప్పటికీ వారు ప్రత్యేకంగా నొక్కి చెప్పి విస్తృతంగా ప్రచారం చేసిన 6 గ్యారెంటీలపైనే ప్రస్తుతానికి అందరూ దృష్టిపెట్టారు. అవి స్థూలంగా 6 అయినప్పటికీ వాటిలో భాగంగా, మొత్తం 13 గ్యారెంటీలున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ 13లో చేర్చకపోయినా ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పదే పదే రైతులకు తేదీ గడువుతో పాటు ఇచ్చిన మరొక హామీ డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ. ఆ విధంగా మొత్తం 14 హామీలయ్యాయి. మొదటి 13కు 100 రోజుల గడువు వారు నిర్ణయించుకున్న ప్రకారమే ఈ నెల 17వ తేదీతో ముగుస్తుంది. వాటిలో కేవలం 2 పూర్తిగా అమలుకు తేగా, 3 మ్యానిఫెస్టోలో చెప్పినట్టు కాకుండా అరకొరగా ప్రారంభించారు. తక్కినవాటి జాడలేదు. 100 రోజుల గడువులో 94 రోజులు తీరిపోగా ఇక మిగిలింది కేవలం 6 రోజులు.
గమనించదగినది ఏమంటే ప్రస్తుతం ప్రజలు ఈ హామీల గురించి మాట్లాడుతూనే అంతకన్న ముఖ్యంగా పంటలకు, తాగేందుకు నీళ్లు , విద్యుత్తు సరఫరా గురించి అంతటా చర్చిస్తున్నారు. ఎందుకన్నది వివరించనక్కరలేదు. ఆ దృశ్యాలు అంతటా, అందరికీ కనిపిస్తున్నవే. వీటన్నింటితో పాటు ప్రజల నోళ్లలో బాగా నలుగుతున్నవి మరికొన్ని ఉన్నాయి. అవి, ఆటో రిక్షా వారి ఇక్కట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లు ఆగిపోవటం, తులం బంగారం ప్రస్తావనలు లేకపోవటం, రైతుబంధు అస్తవ్యస్తంగా మారటం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను ఎటువంటి సంకోచ బిడియాలు లేకుండా తమవిగా చెప్పుకోవటం, అప్పటిదే అయిన ఆరోగ్యశ్రీ బీమా హెచ్చింపును కూడా తమదే అనటం వంటివి. అంతటా ప్రజలు మరొకటి కూడా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిచి వచ్చిన తర్వాత చేయవలసిన పనులపై దృష్టి కేంద్రీకరించటానికి, పరిపాలనను సుస్థిరపరచటానికి బదులు అసెంబ్లీలో, బయట కూడా నిత్యం కేసీఆర్ను దూషించటమే ఒక కార్యక్రమంగా పెట్టుకోవటం. ఇవేవీ ప్రజలు మెచ్చటం లేదు. పరిస్థితి 100 రోజులలోనే ఈ విధంగా ఉన్నప్పుడు మునుముందు సంగతేమిటనే ప్రశ్న కూడా వారి మధ్య వస్తున్నది. వీటన్నింటి మధ్య వారికి కేసీఆర్ గుర్తుకురావటం మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో కరీంనగర్ సభలో కేసీఆర్కు సభికులతో, ఆ ప్రసారాన్ని చానళ్లలో చూసే బయటి ప్రజలకు మధ్య మరొకసారి ప్రత్యక్షమైన కనెక్టివిటీ ఏర్పడగలదు. కృష్ణా ప్రాజెక్టుల విషయమై నల్లగొండ సభ సందర్భంగా ఏర్పడిన కనెక్టివిటీ ఆ నిర్దిష్ట అంశానికి సంబంధించినది కాగా, ఇప్పుడు కరీంనగర్లో అది సమస్త అంశాలను చుట్టగలదని భావించవచ్చు.
ఈ మూడు నెలల కాలంలో ప్రజలు గమనించిన మరొక అంశం అధికారపక్షం వారు బీఆర్ఎస్పై, వ్యక్తిగతంగా కేసీఆర్పై సాగించిన నిరంతర దాడి త్వరలోనే తేలిపోవటం. పైగా, గత పాలనలో జరగలేదన్నవి అనేకం వాస్తవానికి జరిగినట్లు ప్రజలకు తమ అనుభవం ద్వారా తెలియటం. చేసిన అనేక ఆరోపణలు బీఆర్ఎస్ సభ్యుల వివరణలు, వాదనల ముందు గాలికి దూదిపింజల వలె ఎగిరిపోవటం. చివరికి మేడిగడ్డ అంశం కూడా కాంగ్రెస్ స్వయంగా చేసిన రెండు దోషాల వల్ల ప్రజల దృష్టిలో పలచబడిపోయింది.
ఒకటి, కుంగిన మూడు పిల్లర్లు, అన్నారం, సుందిళ్ల సీపేజీలపై సత్వరమే నిపుణులతో పరిశీలన చేయించి మరమ్మతులు జరిపి నీరిచ్చే అవకాశం కోసం ప్రయత్నించటానికి బదులు ఆరోపణలతో కాలక్షేపం చేయటం, మూడు నెలలు గడిచినాక గాని ఎన్డీఎస్కు పూర్తిస్థాయిలో అప్పగించకపోవటం మొదటి దోషం. మరొకవైపు రబీ పంటలు పొలం మీద ఉండి నీళ్లురాక ఎండుతూ రైతులు అల్లాడిపోతుండగా, అటు దృష్టిపెట్టి ఏమీ చేయక నీళ్లివ్వలేమంటూ చేతులు ఎత్తివేయటం. కేసీఆర్ కాలంలో ఇటువంటి సమస్య ఎన్నడూ రాలేదని, ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఏదో ఒకటి చేసి నీరు ఇవ్వగలిగేవారని రైతులు భావించటం. ఈ నిష్క్రియాపరతలు ప్రభుత్వపు రెండవ దోషం. కరీంనగర్ సభలో ఇవన్నీ సహజంగానే చర్చకువస్తాయి. ప్రజలకు మరింత స్పష్టతనిస్తాయి.
పైన చెప్పుకున్న మూడవ అంశం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ జరిపిన సమీక్షలు. అందుగురించి ఇక్కడ మనం చర్చించేదంటూ లేదు గాని, ఆ సమీక్షల ద్వారా గ్రహించిన విషయాలు పార్టీ నాయకత్వం దృష్టిలో ఉంటాయి గనుక ఆ సారాంశాలు కరీంనగర్ సభ నిర్వహణలో, ప్రసంగాలలో ప్రతిఫలించగలవని భావించవచ్చు. చివరి అంశం వ్యక్తిగతంగా కేసీఆర్ నాయకత్వ స్థాయి, వివిధ విషయాలపై అవగాహనలు, నిబద్ధతలు, అంతటి ప్రతిష్ట గల మరొక నాయకుడు ఎవరూ ఏ పార్టీలోనూ ప్రజలకు కన్పించకపోతుండటం. ఈ వ్యత్యాసాలు మునుపు కూడా ఉండేవని వారికి తెలుసు. ఆ తేడా ఇప్పుడు మరింత కొట్టవచ్చినట్టు కనిపించటం మొదలైంది. కరీంనగర్ సభ సందర్భంగా ప్రజల స్పందనల రూపంలో ఇది మనం చూడవచ్చు.
-టంకశాల అశోక్