కులగణన ఎందుకు? ఇదేం పిచ్చి ప్రశ్న. దేశ జనాభాలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ కులాల వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి. తెలుసుకొని రాజకీయ పార్టీలు ఆయా కులాల ఓట్లు సంపాదించడానికి ప్రణాళికలు వేసుకోవచ్చును. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. తర్వాత రాజకీయ సింహాసనాలు అధిష్ఠించవచ్చు. అనంతరం వాటిని సుస్థిరం చేసుకునేందుకు కూడా కులగణన పనికొస్తుంది.
సుమారు దశాబ్దం కిందటి సినిమా ఇప్పుడు గుర్తుకువస్తున్నది. అందులో హీరో గ్రహాంతరవాసి. భూమ్మీదకి వచ్చి అప్పుడే పుట్టిన పిల్లల్ని రెండు కాళ్లు పట్టి పైకెత్తి, వారి శరీరంపై ఏమైనా కుల, మత చిహ్నాలు ఉన్నాయేమోనని చూస్తాడు. ఏమీ కనపడవు. మరి కులాలు ఎక్కడినుంచి వస్తున్నాయో ఎంత అలోచించినా అతడికి అర్థం కాదు. మనకూ అర్థం కాదు.
సినిమాను వదిలి వాస్తవానికి వద్దాం. పుట్టిన పిల్లవాడికి నాలుగైదు సంవత్సరాలు వచ్చాక తల్లిదండ్రులు బడిలో చేరుస్తారు. అప్పుడు వారి కులానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో చేరుస్తుంటారు. జీవితంలో మొదటిసారి పిల్లవాడికి తాను ఎస్టీ, ఎస్సీ లేక బీసీనని, తాను సంఘంలో వెనుకబడిన వాడినని తెలుస్తుంది. ఇది అవసరమా? పిల్లవాడు పెరిగి పై క్లాసుకు వస్తాడు. స్కాలర్షిప్ పరీక్ష రాస్తాడు. ఓసీ పిల్లవాడికన్నా తక్కువ మార్కులు వచ్చినా స్కాలర్షిప్ వస్తుంది. మొదటిసారి తన కులం పేరు పనికి వచ్చింది. ఓసీ విద్యార్థికి కారణం తెలిసి మనసు చివుక్కుమంటుంది. స్కాలర్షిప్ మాత్రమే కాదు.. సీట్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఉద్యోగాల్లోకి వచ్చాక మళ్లీ అక్కడా ఇదే తంతు. గరిష్ఠ వయసు, ప్రమోషన్ల విషయంలోనూ ఇదే రిజర్వేషన్ వర్తిస్తుంది. నిజానికి ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులకు అవరోధాలే కదా! ఆదిమ జాతులు, దళిత కులాలు శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురికావడంతో రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్లు కల్పించి పైకి తేవాలని యోచించారు. అది కూడా పదేండ్లు మాత్రమే కల్పించాలని రాశారు. దేశంలో అలా రిజర్వేషన్లు మొదలయ్యాయి. రిజర్వేషన్లు అప్పుడు, ఇప్పుడూ వివాదాస్పదమే.
మండల కమిషన్ రాక తర్వాత బీసీ కులాలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఇవి క్రమంగా పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇప్పుడు ప్రతి సామాజిక వర్గమూ తాము వెనుకబడ్డామంటే, తాము వెనుకబడ్డామని పోటీ పడుతున్నాయి. రిజర్వేషన్లకు రాజ్యాంగంలో పెట్టిన గడువు ముగిసినా, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు వాటిని పొడిగించుకుంటూ పోతున్నారు. దీంతో రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వల్ల ఒకసారి లాభపడిన వారు మళ్లీ లాభపడకూడదనే ఉద్దేశంతో క్రీమీలేయర్‌ను తీసుకొచ్చింది. తర్వాత అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించకూడదని చెప్పినా, రాజకీయ నాయకులు దానినీ లెక్క చేయడం లేదు. రాజ్యాంగ సవరణలతో ముందుకొస్తూనే ఉన్నారు.
ఈ రిజర్వేషన్ల వల్ల ప్రతి క్యాటగిరీలో, ప్రతి సామాజికవర్గంలో కొందరే లబ్ధి పొందుతున్నారు. వారు మళ్లీ మళ్లీ లాభపడుతుండటంతో సమాజంలో వివాదాలు, విరోధాలు పెరిగాయి. ఎస్టీల్లో లంబాడాలు బాగా లాభం పొందుతున్నారని కోయలు మొదలగు తెగల వాళ్లు ఆరోపిస్తున్నారు. అలాగే, ఎస్సీలలో మాదిగలు ఉప రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. మణిపూర్ సమస్యకు ప్రధాన కారణం కూడా ఈ రిజర్వేషన్లే. ఎస్టీ రిజర్వేషన్ కావాలని మైతేయి తెగవారు కోర్టుకెళ్లడం, వారు ఇప్పటికే చాలా పొందుతున్నారని, కాబట్టి వారికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కుకీలు వాదిస్తున్నారు.
ఈ రిజర్వేషన్లతో దేశం, సమాజం ఇలాగే నడవాలంటే, మనకు ఎన్ఎంఎంఎస్, నీట్, జేఈఈ, గేట్, క్యాట్ మొదలైన ఏ పరీక్షలూ ఇక అవసరం లేదు. కోచింగ్ సెంటర్లు అసలే అక్కర్లేదు. చక్కగా జనాభా లెక్కల్లో కులగణన పూర్తిచేసుకుని ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ కులాల నిష్పత్తులు తయారుచేసుకుంటే చాలు. దాని ప్రకారం అన్ని ప్రొఫెషనల్ కోర్సులో సీట్లు ఇచ్చుకోవచ్చు. ఉద్యోగ నియామకాలు జరుపుకోవచ్చు. చదువుకైనా, పనికి, ఉద్యోగానికైనా ఆ వ్యక్తి ఆసక్తి, పనిలో నేర్పరితనం, క్వాలిఫికేషన్స్, అనుభవం, ఆరోగ్యం మొదలైనవి మాత్రమే కొలమానాలు కావాలి. సమాజంలో పెద్దలు, విద్యార్థులు, ఓటర్లు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ ఆలోచించదగిన విషయం ఇది.
(వ్యాసకర్త: రిటైర్డ్ సీజీఎం, సింగరేణి )
-మరింగంటి శ్రీరామ
83095 77123